రెనో ‘క్విడ్’ వచ్చేసింది.. | Reno kwid came | Sakshi
Sakshi News home page

రెనో ‘క్విడ్’ వచ్చేసింది..

Published Thu, Sep 24 2015 11:59 PM | Last Updated on Sun, Sep 3 2017 9:54 AM

రెనో ‘క్విడ్’ వచ్చేసింది..

రెనో ‘క్విడ్’ వచ్చేసింది..

- అందుబాటులో ఆరు వేరియంట్లు
- ధరలు  రూ.2.57-రూ.3.53 లక్షల రేంజ్‌లో
- మైలేజీ 25.17 కి.మీ. (పెట్రోలు)


న్యూఢిల్లీ:
డస్టర్‌తో భారత కార్ల స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్(ఎస్‌యూవీ)మార్కెట్లో సంచలనం సృష్టించిన రెనో కంపెనీ చిన్న కార్ల మార్కెట్లో మరో సంచలనానికి తెర తీసింది. ఎంట్రీ లెవల్ సెగ్మెంట్లో సరికొత్తగా క్విడ్ కారును గురువారం ఆవిష్కరించింది. ఆరు వేరియంట్లు, ఐదు రంగుల్లో  లభించే క్విడ్ కారు పరిచయ ధరలు  రూ.2.57 లక్షల నుంచి రూ.3.53 లక్షల రేంజ్‌లో (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) నిర్ణయించామని రెనో ఇండియా తెలిపింది.

తాము క్విడ్ కారుతో ఒక కొత్త శకానికి నాంది పలికామని రెనో ఇండియా సీఈఓ ఎండీ, సుమిత్ సాహ్ని  చెప్పారు. చూడటానికి స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్(ఎస్‌యూవీ)లా కనిపించే ఈ కారులో ఐదుగురు ప్రయాణించవచ్చని, 800 సీసీ పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చామని, చెన్నై ప్లాంట్‌లో ఈ కార్లను తయారు చేస్తున్నామని తెలిపారు. మైలేజీ 25.17 కిమీ. వస్తుందని, భారత్‌లో అత్యధిక మైలేజీ ఇచ్చే కారు ఇదేనని చెప్పారు. ఈ కారు అభివృద్ధి కోసం రూ.3,000 కోట్లు పెట్టుబడులు పెట్టామని,  అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ కారును రూపొందించామని,  త్వరలో ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్(ఏఎంటీ)ను అందిస్తామని తెలిపారు. ఈ ఏడాది చివరినాటికి తమ డీలర్ల నెట్‌వర్క్‌ను 205కు, వచ్చే ఏడాది చివరికల్లా 280కు పెంచుతామని చెప్పారు. ఈ కారును భారత్ నుంచి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తామని వివరించారు.
 
ధరల పోరు షురూ!
చిన్న కార్ల మార్కెట్లో హల్‌చల్ చేస్తున్న మారుతీ సుజుకీ, హ్యుందాయ్‌ల విక్రయాలపై క్విడ్ ప్రభావం తీవ్రంగానే ఉండగలదని మార్కెట్ నిపుణులంటున్నారు. మారుతీ ఆల్టో, హ్యుందాయ్ ఈఆన్, టాటా నానో, డాట్సన్ గో, షెవర్లే స్పార్క్ కార్లకు ఈ క్విడ్ కారు గట్టిపోటీనిస్తుందని అంచనా. క్విడ్ ధర ఆకర్షణీయంగా ఉండటంతో చిన్న కార్ల మార్కెట్లో ధరల పోరు షురూ అయినట్లేనని వారంటున్నారు.
 
మైక్రో ఎస్‌యూవీ...
ప్రస్తుతం 2 శాతంగా ఉన్న మార్కెట్ వాటాను రెండేళ్లలో 5 శాతానికి పెంచుకోవాలని రెనో ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్య సాధన కోసం మొత్తం కార్ల మార్కెట్లో నాలుగో వంతుగా ఉన్న చిన్న కార్ల సెగ్మెంట్‌పై దృష్టిసారించింది. క్విడ్ కారును రంగంలోకి తెచ్చింది. 5 శాతం మార్కెట్ వాటా సాధించే లక్ష్య సాధనకు క్విడ్ కారు ఇతోధికంగా తోడ్పడుతుందన్న ఆశాభావాన్ని రెనో ఇండియా సీఈఓ ఎండీ, సుమిత్ సాహ్ని వ్యక్తం చేశారు. ఇది చిన్న కారు అయినా చూడ్డానికి మైక్రో ఎస్‌యూవీలా ఉంటుందని చెప్పారు.
 
కారు ప్రత్యేకతలు..
- సీఎంఎఫ్-ఏ ప్లాట్‌ఫామ్‌పై దీనిని రూపొందించారు. గ్రౌండ్ క్లియరెన్స్ 180 ఎంఎం, బూట్ స్పేస్ 300 లీటర్లు(చిన్న కార్ల సెగ్మెంట్లో అత్యధిక లగేజ్ స్పేస్ ఉన్న కారు ఇదే.
- 7 అంగుళాల టచ్‌స్క్రీన్ మీడియా నావ్ సిస్టమ్(ఎంట్రీలెవెల్ కార్లలో తొలిసారి ఈ సదుపాయం), డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 5 గేర్లు, 2 స్పీకర్లతో కూడిన స్టీరియో.
- ఏసీ విత్ హీటర్, వైజర్ ఆన్ ప్యాసింజర్ సైడ్, ఇంజిన్ ఇమ్మొబిలైజర్, గ్లోవ్‌బాక్స్, కీ లెస్ ఎంట్రీ విత్ సెంట్రల్ లాకింగ్.
- డ్రెవర్ ఎయిర్‌బ్యాగ్(ఆప్షనల్), వన్ టచ్ లేన్ చేంజ్ ఇండికేటర్, ముందు వైపు ఫాగ్ ల్యాంప్స్ వంటి ప్రత్యేకతలున్నాయి. రెండేళ్లు లేదా 50 వేల కి.మీ. వారంటీని కంపెనీ ఇస్తోంది.
 
రెనో క్విడ్ కారు... కొన్ని సంగతులు...

- భారత మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన క్విడ్ కారులో 98 శాతం స్థానిక విడిభాగాలనే వినియోగించారు. ఫలితంగా క్విడ్ నిర్వహణ వ్యయాలు ఈ సెగ్మెంట్లో అగ్రస్థానంలో ఉన్న ఆల్టో కారు కంటే 19 శాతం తక్కువగా ఉంటాయని సుమిత్ చెప్పారు.  భారత్‌కు సంబంధించి ఒక్క కొత్త మోడల్‌లో ఇంత అధిక స్థాయిలో స్థానిక విడిభాగాలను వినియోగించిన తొలి కంపెనీ తమదేనని చెప్పారు.
- ఈ కేటగిరీ కార్లలో అత్యంత తేలికైన(బరువు తక్కువగా ఉన్న) కారు ఇదే.
- డస్టర్ కారులో ఉండే కొన్ని ఫీచర్లు ఈ కారులో కూడా ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement