చలన చిత్రపరిశ్రమలో మహిళల భద్రత, సమాన గౌరవం, పని హక్కు వంటి అంశాలపై నటి సంజనా గల్రానీ కన్నడ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్‌కు ఓ లేఖ రాశారు. ఆ లేఖ సారాంశం ఈ విధంగా... ‘‘ఇండస్ట్రీలో ఒక ఉమెన్ ఆర్టిస్టు అసోసియేషన్ ఉండాలి. ఆల్రెడీ ఉన్న ఆర్టిస్టు అసోసియేషన్‌తో కలిసి ఈ ఉమెన్ ఆర్టిస్టు అసోసియేషన్ పని చేయాలి. ఓ నటికి ఉండాల్సిన కనీస హక్కులు గురించిన చర్చ జరగాలి. ఇందుకు సంబంధించిన అవగాహన కార్యక్రమాల నిర్వహణ జరగాలి. ప్రస్తుతం తోటి పరిశ్రమల్లో జరుగుతున్న పరిణామాలు బాధ కలిగిస్తున్నాయి. అలాంటి బ్లాక్ మార్క్స్ కన్నడ ఇండస్ట్రీపై పడకూడదు. అందుకే ఈ లేఖ రాస్తున్నాను.
కన్నడ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఆర్టిస్టు అసోసియేషన్, ప్రొడ్యూసర్స్ అసోసియేషన్, డైరెక్టర్స్ అసోసియేషన్, టెక్నీషియన్స్ అసోసియేషన్‌ల విలువైన సలహాలతో ‘శాండిల్‌వుడ్ ఉమెన్ ఆర్టిస్టు అసోసియేషన్’ (ఎస్‌డబ్ల్యూఏఏ – ‘శ్వా’) ఏర్పాటు కావాలి. ముఖ్యంగా ఈ ‘శ్వా’పై కర్ణాటక ప్రభుత్వం పర్యవేక్షణ ఉండాలి’’ అని సంజన ఆ లేఖలో రాసుకొచ్చారు.
అలాగే ఈ లేఖను పరిశీలించవలసినదిగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య, హోం మినిస్టర్ పరమేశ్వర్, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్ మినిస్టర్ లక్ష్మీ హెబ్బాల్కర్‌లను అడ్రస్ చేశారు సంజన. అలాగే సెట్స్‌లో నటీమణులు దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక క్యారవేన్ ఉండాలని, ఓ గది అయినా ఉండేలా ఏర్పాట్లు ఉండాలని, రాత్రి షూట్ సమయంలో సరైన పరిస్థితులు ఉండాలని... ఇవన్నీ ‘శ్వా’కి ప్రాథమిక నియమాలుగా ఉండాలంటూ మరికొన్ని నియమాలను కూడా స్పష్టం చేశారు సంజన.
Comments
Please login to add a commentAdd a comment