నేచురల్లే నుంచి రైస్ బ్రాన్ ఆయిల్..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నేచురల్లే బ్రాండ్ పేరుతో వంట నూనెల విక్రయంలో ఉన్న సరైవాలా అగ్రి రిఫైనరీస్ తాజాగా రైస్ బ్రాన్ ఆయిల్ విభాగంలోకి ప్రవేశించింది. అలాగే ఇదే బ్రాండ్‌లో సోనా మసూరీ రైస్‌ను సైతం సినీ నటి సంజనా గల్రానీ చేతుల మీదుగా సోమవారమిక్కడ ప్రవేశపెట్టింది. హైదరాబాద్ సమీపంలోని మహేశ్వరం వద్ద ఉన్న కంపెనీకి చెందిన ప్లాంటులో రైస్ బ్రాన్ ఆయిల్ (తవుడు నూనె) కోసం ప్రత్యేక యూనిట్‌ను రూ.25 కోట్లతో ఏర్పాటు చేసింది. రోజుకు 100 టన్నుల నూనె ఉత్పత్తి చేసే సామర్థ్యం ఈ యూనిట్‌కు ఉంది.
ఇక వంట నూనెల పరిశ్రమ 7 శాతం వృద్ధి చెందుతోందని సరైవాలా డెరైక్టర్ అంజని కుమార్ గుప్తా ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. అయితే రైస్ బ్రాన్ విభాగం మాత్రం అత్యధికంగా 25-30 శాతం వృద్ధి నమోదు చేస్తోందని వెల్లడించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వివిధ కంపెనీలు నెలకు 4,000 టన్నుల రైస్ బ్రాన్ ఆయిల్ విక్రయిస్తున్నాయి. కాగా, సరైవాలా అగ్రి రిఫైనరీస్ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం వద్ద రూ.50 కోట్లతో రిఫైనరీ నెలకొల్పుతోంది. రోజుకు 550 టన్నుల సామర్థ్యం గల ఈ ప్లాంటులో జూన్‌లో ఉత్పత్తి ప్రారంభం కానుంది. నేచురల్లే బ్రాండ్‌లో సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను సైతం కంపెనీ విక్రయిస్తోంది.