
సానుకూల పరిణామాలతో మార్కెట్లలో బుల్ పరుగు కొనసాగుతోంది. సూచీలు కొంగొత్త గరిష్ట స్థాయిలు చేరుతున్నాయి. తాజాగా ప్రపంచ బ్యాంకు వ్యాపార సానుకూలతల ర్యాంకింగ్స్‌లో భారత్ టాప్–100లోకి చేరడం దేశీ సూచీలకు మరింత జోష్‌ని చ్చింది. బుధవారం నిఫ్టీ తొలిసారిగా 10,400 పాయింట్ల ఎగువన ముగియగా, సెన్సెక్స్ 387 పాయింట్లు ఎగిసింది. కీలకమైన మౌలిక రంగం సెప్టెంబర్‌లో 6 నెలల గరిష్టమైన 5.2 శాతం వృద్ధి నమోదు చేయడం కూడా మార్కెట్ల పరుగుకు దోహదపడింది. అలాగే, మరికొన్ని కంపెనీలు అంచనాలకన్నా మెరుగైన ఆర్థిక ఫలితాలు ప్రకటిస్తుండటం సైతం స్టాక్ మార్కెట్లు ఎగియడానికి తోడ్పడ్డాయి.
విస్తృతంగా కొనుగోళ్లు..
దాదాపు అంతటా కొనుగోళ్ల ఊతంతో నిఫ్టీ ఇంట్రా డేలో 10,450 పాయింట్ల స్థాయిని తొలిసారిగా దాటింది. చివరికి 1.02 శాతం లాభంతో 105 పాయింట్లు పెరిగి 10,440.50 వద్ద క్లోజయ్యింది. అక్టోబర్ 30న నమోదు చేసిన 10,363.65 పాయింట్ల క్లోజింగ్ రికార్డును అధిగమించింది. అటు దూకుడుగానే ప్రారంభమైన సెన్సెక్స్ సైతం ఇంట్రాడేలో మరో కొత్త గరిష్ట స్థాయి 33,651.52 పాయింట్లకు చేరింది. చివర్లో కొంత లాభాల స్వీకరణ జరిగినప్పటికీ.. 387 పాయింట్ల పెరుగుదలతో 33,600 వద్ద ముగిసింది. అక్టోబర్ 30న నమోదైన 33,266 పాయింట్ల రికార్డును దాటేసింది.
ర్యాంకు చలవే..: వరల్డ్ బ్యాంక్ రూపొందించిన వ్యాపారాల నిర్వహణకు అనువైన దేశాల జాబితాలో భారత్ ఏకంగా 130వ స్థానం నుంచి 100వ స్థానానికి ఎగబాకిన సంగతి తెలిసిందే. దీంతో పాటు మెరుగైన మౌలిక రంగ గణాంకాలు, ప్రపంచ మార్కెట్ల సానుకూల పరిణామాలు సైతం దేశీ సూచీలకు ఊతమిచ్చాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ మార్కెట్ స్ట్రాటెజిస్ట్ ఆనంద్ జేమ్స్ చెప్పారు. ఇక రూపాయి బలపడటం, ప్రభుత్వ రంగ బ్యాంకులు, రియల్టీ, మెటల్, ఎఫ్‌ఎంజీసీ రంగాలపై సెంటిమెంటు మెరుగుపడటం కూడా మద్దతునిచ్చినట్లు పేర్కొన్నారు. ఈ ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపద (బీఎస్‌ఈలోని లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్) మరో రూ. 1.08 లక్షల కోట్ల మేర పెరిగి రూ. 145 లక్షల కోట్లకు చేరింది. దాదాపు అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి.
ఎయిర్‌టెల్ 8 శాతం జంప్..
బ్యాంకింగ్, రియల్టీ, మెటల్, ఎఫ్‌ఎంసీజీ, ప్రభుత్వ రంగ సంస్థల షేర్లలో కొనుగోళ్లు గణనీయంగా జరిగాయి. టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ షేరు భారీ లాభాలతో మిగతా స్టాక్స్‌కి సారథ్యం వహించింది. జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో ఎయిర్‌టెల్ లాభాలు భారీగా తగ్గినప్పటికీ.. షేరు మాత్రం 8 శాతం పైగా పెరిగింది. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంక్ తదితర స్టాక్స్ 4.58 శాతం దాకా పెరిగాయి. స్మాల్‌క్యాప్ సూచీ 0.55 శాతం, మిడ్‌క్యాప్ 0.35 శాతం పెరిగాయి. బీఎస్‌ఈలో రూ. 5,318 కోట్ల టర్నోవర్ నమోదైంది. అమెరికాలో కీలక వడ్డీ రేట్లపై ఫెడరల్ రిజర్వ్ నిర్ణయంపై ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో ఆసియా, యూరప్ మార్కెట్లలో కూడా లాభాల ట్రెండ్ కనిపించింది.
రిలయన్స్@ 6 లక్షల కోట్లు
మార్కెట్ల ర్యాలీ నేపథ్యంలో దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) మార్కెట్ వేల్యుయేషన్ రూ. 6 లక్షల కోట్ల మైలురాయిని దాటేసింది. మార్కెట్ వేళలు ముగిసేసరికి రూ.6,03,097.82 లక్షల కోట్లుగా నమోదైంది. దేశీయంగా మార్కెట్ క్యాప్ రూ. 6 లక్షల కోట్లు దాటేసిన తొలి కంపెనీగా ఆర్‌ఐఎల్ నిల్చింది. అక్టోబర్ 24న రిలయన్స్ మార్కెట్ క్యాప్ స్వల్ప సమయం పాటు ఈ మార్కును దాటినప్పటికీ నిలదొక్కుకోలేదు. అయితే, బుధవారం ట్రేడింగ్‌లో మాత్రం రూ. 6 లక్షల కోట్లు దాటేసి ముగిసింది. బీఎస్‌ఈలో కంపెనీ షేరు 1.22% పెరిగి రూ.952 వద్ద క్లోజ య్యింది. లావాదేవీల పరిమాణం బట్టి చూస్తే బీఎస్‌ఈలో 4.56 లక్షలు, ఎన్‌ఎస్‌ఈలో 80 లక్షల షేర్లు చేతులు మారాయి. మార్కెట్ విలువ ప్రకారం టాప్ 5 స్థానాల్లో ఆర్‌ఐఎల్ తర్వాత టీసీఎస్ (రూ. 4.98 లక్షల కోట్లు), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (రూ. 4.70 లక్షల కోట్లు), ఐటీసీ (రూ. 3.28 లక్షల కోట్లు), హెచ్‌డీఎఫ్‌సీ (రూ. 2.79 లక్షల కోట్లు) ఉన్నాయి. అటు ఐసీఐసీఐ బ్యాంకు మార్కెట్ వేల్యుయేషన్ మరోసారి రూ. 2 లక్షల కోట్ల మార్కును అధిగమించింది.
Comments
Please login to add a commentAdd a comment