త్వరలో మారుతీ ఎస్‌యూవీ..
న్యూఢిల్లీ: మారుతీ సుజుకి కొత్త సెగ్మెంట్లలోకి దూసుకువస్తోంది. స్పోర్ట్స్‌యుటిలిటీ వెహికల్(ఎస్‌యూవీ), తేలిక రకం వాణిజ్య వాహనాల(ఎల్‌సీవీ) సెగ్మెంట్లోకి ప్రవేశిస్తోంది. ఏడాదికి 30 లక్షల వాహనాలు విక్రయించడం లక్ష్యంగా మారుతీ జోరును పెంచుతోంది. దీని కోసం ప్రస్తుతమున్న 12 మోడళ్ల సంఖ్యను 25 వరకూ పెంచుకోనున్నామని మారుతీ సుజుకి ఇండియా చైర్మన్ ఆర్.సి. భార్గవ చెప్పారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు.
కొన్ని నెలల్లోనే ఎస్‌యూవీ
ఏడాదికి 30 లక్షల వాహనాలను విక్రయించాలంటే కనీసం 25 మోడళ్లు అవసరమని భార్గవ చెప్పారు. ప్రయాణికుల వాహనాల మార్కెట్లో అన్ని సెగ్మెంట్లలలో ప్రవేశించాలనే వ్యూహంలో భాగంగా కొన్ని నెలల్లోనే ఒక స్పోర్ట్స్ యుటిలిటి వెహికల్(ఎస్‌యూవీ)ను మార్కెట్లోకి తెస్తామని భార్గవ చెప్పారు. రెనో డస్టర్‌కు పోటీకి దీనిని తేనున్నామని చెప్పారు.
అలాగే 2016లో కాంపాక్ట్ ఎస్‌యూవీని తెస్తామని, ఈ సెగ్మెంట్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఫోర్డ్ ఈకోస్పోర్ట్‌కు గట్టిపోటీనిచ్చేలా ఆ కాంపాక్ట్ ఎస్‌యూవీని రూపొందిస్తామని వివరించారు. ఈ రెండు ఎస్‌యూవీలను పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ వేరియంట్లలో అందిస్తామని పేర్కొన్నారు. త్వరలో ఎస్‌ఎక్స్4 స్థానంలో మిడ్‌సైజ్ సెడాన్, సియాజ్‌ను అందించనున్నామని భార్గవ చెప్పారు. హోండా సిటీ సెగ్మెంట్‌లో ఈ కారును తెస్తామని పేర్కొన్నారు.
ఒక టన్ను మారుతీ ఎల్‌సీవీ
త్వరలో తేలిక రకం వాణిజ్య వాహనం(ఎల్‌సీవీ) అందిస్తామని భార్గవ చెప్పారు. ఒక టన్ను ఎల్‌సీవీని తెస్తామని, టాటా ఏస్, మహీంద్రా జియో, అశోక్ లేలాండ్ దోస్త్‌లకు పోటీనిచ్చేలా ఈ ఎల్‌సీవీని రూపొందించనున్నామని పేర్కొన్నారు. ఈ ఎల్‌సీవీ కోసం ప్రత్యేకంగా నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. తమకు సొంతంగా కార్లు రూపొందించే శక్తి లేదని, తమ మాతృసంస్థ సుజుకి టెక్నాలజీనే తాము వినియోగిస్తామని వివరించారు. సుజుకి పెద్ద కార్లను తయారు చేయలేదు కనుక తాము ఆ రంగంలోకి ప్రవేశించలేమని వివరించారు.
44 శాతానికి పెరిగిన మార్కెట్ వాటా
గత ఏడాది తమ మార్కెట్ వాటా 39 శాతమని భార్గవ చెప్పారు. ఈ ఏడాది ఇప్పటివరకూ ఇది 44 శాతానికి చేరిందని వివరించారు. వాహన మార్కెట్‌కు సంబంధించి తాము కొన్ని సెగ్మెంట్లకే పరిమితమయ్యామని, వంద శాతం ప్రాతినిధ్యం వహించడం లేదని, 79 శాతం ప్రాతినిధ్యమే ఉన్నప్పటికీ, వాహన మార్కెట్లో తమదే అగ్రస్థానమని పేర్కొన్నారు.
పండుగ జోష్
కార్లకు సంబంధించి ఎంక్వైరీలు పెరిగాయని, ఈ పండుగల సీజన్‌లో అమ్మకాలు జోరుగానే ఉంటాయన్న ఆశాభావాన్ని భార్గవ వ్యక్తం చేశారు. డీజిల్ ధరలు పెరగడం వల్ల డీజిల్ వేరియంట్ల అమ్మకాలు తగ్గాయని చెప్పారు. భారత్‌లో 12 కోట్ల మంది టూవీలర్ల యజమానులున్నారని, వీరందరికీ కార్లు కొనుక్కోవాలనే కోరిక ఉంటుందని పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న నేపథ్యంలో ఎంట్రీ లెవల్ కార్ల అమ్మకాల వృద్ధి జోరుగా ఉంటుందని భార్గవ అంచనా వేస్తున్నారు.