మెర్సిడెస్ కొత్త ఎస్యూవీ ‘జీఎల్సీ’
♦ పెట్రోల్. డీజిల్ వేరియంట్లలో లభ్యం
♦ ధర రూ.50.7 లక్షల నుంచి రూ.50.9 లక్షల రేంజ్‌లో
న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీ మెర్సిడెస్ కొత్త స్పోర్ట్స్‌యుటిలిటీ వెహికల్(ఎస్‌యూవీ)ను గురువారం మార్కెట్లోకి తెచ్చింది. జీఎల్‌సీ పేరుతో ఈ ఎస్‌యూవీని పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో అందిస్తున్నామని మెర్సిడెస్ ఇండియా పేర్కొంది. 2143 సీసీ డీజిల్ ఇంజిన్‌తో రూపొందించిన జీఎల్‌సీ 220డి మోడల్ ధర రూ.50.7 లక్షలని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈఓ, రోలాండ్ ఫోలర్ చెప్పారు. అలాగే 1991 సీసీ పెట్రోల్ ఇంజిన్‌తో రూపొందించిన జీఎల్‌సీ 300, ధర రూ.50.9 లక్షలని(అన్ని ధరలు ఎక్స్ షోరూమ్, పుణే) వివరించారు. జీఎల్‌ఏ, జీఎల్‌ఈ లగ్జరీ ఎస్‌యూవీల మధ్య ఉన్న ఖాళీని ఈ తాజా జీఎల్‌సీ ఎస్‌యూవీ భర్తీ చేస్తుందని పేర్కొన్నారు.
మెర్సిడెస్.. ఆరో ఎస్‌యూవీ: ఈ ఏడాది 12 కొత్త మోడళ్లను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, దీంట్లో భాగంగా ఈ ఏడాది తామందిస్తున్న ఐదో మోడల్ ఇదని రోలాండ్ వివరించారు. కాగా భారత్‌లో మెర్సిడెస్ అందిస్తున్న ఆరో ఎస్‌యూవీ మోడల్ ఇది.
కారు ప్రత్యేకతలు.. : ఈ కారులో ఏడు అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ (ఈ ఎస్‌యూవీని 360 డిగ్రీల్లో చూడగలిగే ప్రత్యేకతను ఈ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ చూపగలదు) 20 సీడీల స్టీరియో, గర్మిన్ ఆధారిత నావిగేషన్, 2 యూఎస్‌బీ పోర్ట్‌లు, బ్లూ టూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఈ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లో ఉన్నాయి. 9 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్, మల్టీపుల్ డ్రైవింగ్ మోడ్స్, 4మ్యాటిక్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్, ఎడాప్టివ్ బ్రేక్ లైట్స్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, 7 ఎయిర్‌బ్యాగ్‌లు వంటి ప్రత్యేకతలున్నాయని కంపెనీ అంటోంది. డీజిల్ ఎస్‌యూవీ 0-100 కిమీ వేగాన్ని 8.3 సెకన్లలో అందుకుంటుంది. గరిష్ట వేగం గంటకు 210 కిమీ. ఇక పెట్రోల్ ఎస్‌యూవీ 0-100 కిమీ. వేగాన్ని 6.5 సెకన్లలో అందుకుంటుంది. గరిష్ట వేగం గంటకు 222 కిమీ.