
పైకప్పులో పండిద్దాం
టై గార్డెనింగ్‌పై నగరవాసుల్లో ఆసక్తి
హైదరాబాద్: ఇంటి పైకప్పు అంటే చాలు.. చాలామందికి చిన్న చూపు. ఆ స్థలం ఎందుకూ పనికిరాదని భావిస్తారు. కొందరేమో అక్కడే పాత సామాన్లు పెట్టుకుంటారు. మరికొందరు పైకప్పు మీద బట్టలు ఆరేయడానికి మాత్రమే వినియోగిస్తారు. అప్పుడప్పుడు బంధువులొస్తే కాలక్షేపం చేస్తారు. అంతేతప్ప ఓ ప్రణాళిక ప్రకారం ఈ స్థలాన్ని వినియోగించుకోవాలని అనుకోరు. ఇలాంటి వారందరికీ ఉపయోగపడే కొత్త పోకడే టై గార్డెనింగ్. ఈ స్థలాన్ని వృథాగా వదిలేయకుండా ఇక్కడే కూరగాయల్ని పండించుకోవచ్చు. ఏడాదిలో కూరగాయల ధరలు మండటాన్ని మనం చూస్తుంటాం. ఇలా హఠాత్తుగా రే ట్లు పెరగడానికో కారణం ఉందండోయ్.. ఉత్పత్తి తగ్గడమే. నగరీకరణ, పారిశ్రామికీకరణ వంటి కారణాలతో కూరగాయలను పండించటం గగనమవుతోన్న నేటి కాలంలో ఈ విధానం ఓ చక్కటి ప్రత్యామ్నాయమని చెప్పొచ్చు.
ఏమేం పండించొచ్చు..
మనం నిత్యం తినే కూరగాయల్ని టై గార్డెనింగ్ ద్వారా పండించుకోవచ్చు. టమాట, మిర్చి, వంకాయ, బెండకాయ, చిక్కుడు వంటివన్నమాట. ఓ అడుగు లోతు దాకా స్థలముంటే క్యారెట్, ర్యాడిష్, క్యాబేజీ వంటి దుంప జాతి కూరగాయలు, రకరకాల ఆకుకూరలు కూడా పండించుకోవచ్చు. చలికాలంలో ఎక్కువ దిగుబడి వచ్చే క్యాబేజీ, క్యాలీఫ్లవర్ వంటివి కూడా టై గార్డెనింగ్‌కు అనుకూలం.
ఎన్ని రోజులు..
ఈ విధానంతో కూరగాయలు పండించటానికి ఎన్ని రోజులు పడుతుందనే సందేహం సహజం. సాధారణంగా విత్తనాలు వేశాక 20 రోజుల్లోపే మొలకలొస్తాయి. అప్పటినుంచి దాదాపుగా 60 రోజుల తర్వాత కూరగాయలు చేతికొస్తాయి. గరిష్టంగా 80-100 రోజుల్లోపే కూరగాయలు పండించొచ్చు.
నివాస సంఘాలకు మేలు...
నగరంలోని పలు నర్సరీల్లో చిన్నపాటిమొక్కలు కూడా అమ్ముతుంటారు. వీటిని తెచ్చుకొని ఇంటి పైకప్పులో ఏర్పాటు చేసుకోవచ్చు. వంద చ.అ. కనీసం 70-100 టమాట మొక్కలను పెంచవచ్చు. ఒక్కో మొక్క నుంచి కనీసం 2 కిలోల టమాట దిగుబడి వస్తుంది. అంటే వంద మొక్కల ద్వారా ఎంత లేదన్నా 200 కిలోల దాకా టమాట పండుతుంది. కాకపోతే మొక్కలను నాటిన తర్వాత నిర్వహణ విషయం లో జాగ్రత్త వహించాలి. మార్కెట్లో నాణ్యమైన విత్తనాలు కూడా లభిస్తున్నాయి. వీటి ద్వారా దిగుబడి ఎక్కువొస్తుందని తెలుసుకున్నాకే కొనుగోల చేసుకోవాలి.
వంద చ.అ. ఎంత?
వంద చ.అ. టై గార్డెనింగ్ ఏర్పాటు చేసుకోవడానికి ఎంత ఖర్చు అవుతుందో చూద్దాం. బెడ్ సైజు సుమారు 3వ4వ8 అడుగుల సైజు అనుకుంటే దీనికి 9వ3వ4 అడుగుల సైజు ఇటుకలు అవసరమవుతాయి. ఒక్కో బెడ్ 12 చ.అ. ఉంటుంది. ఇందుకు దాదాపు 78 ఇటుకలు కావాలి. ఇలాంటివి 8 బెడ్‌లు అవసరం. ఒక్కో ఇటుక రేటు సుమారు రూ.5 అనుకుంటే రవాణా ఖర్చులను కూడా కలుపుకుంటే రూ.3,500 అవుతుంది.
ఇటుకలు 3,500
పాలిషీలు 400
(కిలో పాలిషీటు 20 చ.అ.
స్థలానికి సరిపోతుంది)
వర్మి కంపోస్ట్ 3,200
విత్తనాలు 300
వేప నూనె 200
పనిముట్లు 600
ఇతర సామాగ్రి 200
పనివారు, రవాణా 2,500
మొత్తం 10,900
(ఈ పట్టిక కేవలం అవగాహన కోసమే. ఇటుకలు, బెడ్ సైజును బట్టి ధరల్లో తేడా ఉంటుంది)