సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) గవర్నర్ ఉర్జిత్ పటేల్ సోమవారం అనూహ్యంగా రాజీనామా చేశారు. గత కొద్దిరోజులుగా దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన కీలక విధాన నిర్ణయాలపై కేంద్ర ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అనే రీతిలో తలపడుతూ వస్తున్న ఆయన రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడం.. పలువురిని ఆశ్చర్య పరుస్తోంది. వ్యక్తిగత కారణాలతోనే ఆర్బీఐ గవర్నర్ పదవి నుంచి తక్షణమే వైదొలుగుతున్నానని ఆయన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఆర్బీఐ గవర్నర్‌గా పనిచేసినందుకు గర్విస్తున్నానని పేర్కొన్న ఉర్జిత్.. పదవీకాలంలో తనకు సహకరించిన ఉద్యోగులు, ఆర్బీఐ డైరెక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు.
2016 నుంచి ఆర్బీఐ గవర్నర్‌గా కొనసాగుతున్న ఉర్జిత్ పటేల్ తన పదవీకాలం కన్నా చాలాముందే రాజీనామా చేశారు. 2019 సెప్టెంబర్ వరకు ఆయన పదవీకాలం ఉంది. ఉర్జిత్ పటేల్ హయాంలోనే పెద్దనోట్ల రద్దు వంటి తీవ్రమైన నిర్ణయాలను మోదీ సర్కారు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, గతకొంతకాలంగా విధాన నిర్ణయాల విషయంలో కేంద్రంతో ఉర్జిత్ పటేల్ విబేధిస్తున్న సంగతి తెలిసిందే. తాను చెప్పినట్టు వినకుండా ఉర్జిత్ స్వతంత్రంగా వ్యవహరిస్తుండటం.. కేంద్రాన్ని తీవ్ర అసంతృప్తికి గురిచేస్తోంది. ఆర్థిక వ్యవస్థపరంగా దేశం ఒకింత క్లిష్టసమయంలో ఉన్నప్పుడు ఆయన రాజీనామా చేయడం రాజకీయంగా దుమారం రేపే అవకాశముంది. ఉర్జిత్ రాజీనామాను అస్త్రంగా చేసుకొని.. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్షాలు కేంద్రాన్ని ఇరకాటంలోకి నెట్టే అవకాశముందని తెలుస్తోంది.
వుయ్ మిస్ యూ: ప్రధాని మోదీ
ఉర్జిత్ పటేల్ రాజీనామాపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ట్విట్టర్‌లో స్పందించారు. ‘వృత్తిపరంగా ఉర్జిత్ పటేల్ తిరుగులేని నిబద్ధత కలిగిన వ్యక్తి. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా, గవర్నర్‌గా ఆయన ఆరేళ్లు దేశానికి సేవలందించారు. గొప్ప వారసత్వాన్ని ఆయన అందించారు. ఆయనను మేం మిస్సవుతున్నాం’ అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేయగా.. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా, గవర్నర్‌గా ఉర్జిత్ అందించిన సేవలను ప్రభుత్వం ఎంతో గౌరవంతో కొనియాడుతోందని, ఆయన మరింతకాలం ప్రజాసేవలో ఉండాలని తాను కోరుకుంటున్నట్టు అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. దేశంలోని ఎంతో విలువైన వ్యవస్థలన్నింటినీ మోదీ ప్రభుత్వం వరుసగా ధ్వంసం చేస్తోందని, అందుకు తాజా నిదర్శనమే ఉర్జిత్ రాజీనామా అని కాంగ్రెస్ నేతలు అహ్మద్ పటేల్, రణ్‌దీప్‌సింగ్ సుర్జేవాలా మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment