సాక్షి, ముంబై: సంచలనాల టెలికాం సంస్థ మరో సంచలనానికి తీరతీసినట్టు తెలుస్తోంది. తాజా రిపోర్టుల ఆధారంగా ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో తన ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. వేలాదిమంది ఉద్యోగులను ఇంటికి పంపించింది. ఖర్చులను తగ్గించుకునే క్రమంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. 10 శాతం శాశ్వత ఉద్యోగుల తోపాటు, కాంట్రాక్టు ఉద్యోగులు 5 వేల మందిని తొలగించిందంటూ మీడియాలో పలు రిపోర్టులు వెలువడ్డాయి.
నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు లాభాలను పెంచుకునేందుకుగాను 5వేలమంది ఉద్యోగులను ఉద్వాసన పలికింది. ప్రస్తుతం రిలయన్స్ జియోలో 50 వేలమంది విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో పది శాతం అంటే 5 వేలమందిని ఉద్యోగం నుంచి తొలగించింది. ఇందులో 500-600 మంది శాశ్వత ఉద్యోగులున్నారు. ముఖ్యంగా జనవరి-మార్చి మధ్యకాలంలో సంస్థ వేలమంది కాంట్రాక్ట్ సిబ్బందిని తొలగించిందట. జియో పింక్ స్లిప్స్ సప్లై చైన్, హెచ్ఆర్, ఫైనాన్స్, అడ్మినిస్ట్రేషన్, నెట్ వర్క్స్ విభాగాల్లోని ఉద్యోగులకు రిలయన్స్ జియో పింక్ స్లిప్స్ ఇచ్చింది. గత రెండేళ్లలో నిర్వహణ మార్జిన్లలో పెద్దగా పురోగతి లేకపోవడంతో ఉద్యోగులను తొలగించినట్లుగా తెలుస్తోంది. అయితే నియామకాల్లో తమ సంస్థ కీలకంగా ఉంటుందని, కాస్ట్ కటింగ్ అనే ప్రశ్నే లేదని జియో స్పందించిందని ఈటీ నౌ రిపోర్ట్ చేసింది.
కాగా 2016లో టెలికాం మార్కెట్‌లో సునామీలా దూసుకొచ్చిన రిలయన్స్ జియో మూడేళ్లలోనే 30 కోట్ల యూజర్లకు చేరుకుంది. ప్రస్తుత యూజర్ల సంఖ్య 30.7 కోట్లు. యూజర్ బేస్ ప్రకారం 26 శాతం మార్కెట్ షేర్ కలిగి ఉంది. రెవెన్యూ మార్కెట్ షేర్ 31 శాతంగా ఉంది. గడిచిన ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రిలయన్స్ జియో 126.2 కోట్ల లాభాన్ని గడించింది. అంతకుముందు క్వార్టర్‌లో రూ.131.7 కోట్లు గడించింది.
Comments
Please login to add a commentAdd a comment