రిలయన్స్ జియో ఎన్సీడీ ఇష్యూకి అనూహ్య స్పందన
♦ రూ.2,000 కోట్లకు రూ.3,700 కోట్ల బిడ్‌లు
♦ డిజిటల్ వ్యాపారం కోసమే ఈ నిధులు
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిలయన్స్ జియో సంస్థ నాన్-కన్వర్టబుల్ డిబెంచర్ల(ఎన్‌సీడీ) జారీ ద్వారా రూ.2,000 కోట్లు సమీకరించింది. బీఎస్‌ఈ ఇటీవలే కొత్తగా ప్రారంభించిన ‘బీఎస్‌ఈ బాండ్‘ ప్లాట్‌ఫామ్‌పై ఎన్‌సీడీల జారీ ద్వారా రిలయన్స్ జియో ఈ నిధులను రాబట్టింది. ఈ నిధులను డిజిటల్ సర్వీసుల వ్యాపార నిర్వహణ కోసం ఉపయోగిస్తామని పేర్కొంది. రూ.1,500 కోట్లు ఈ ఎన్‌సీడీ ఇష్యూ (రూ.500 కోట్ల గ్రీన్ షూ ఆప్షన్‌తో)కు అద్భుత స్పందన వచ్చింది.
ఇష్యూ ప్రారంభమైన కొద్ది నిమిషాలకే రూ.3,500 కోట్ల మేర బిడ్స్ వచ్చాయి. మొత్తం మీద రూ.3,700 కోట్ల బిడ్‌లు వచ్చాయి. ఐదేళ్ల ఈ ఎన్‌సీడీలకు వార్షిక కూపన్ రేటు 8.32 శాతంగా ఉంది. ప్రముఖ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు, బ్యాంక్‌లు ఈ ఇష్యూలో పాల్గొన్నాయి. తమ ఇష్యూకి ఇంత స్పందన రావడం సంతోషకరంగా ఉందని రిలయన్స్ ఇండస్ట్రీస్ ట్రెజరర్ సౌమ్యో దత్తా చెప్పారు. తమ డిజిటల్ సర్వీస్ వ్యాపారంపై ఇన్వెస్టర్లకు ఉన్న విశ్వాసానికి ఈ అనూహ్య స్పందనే నిదర్శనమని పేర్కొన్నారు.