మూడేళ్ల కనిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం
డిసెంబర్‌లో 3.41 శాతం
న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ ఆధారిత– రిటైల్ ద్రవ్యోల్బణం డిసెంబర్‌లో మూడేళ్ల కనిష్ట స్థాయి 3.41 శాతానికి పడిపోయింది. అంటే 2015 డిసెంబర్‌లో కొన్ని వస్తువుల బాస్కెట్ ధరను 2016 డిసెంబర్‌తో పోల్చిచూస్తే... ధరలు 3.41 శాతం పెరిగాయన్నమాట. కాగా 2015 నవంబర్‌లో ఈ రేటు 3.63 శాతంకాగా, 2015 డిసెంబర్‌లో 5.61 శాతం. తాజా గణాంకాలను చూస్తే,... డిసెంబర్ నెలలో కొన్ని రంగాలపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం పడి డిమాండ్ తగ్గడంతో పాటు కూరగాయల ధరలు తగ్గడం దీనికి ప్రధాన కారణమన్న విశ్లేషణలు ఉన్నాయి.
ఇందుల్లో వేర్వేరు కీలక విభాగాలను చూస్తే...
• ఆహారం, పానీయాలు: ధరల పెరుగుదల 1.98%గా ఉంది.
• పాన్, పొగాకు ఇతర మత్తు ప్రేరితాలు: 6.39% ధరల పెరుగుదల
• దుస్తులు, పాదరక్షల విభాగం: ధరల పెరుగుదల రేటు 4.88 శాతం
• హౌసింగ్: ఈ రంగంలో రేటు పెరుగుదల 4.98 శాతం
• ఇంధనం, లైట్: ధరల పెరుగుదల రేటు 3.77 శాతం
నిత్యావసరాలను చూస్తే: డిసెంబర్‌లో కూరగాయలు ధరలు అసలు పెరక్కపోగా, 2015 డిసెంబర్ ధరతో పోల్చితే –14.59 శాతం క్షీణత నమోదయ్యింది. పప్పు దినుసుల ధరలు కూడా ఇదే రకంగా –1.57 శాతం క్షీణించాయి. అయితే చక్కెర సంబంధిత ఉత్పత్తుల ధరలు మాత్రం భారీగా 21.06 శాతం ఎగశాయి.