
న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 2.92 శాతంగా నమోదయ్యింది. అంటే 2018 ఏప్రిల్‌లో సూచీలోని వస్తువుల బాస్కెట్ ధర 2019 ఏప్రిల్‌లో 2.92 శాతం పెరిగిందన్నమాట. ఈ స్థాయిలో రిటైల్ ధరల స్పీడ్ నమోదుకావడం ఆరు నెలల్లో ఇదే తొలిసారి. అయితే ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నిర్దేశిత లక్ష్యం 4 శాతం లోపే ఉండడం గమనార్హం. మున్ముందు ఇదే రీతిలో ధరలు కొనసాగితే ఆర్‌బీఐ మరోదఫా రేటు రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపో– ప్రస్తుతం 6 శాతం) తగ్గింపు ఖాయమన్న సంకేతాలు ఉన్నాయి. కూరగాయలు, మాంసం, చేపలు, గుడ్లుసహా ఆహార ఉత్పత్తుల ధరలు పెరగడం వల్ల ఏప్రిల్‌లో ధరల స్పీడ్ కొంత పెరిగింది. కేంద్రం సోమవారం విడుదల చేసిన గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...
►మార్చిలో రిటైల్ ద్రవ్యోల్బణం 2.86 శాతం ఉంటే, 2018 ఏప్రిల్‌లో 4.58 శాతంగా ఉంది.
► అక్టోబర్ 2018 తరువాత (3.38%) ఈ స్థాయిలో రిటైల్ ద్రవ్యోల్బణం నమోదవడం ఇదే తొలిసారి.
► ఒక్క ఆహార ఉత్పత్తులను చూస్తే, ధరలు 1.1% పెరిగాయి. మార్చిలో ఈ పెరుగుదల రేటు కేవలం 0.3%. కూరగాయల ధరలు 2.87% పెరిగాయి. అయితే పండ్ల ధరలు మాత్రం గత ఏడాది ఏప్రిల్ నుంచి 2019 ఏప్రిల్‌ను చూస్తే తగ్గాయి.
► ఇంధనం, లైట్ విభాగంలో ద్రవ్యోల్బణం 2.42 శాతం నుంచి 2.56 శాతానికి పెరిగింది.
►కాగా గ్రామీణ భారతంలో ధరల స్పీడ్ మార్చిలో 1.8 శాతం ఉంటే, ఏప్రిల్‌లో ఇది 1.87 శాతానికి పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో ఈ రేటు 4.1 శాతం నుంచి 4.23 శాతానికి చేరింది.
► నిర్దేశిత కొన్ని పట్టణాలు, గ్రామాల నుంచి ఎన్‌ఎస్‌ఎస్‌ఓ ఫీల్డ్ ఆపరేషన్స్ డివిజన్ల నుండి ఈ గణాంకాలను సేకరించడం జరుగుతుంది.
2019–2020లో 4 శాతం
అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019 ఏప్రిల్ నుంచి 2020 మార్చి వరకూ) రిటైల్ ద్రవ్యోల్బణం రేటు సగటున 4 శాతం ఉంటుందని భావిస్తున్నట్లు క్రిసిల్ రిసెర్చ్ అంచనావేస్తోంది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 3.4 శాతంగా ఉంది. ఆహార ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశాలు ఉండడం తమ అంచనాలకు కారణంగా పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment