
ముంబై: కొనసాగుతున్న కార్పొరేట్ కంపెనీల తొలిత్రైమాసిక ఫలితాలు, వెంటాడుతున్న వాణిజ్య యుద్ధ భయాలు, విదేశీ నిధుల ప్రవాహ దిశలే ఈ వారంలో మార్కెట్ గమనాన్ని నిర్దేశించనున్నాయని దలాల్ స్ట్రీట్ పండితులు చెబుతున్నారు. ఇదే సమయంలో ముడిచమురు ధరలు, పార్లమెంట్ వర్షాకాల సమావేశ పరిణామాలు సైతం మార్కెట్‌పై ప్రభావం చూపనున్నాయని అంటున్నారు. వాణిజ్య యుద్ధ ఆందోళనలు పెరగడం వంటి ప్రతికూల అంశాల నేపథ్యంలో మార్కెట్ స్వల్పకాలం నుంచి మధ్యకాలం వరకు ఒడిదుడుకుల మధ్యనే కొనసాగుతుందని ఎస్‌ఎమ్‌సీ ఇన్వెస్ట్‌మెంట్స్ అండ్ అడ్వైజర్స్ చైర్మన్ డీ కే అగర్వాల్ అంచనావేశారు. రూపాయి మారకం విలువ, ముడిచమురు ధరలు, వర్షాకాల సమావేశం నుంచి అందే సంకేతాలు మార్కెట్‌ను నడిపించనున్నాయని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ వారంలో ఎస్‌బీఐ, అదానీ పోర్ట్స్, బ్రిటానియా ఇండస్ట్రీస్, మహీంద్రా అండ్ మహీంద్రా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, టీవీఎస్ మోటార్, సిప్లా, లుపిన్, భారత్ ఫోర్జ్, కమిన్స్, జెట్ ఎయిర్‌వేస్ ఫలితాలను వెల్లడించనుండగా.. ఇవి మార్కెట్ దిశకు కీలకమని అన్నారు. ‘ వాల్యూయేషన్స్ అధికంగా ఉన్నప్పటికీ.. ఆశాజనక రుతుపవనాల సూచనలు, ఫలితాలు గ్రామీణ ప్రాంత వినిమయ రంగ షేర్ల ర్యాలీకి ఆస్కారం ఇవ్వనున్నాయి.’ అని డెల్టా గ్లోబల్ పాట్నర్స్ ప్రిన్సిపల్ పాట్నర్ దేవేంద్ర నెవ్గి విశ్లేషించారు. ‘నాణ్యమైన మిడ్‌క్యాప్ షేర్లలోనికి నిధుల ప్రవాహం కొనసాగుతుంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి చూస్తే.. లార్జ్‌క్యాప్ షేర్ల వాల్యూయేషన్స్ ప్రీమియం కంటే ఈ రంగ షేర్ల ప్రీమియం తగ్గుతున్న క్రమంలో పెట్టుబడులు కొనసాగుతాయి.’ అని భావిస్తున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధన విభాగం హెడ్ వినోద్ నాయర్ అన్నారు.
ఆర్బీఐ చర్యలు ఆహ్వానించదగినవే..
అధిక సప్లై కారణంగా ముడిచమురు ధరలు తగ్గనున్నాయని, ఆశాజనక క్యూ1 ఫలితాలు మార్కెట్ ర్యాలీకి సహకరిస్తాయని భావిస్తున్నట్లు కొటక్ సెక్యూరిటీస్ కరెన్సీ విభాగం డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ అనినిద్య బెనర్జీ వెల్లడించారు. ద్రవ్యోల్బణ, వృద్ధిరేటు మధ్య సమతుల్యం సాధించడం కోసం ఆర్బీఐ నెమ్మదిగా వడ్డీరేట్లను పెంచడం మార్కెట్‌కు సానుకూలంగా ఉండనుందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. సురక్షిత లార్జ్‌క్యాప్, వినిమయ రంగాలకు చెందిన షేర్లు మంచి పనితీరును ప్రదర్శించనున్నాయని అన్నారు. డాలరుతో రూపాయి మారకం విలువ 68.25 నుంచి 69 మధ్యలో ఉండే అవకాశం ఉందని వెల్లడించారు. గత శుక్రవారం రూపాయి విలువ 68.66 వద్ద ముగిసింది.
ఎఫ్‌ఐఐల నికర విక్రయాలు...
ఆగస్టు 3తో ముగిసిన వారానికి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) 140 మిలియన్ డాలర్లు (రూ.962) కోట్ల విలువైన పెట్టుబడిని స్టాక్ మార్కెట్ నుంచి ఉపసంహరించుకున్నారు. అయితే జూలై నెల మొత్తంమీద నికర కొనుగోలుదారులుగా నిలిచారు. రూ.2,312 కోట్ల పెట్టుబడులను పెట్టినట్లు డిపాజిటరీ డేటా ద్వారా వెల్లడయింది. ఈక్విటీ మార్కెట్‌లో రూ.2,264 కోట్లు.. డెట్ మార్కెట్‌లో రూ.48 కోట్లు పెట్టుబడి చేశారు. ఏప్రిల్–జూన్ కాలంలో ఈక్విటీ, డెట్‌లో కలిపి రూ.61,000 కోట్లను వీరు ఇన్వెస్ట్ చేశారు. మార్చిలో రూ.2,662 కోట్లను ఇన్వెస్ట్ చేశారు.
11,407 పాయింట్ల వద్ద తక్షణ నిరోధం..!
‘నిఫ్టీ తక్షణ నిరోధ స్థాయి 11,407 పాయింట్ల వద్ద ఉండగా.. మద్దతు స్థాయి 11,235 పాయింట్ల వద్ద ఉంది.’ అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసని విశ్లేషించారు.
నేడే హెచ్‌డీఎఫ్‌సీ ఏఎమ్‌సీ లిస్టింగ్ రూ.2,800 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఈ నెల 25న ప్రైమరీ మార్కెట్‌కు వచ్చి 27 నాటి ముగింపు సమయానికి 83 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబైన హెచ్‌డీఎఫ్‌సీ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ (ఏఎమ్‌సీ) ఐపీఓ ఇవాళ (సోమవారం) స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్‌కు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment