sports utility vehicle
-
ఎస్‌యూవీలపై మారుతీ సుజుకీ గురి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్ (ఎస్యూవీ) విభాగంపై దృష్టిసారించింది. ఈ సెగ్మెంట్లో 2023–24లో 33 శాతం వాటా చేజిక్కించుకోవడం ద్వారా తొలి స్థానాన్ని కైవసం చేసుకోవాలని లక్ష్యంగా చేసుకుంది. ప్రస్తుతం బ్రెజ్జా, గ్రాండ్ వితారా ఎస్‌యూవీలను కంపెనీ విక్రయిస్తోంది. మార్చి నుంచి జిమ్నీ, ఫ్రాంక్స్ మోడళ్లు రోడ్డెక్కనున్నాయి. జిమ్నీ ఇప్పటికే 17,500 యూనిట్లు, ఫ్రాంక్స్ 8,500 యూనిట్ల బుకింగ్స్‌ను కైవసం చేసుకోవడం విశేషం. భారత ప్యాసింజర్ వాహన రంగంలో స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్ వాటా 42.5 శాతం ఉంది. 2022–23లో ఇది 45 శాతానికి చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఈ విభాగంలో మారుతీ సుజుకీ వాటా 11.5 శాతం. మొత్తం ప్యాసింజర్ వాహన పరిశ్రమలో సంస్థకు ఏకంగా 45 శాతం వాటా ఉంది. దీనిని 50 శాతానికి పెంచుకోవాలని కంపెనీ కృతనిశ్చయంతో ఉంది. 2023 జనవరిలో ఎస్‌యూవీల విపణిలో మారుతీ సుజుకీ 15 శాతం వాటా దక్కించుకుంది. స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్ విభాగంలో 2021–22లో టాటా మోటార్స్‌కు 18 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రాకు 15 శాతం వాటా ఉన్నట్టు సమాచారం. -
మహీంద్రా థార్ కొత్త శ్రేణి
వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్ థార్ మోడల్లో రేర్ వీల్ డ్రైవ్ ట్రిమ్స్‌ను ప్రవేశపెట్టింది. మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్లో వీటిని రూపొందించింది. ధర రూ.9.99 లక్షల నుంచి ప్రారంభం. వీటిలో డీజిల్‌లో రెండు మాన్యువల్, పెట్రోల్‌తో ఆటోమేటిక్ వేరియంట్ ఉంది. కస్టమర్ల నుంచి వచ్చిన సూచనల మేరకు నూతన శ్రేణిని పరిచయం చేసినట్టు కంపెనీ ఆటోమోటివ్ విభాగం ప్రెసిడెంట్ విజయ్ నక్రా తెలిపారు. ఔత్సాహిక కస్టమర్లకు థార్ మరింత చేరువ అవుతుందని చెప్పారు. ఇక 4 వీల్ డ్రైవ్ శ్రేణి ఇప్పుడు ఆధునిక ఎలక్ట్రానిక్ బ్రేక్ లాకింగ్ సిస్టమ్‌తో తయారైందని కంపెనీ తెలిపింది. -
మెర్సిడెస్ కొత్త ఎస్యూవీ ‘జీఎల్సీ’
♦ పెట్రోల్. డీజిల్ వేరియంట్లలో లభ్యం ♦ ధర రూ.50.7 లక్షల నుంచి రూ.50.9 లక్షల రేంజ్లో న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీ మెర్సిడెస్ కొత్త స్పోర్ట్స్‌యుటిలిటీ వెహికల్(ఎస్యూవీ)ను గురువారం మార్కెట్లోకి తెచ్చింది. జీఎల్సీ పేరుతో ఈ ఎస్‌యూవీని పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో అందిస్తున్నామని మెర్సిడెస్ ఇండియా పేర్కొంది. 2143 సీసీ డీజిల్ ఇంజిన్‌తో రూపొందించిన జీఎల్సీ 220డి మోడల్ ధర రూ.50.7 లక్షలని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈఓ, రోలాండ్ ఫోలర్ చెప్పారు. అలాగే 1991 సీసీ పెట్రోల్ ఇంజిన్‌తో రూపొందించిన జీఎల్సీ 300, ధర రూ.50.9 లక్షలని(అన్ని ధరలు ఎక్స్ షోరూమ్, పుణే) వివరించారు. జీఎల్ఏ, జీఎల్ఈ లగ్జరీ ఎస్‌యూవీల మధ్య ఉన్న ఖాళీని ఈ తాజా జీఎల్సీ ఎస్యూవీ భర్తీ చేస్తుందని పేర్కొన్నారు. మెర్సిడెస్.. ఆరో ఎస్యూవీ: ఈ ఏడాది 12 కొత్త మోడళ్లను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, దీంట్లో భాగంగా ఈ ఏడాది తామందిస్తున్న ఐదో మోడల్ ఇదని రోలాండ్ వివరించారు. కాగా భారత్‌లో మెర్సిడెస్ అందిస్తున్న ఆరో ఎస్యూవీ మోడల్ ఇది. కారు ప్రత్యేకతలు.. : ఈ కారులో ఏడు అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ (ఈ ఎస్‌యూవీని 360 డిగ్రీల్లో చూడగలిగే ప్రత్యేకతను ఈ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ చూపగలదు) 20 సీడీల స్టీరియో, గర్మిన్ ఆధారిత నావిగేషన్, 2 యూఎస్బీ పోర్ట్‌లు, బ్లూ టూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఈ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌లో ఉన్నాయి. 9 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్, మల్టీపుల్ డ్రైవింగ్ మోడ్స్, 4మ్యాటిక్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్, ఎడాప్టివ్ బ్రేక్ లైట్స్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, 7 ఎయిర్‌బ్యాగ్‌లు వంటి ప్రత్యేకతలున్నాయని కంపెనీ అంటోంది. డీజిల్ ఎస్యూవీ 0-100 కిమీ వేగాన్ని 8.3 సెకన్లలో అందుకుంటుంది. గరిష్ట వేగం గంటకు 210 కిమీ. ఇక పెట్రోల్ ఎస్యూవీ 0-100 కిమీ. వేగాన్ని 6.5 సెకన్లలో అందుకుంటుంది. గరిష్ట వేగం గంటకు 222 కిమీ. -
జనరల్ మోటార్స్ ట్రైల్బ్లేజర్ వచ్చేసింది
ధర రూ.26.40 లక్షలు న్యూఢిల్లీ: జనరల్ మోటార్స్ ఇండియా కంపెనీ ప్రీమియం స్పోర్ట్స్ యుటిలిటి వెహికల్(ఎస్యూవీ) సెగ్మెంట్లో కొత్త మోడల్‌ను బుధవారం మార్కెట్లోకి తెచ్చింది. షెవర్లే ట్రైల్బ్లేజర్ పేరుతో అందిస్తున్న ఈ ఎస్యూవీ ధర రూ.26.40 లక్షలు(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). అని జనరల్ మోటార్స్ ఇండియా తెలిపింది. భారత్‌లో అమ్మకాలను పెంచుకునే వ్యూహంలో భాగంగా రానున్న ఐదేళ్లలో పది కొత్త మోడళ్లను జనరల్ మోటార్స్ ఇండియా తీసుకురానున్నది. ఆ పదింటిలో ఇది మొదటిదని జనరల్ మోటార్స్ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ అర్వింద్ సక్సేనా పేర్కొన్నారు. 2.8 లీటర్ డీజిల్ ఇంజిన్‌తో రూపాందిన ఈ ఎస్‌యూవీని థాయ్‌లాండ్ నుంచి దిగుమతి చేసుకొని ఇక్కడ విక్రయిస్తామని వివరించారు. ఇది అచ్చమైన షెవర్లే కారు అని తెలిపారు. అమెజాన్డాన్ఇన్ ద్వారా ఈనెల 21 నుంచి 25 తేదీల మధ్యలో ఈ కారు కోసం బుకింగ్‌లు చేసుకోవచ్చని, రూ. 25,000 డిపాజిట్ చేయాలని స్థానిక, షెవర్లే డీల ర్ల ద్వారా డెలివరీ తీసుకోవచ్చని తెలిపారు. షెవర్లే ట్రైల్బ్లేజర్ ప్రత్యేకతలు.. ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, వెనక భాగంలో ఎయిర్ కండీషనింగ్ కంట్రోల్స్‌ను సీలింగ్‌లో అమర్చడం, ఆరు గేర్లు(ఆటోమేటిక్), 7 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో కూడిన మైలింక్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డ్యుయల్ ఎయిర్‌బ్యాగ్స్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, ఏడుగురు సౌకర్యంగా కూర్చునేలా 3 వరుసల సీట్లు, హిల్ స్టార్ట్ అసిస్ట్, హిల్-డెసెంట్ కంట్రోల్, కీ లెస్ ఎంట్రీ, రూఫ్-రెయిల్స్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ప్రత్యేకతలున్నాయి. -
నాలుగేళ్లలో ఈ ఘనత: కంపెనీ
అమ్మకాలు ః1.5 లక్షలు న్యూఢిల్లీ: మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ప్రీమియం స్పోర్ట్స్ యుటిలిటి వెహికల్ (ఎస్యూవీ) మోడల్ ఎక్స్‌యూవీ500 వాహనాలు లక్షన్నర అమ్ముడయ్యాయి. 2011 సెప్టెంబర్‌లో ఎక్స్‌యూవీ500ను మార్కెట్లోకి తెచ్చామని, ఇప్పటివరకూ లక్షన్నర విక్రయాలను(ఎగుమతులతో సహా) సాధించామని కంపెనీ ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్(ఆటోమోటివ్) ప్రవీణ్ షా చెప్పారు. ఈ ఎస్‌యూవీని పూర్తిగా చెన్నైలోని మహీంద్రా రీసెర్చ్ వ్యాలీ(ఎంఆర్వీ)లోనే అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. ఈ వాహనానికి ఆదరణ అంతకంతకూ పెరుగుతోందంటూ... మరిన్ని కొత్త ఫీచర్లతో న్యూ ఏజ్ ఎక్స్‌యూవీ500ను ఈ ఏడాది మేలో అందుబాటులోకి తెచ్చామని, ఈ కొత్త వేరియంట్‌కు మంచి స్పందన లభిస్తోందని పేర్కొన్నారు. -
రెనో ‘క్విడ్’ వచ్చేసింది..
- అందుబాటులో ఆరు వేరియంట్లు - ధరలు రూ.2.57-రూ.3.53 లక్షల రేంజ్లో - మైలేజీ 25.17 కి.మీ. (పెట్రోలు) న్యూఢిల్లీ: డస్టర్‌తో భారత కార్ల స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్(ఎస్యూవీ)మార్కెట్లో సంచలనం సృష్టించిన రెనో కంపెనీ చిన్న కార్ల మార్కెట్లో మరో సంచలనానికి తెర తీసింది. ఎంట్రీ లెవల్ సెగ్మెంట్లో సరికొత్తగా క్విడ్ కారును గురువారం ఆవిష్కరించింది. ఆరు వేరియంట్లు, ఐదు రంగుల్లో లభించే క్విడ్ కారు పరిచయ ధరలు రూ.2.57 లక్షల నుంచి రూ.3.53 లక్షల రేంజ్లో (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) నిర్ణయించామని రెనో ఇండియా తెలిపింది. తాము క్విడ్ కారుతో ఒక కొత్త శకానికి నాంది పలికామని రెనో ఇండియా సీఈఓ ఎండీ, సుమిత్ సాహ్ని చెప్పారు. చూడటానికి స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్(ఎస్యూవీ)లా కనిపించే ఈ కారులో ఐదుగురు ప్రయాణించవచ్చని, 800 సీసీ పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చామని, చెన్నై ప్లాంట్‌లో ఈ కార్లను తయారు చేస్తున్నామని తెలిపారు. మైలేజీ 25.17 కిమీ. వస్తుందని, భారత్‌లో అత్యధిక మైలేజీ ఇచ్చే కారు ఇదేనని చెప్పారు. ఈ కారు అభివృద్ధి కోసం రూ.3,000 కోట్లు పెట్టుబడులు పెట్టామని, అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ కారును రూపొందించామని, త్వరలో ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్(ఏఎంటీ)ను అందిస్తామని తెలిపారు. ఈ ఏడాది చివరినాటికి తమ డీలర్ల నెట్‌వర్క్‌ను 205కు, వచ్చే ఏడాది చివరికల్లా 280కు పెంచుతామని చెప్పారు. ఈ కారును భారత్ నుంచి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తామని వివరించారు. ధరల పోరు షురూ! చిన్న కార్ల మార్కెట్లో హల్చల్ చేస్తున్న మారుతీ సుజుకీ, హ్యుందాయ్‌ల విక్రయాలపై క్విడ్ ప్రభావం తీవ్రంగానే ఉండగలదని మార్కెట్ నిపుణులంటున్నారు. మారుతీ ఆల్టో, హ్యుందాయ్ ఈఆన్, టాటా నానో, డాట్సన్ గో, షెవర్లే స్పార్క్ కార్లకు ఈ క్విడ్ కారు గట్టిపోటీనిస్తుందని అంచనా. క్విడ్ ధర ఆకర్షణీయంగా ఉండటంతో చిన్న కార్ల మార్కెట్లో ధరల పోరు షురూ అయినట్లేనని వారంటున్నారు. మైక్రో ఎస్యూవీ... ప్రస్తుతం 2 శాతంగా ఉన్న మార్కెట్ వాటాను రెండేళ్లలో 5 శాతానికి పెంచుకోవాలని రెనో ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్య సాధన కోసం మొత్తం కార్ల మార్కెట్లో నాలుగో వంతుగా ఉన్న చిన్న కార్ల సెగ్మెంట్‌పై దృష్టిసారించింది. క్విడ్ కారును రంగంలోకి తెచ్చింది. 5 శాతం మార్కెట్ వాటా సాధించే లక్ష్య సాధనకు క్విడ్ కారు ఇతోధికంగా తోడ్పడుతుందన్న ఆశాభావాన్ని రెనో ఇండియా సీఈఓ ఎండీ, సుమిత్ సాహ్ని వ్యక్తం చేశారు. ఇది చిన్న కారు అయినా చూడ్డానికి మైక్రో ఎస్‌యూవీలా ఉంటుందని చెప్పారు. కారు ప్రత్యేకతలు.. - సీఎంఎఫ్-ఏ ప్లాట్‌ఫామ్‌పై దీనిని రూపొందించారు. గ్రౌండ్ క్లియరెన్స్ 180 ఎంఎం, బూట్ స్పేస్ 300 లీటర్లు(చిన్న కార్ల సెగ్మెంట్లో అత్యధిక లగేజ్ స్పేస్ ఉన్న కారు ఇదే. - 7 అంగుళాల టచ్‌స్క్రీన్ మీడియా నావ్ సిస్టమ్(ఎంట్రీలెవెల్ కార్లలో తొలిసారి ఈ సదుపాయం), డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 5 గేర్లు, 2 స్పీకర్లతో కూడిన స్టీరియో. - ఏసీ విత్ హీటర్, వైజర్ ఆన్ ప్యాసింజర్ సైడ్, ఇంజిన్ ఇమ్మొబిలైజర్, గ్లోవ్‌బాక్స్, కీ లెస్ ఎంట్రీ విత్ సెంట్రల్ లాకింగ్. - డ్రెవర్ ఎయిర్‌బ్యాగ్(ఆప్షనల్), వన్ టచ్ లేన్ చేంజ్ ఇండికేటర్, ముందు వైపు ఫాగ్ ల్యాంప్స్ వంటి ప్రత్యేకతలున్నాయి. రెండేళ్లు లేదా 50 వేల కి.మీ. వారంటీని కంపెనీ ఇస్తోంది. రెనో క్విడ్ కారు... కొన్ని సంగతులు... - భారత మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన క్విడ్ కారులో 98 శాతం స్థానిక విడిభాగాలనే వినియోగించారు. ఫలితంగా క్విడ్ నిర్వహణ వ్యయాలు ఈ సెగ్మెంట్లో అగ్రస్థానంలో ఉన్న ఆల్టో కారు కంటే 19 శాతం తక్కువగా ఉంటాయని సుమిత్ చెప్పారు. భారత్‌కు సంబంధించి ఒక్క కొత్త మోడల్లో ఇంత అధిక స్థాయిలో స్థానిక విడిభాగాలను వినియోగించిన తొలి కంపెనీ తమదేనని చెప్పారు. - ఈ కేటగిరీ కార్లలో అత్యంత తేలికైన(బరువు తక్కువగా ఉన్న) కారు ఇదే. - డస్టర్ కారులో ఉండే కొన్ని ఫీచర్లు ఈ కారులో కూడా ఉన్నాయి. -
టాటా సఫారి స్టార్మ్‌లో కొత్త వేరియంట్
ధరలు రూ.9.99 లక్షల నుంచి... న్యూఢిల్లీ: టాటా మోటార్స్ కంపెనీ తన స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్యూవీ) సఫారి స్టార్మ్‌లో అప్డేటెడ్ వేరియంట్‌ను మంగళవారం మార్కెట్లోకి తెచ్చింది. ఈ కొత్త వేరియంట్ ధరలు రూ.9.99 లక్షల (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. టాటా మోటార్స్ హొరైజన్ నెక్స్ట్వ్యూహాంలో భాగంగా ఈ కొత్త సఫారి స్టార్మ్‌ను అందిస్తున్నామని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (ప్యాసింజర్ వెహికల్స్ బిజినెస్ యూనిట్) గిరీష్ వాఘ్ చెప్పారు. ఈ కొత్త సఫారి స్టార్మ్‌లో ఎక్స్టీరియర్స్ను, ఇంటీరియర్స్‌ను కొత్తగా డిజైన్ చేశామని, మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, డ్యుయల్ ఎయిర్-కండీషనింగ్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్ వంటి ఫీచర్లున్నాయని వివరించారు. 1998లోనే సఫారి ఎస్‌యూవీని మార్కెట్లోకి తెచ్చామని, ఇప్పటివరకూ 1.2 లక్షల యూనిట్లను విక్రయించామని పేర్కొన్నారు. -
త్వరలో మారుతీ ఎస్యూవీ..
న్యూఢిల్లీ: మారుతీ సుజుకి కొత్త సెగ్మెంట్లలోకి దూసుకువస్తోంది. స్పోర్ట్స్‌యుటిలిటీ వెహికల్(ఎస్యూవీ), తేలిక రకం వాణిజ్య వాహనాల(ఎల్సీవీ) సెగ్మెంట్లోకి ప్రవేశిస్తోంది. ఏడాదికి 30 లక్షల వాహనాలు విక్రయించడం లక్ష్యంగా మారుతీ జోరును పెంచుతోంది. దీని కోసం ప్రస్తుతమున్న 12 మోడళ్ల సంఖ్యను 25 వరకూ పెంచుకోనున్నామని మారుతీ సుజుకి ఇండియా చైర్మన్ ఆర్.సి. భార్గవ చెప్పారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. కొన్ని నెలల్లోనే ఎస్యూవీ ఏడాదికి 30 లక్షల వాహనాలను విక్రయించాలంటే కనీసం 25 మోడళ్లు అవసరమని భార్గవ చెప్పారు. ప్రయాణికుల వాహనాల మార్కెట్లో అన్ని సెగ్మెంట్లలలో ప్రవేశించాలనే వ్యూహంలో భాగంగా కొన్ని నెలల్లోనే ఒక స్పోర్ట్స్ యుటిలిటి వెహికల్(ఎస్యూవీ)ను మార్కెట్లోకి తెస్తామని భార్గవ చెప్పారు. రెనో డస్టర్‌కు పోటీకి దీనిని తేనున్నామని చెప్పారు. అలాగే 2016లో కాంపాక్ట్ ఎస్‌యూవీని తెస్తామని, ఈ సెగ్మెంట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఫోర్డ్ ఈకోస్పోర్ట్‌కు గట్టిపోటీనిచ్చేలా ఆ కాంపాక్ట్ ఎస్‌యూవీని రూపొందిస్తామని వివరించారు. ఈ రెండు ఎస్‌యూవీలను పెట్రోల్, డీజిల్, సీఎన్జీ వేరియంట్లలో అందిస్తామని పేర్కొన్నారు. త్వరలో ఎస్ఎక్స్4 స్థానంలో మిడ్‌సైజ్ సెడాన్, సియాజ్‌ను అందించనున్నామని భార్గవ చెప్పారు. హోండా సిటీ సెగ్మెంట్లో ఈ కారును తెస్తామని పేర్కొన్నారు. ఒక టన్ను మారుతీ ఎల్సీవీ త్వరలో తేలిక రకం వాణిజ్య వాహనం(ఎల్సీవీ) అందిస్తామని భార్గవ చెప్పారు. ఒక టన్ను ఎల్‌సీవీని తెస్తామని, టాటా ఏస్, మహీంద్రా జియో, అశోక్ లేలాండ్ దోస్త్‌లకు పోటీనిచ్చేలా ఈ ఎల్‌సీవీని రూపొందించనున్నామని పేర్కొన్నారు. ఈ ఎల్సీవీ కోసం ప్రత్యేకంగా నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. తమకు సొంతంగా కార్లు రూపొందించే శక్తి లేదని, తమ మాతృసంస్థ సుజుకి టెక్నాలజీనే తాము వినియోగిస్తామని వివరించారు. సుజుకి పెద్ద కార్లను తయారు చేయలేదు కనుక తాము ఆ రంగంలోకి ప్రవేశించలేమని వివరించారు. 44 శాతానికి పెరిగిన మార్కెట్ వాటా గత ఏడాది తమ మార్కెట్ వాటా 39 శాతమని భార్గవ చెప్పారు. ఈ ఏడాది ఇప్పటివరకూ ఇది 44 శాతానికి చేరిందని వివరించారు. వాహన మార్కెట్‌కు సంబంధించి తాము కొన్ని సెగ్మెంట్లకే పరిమితమయ్యామని, వంద శాతం ప్రాతినిధ్యం వహించడం లేదని, 79 శాతం ప్రాతినిధ్యమే ఉన్నప్పటికీ, వాహన మార్కెట్లో తమదే అగ్రస్థానమని పేర్కొన్నారు. పండుగ జోష్ కార్లకు సంబంధించి ఎంక్వైరీలు పెరిగాయని, ఈ పండుగల సీజన్లో అమ్మకాలు జోరుగానే ఉంటాయన్న ఆశాభావాన్ని భార్గవ వ్యక్తం చేశారు. డీజిల్ ధరలు పెరగడం వల్ల డీజిల్ వేరియంట్ల అమ్మకాలు తగ్గాయని చెప్పారు. భారత్‌లో 12 కోట్ల మంది టూవీలర్ల యజమానులున్నారని, వీరందరికీ కార్లు కొనుక్కోవాలనే కోరిక ఉంటుందని పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న నేపథ్యంలో ఎంట్రీ లెవల్ కార్ల అమ్మకాల వృద్ధి జోరుగా ఉంటుందని భార్గవ అంచనా వేస్తున్నారు. -
మెర్సిడెస్ పవర్ఫుల్ ఎస్యూవీ
ముంబై: లగ్జరీ కార్ల కంపెనీ మెర్సిడెస్-బెంజ్ ఏడు సీట్ల స్పోర్ట్స్ యుటిలిటి వెహికల్(ఎస్యూవీ), జీఎల్ 63 ఏఎంజీని మంగళవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కారు ధర రూ.1.66 కోట్లు(ఎక్స్ షోరూమ్, ముంబై) అని మెర్సిడెస్-బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో ఇబర్‌హర్డ్ కెర్న్ చెప్పారు. మెర్సిడెస్ బెంజ్ భారత్‌లోకి తెస్తున్న ఏఎంజీ రేంజ్ వాహనాల్లో ఇది మొదటిదని పేర్కొన్నారు. దేశంలోనే అత్యంత శక్తివంతమైన ఎస్యూవీ ఇదేనని కంపెనీ పేర్కొంది. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం..., 5.5 లీటర్ వీ8 బైటర్బో పవర్ ట్రైన్‌తో రూపొందిన ఈ కారు 0-100 కి.మీ. వేగాన్ని 4.6 సెకన్లలో అందుకుంటుంది. 7 గేర్లు (ఆటోమేటిక్), ఆల్ వీల్ డ్రైవ్, మూల మలుపులను సమర్థవంతంగా హ్యాండిల్ చేసేలా యాక్టివ్ కర్వ్ కంట్రోల్, బాంగ్ అండ్ ఓలుఫ్సెన్ ఆడియా సిస్టమ్, సిరస్ శాటిలైట్ రేడియో, పనోరమిక్ సన్‌రూఫ్, ట్రై జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్స్ వంటి ప్రత్యేకతలున్నాయి. ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్‌కు ఈ కొత్త మెర్సిడెస్ ఎస్యూవీ గట్టిపోటీనివ్వగలదని పరిశ్రమ వర్గాల అంచనా. ఈ ఏడాది 10 మోడళ్లు కాగా ఈ ఏడాది మెర్సిడెస్ బెంజ్ అందిస్తున్న నాలుగో మోడల్ ఇది. ఈ ఏడాది చివరికల్లా మొత్తం 10 కొత్త మోడళ్లను అందించనున్నామని కెర్న్ వివరించారు. ఈ కారు తమ వినియోగదారులను అలరిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గత ఏడాది తమ అమ్మకాలు 32 శాతం వృద్ధి చెంది 9,003కు చేరాయని వివరించారు. కాగా ఈ ఏడాది జనవరి-మార్చి కాలానికి అమ్మకాలు 27 శాతం పెరిగాయని పేర్కొన్నారు. ఈ ఏడాది అమ్మకాల్లో రెండంకెల వృద్ధి సాధించగలమని వివరించారు. పుణేలోని చకన్ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేసే ప్రక్రియ పూర్తయిందని పేర్కొన్నారు. కాగా ఈ కంపెనీ ఎస్, ఈ, సీ, జీఎల్, ఎం- క్లాస్ మోడల్ కార్లను భారత్‌లోనే తయారు చేస్తోంది. ఏ, సీఎల్ఎస్, ఎస్‌ఎల్‌కే-క్లాస్, లగ్జరీ టూరర్ బి-క్లాస్, లగ్జరీ ఎస్యూవీ జీఎల్ 63 ఏఎంజీలను దిగుమతి చేసుకొని విక్రయిస్తోంది.