కాఫీ అంటే ఇష్టపడనివారు ఉండరు. ఐతే ఈ కాఫీలో ఉండే కెఫిన్ మన శరీరంలో అత్యంత దుష్పరిణామాలకు దారితీస్తోంది. అందుకనే రోజుకు రెండు నుంచి మూడు కప్పులకు మించి కాఫీ తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. దీంతో పలు కంపెనీలు కెఫిన్ లేని కాఫీ పొడిని తయారు చేస్తున్నాయి. కానీ వాటి ఖరీదు ఎక్కువ. అందరూ కొనుగోలు చేయలేరు. ఆ సమస్యకు చెక్‌పెట్టి ఆరోగ్యకరమైన కాఫీని ఆస్వాదించేలా కెఫిన్ లేని కాఫీ గింజలను ఉత్పత్తి చేసేందుకు నాంది పలికారు బ్రెజిల్ శాస్త్రవేత్తలు.
ఈ మేరకు బ్రెజిలియన్ కాఫీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కి చెందిన శాస్త్రవేత్తలు చేపట్టిన రెండు దశాబ్దాల ప్రాజెక్టులో చాలా వరకు పురోగతి సాధించారు. ఈ పరిశోధనలు ప్రముఖ కాఫీ పరిశోధనా కేంద్రం ఇన్‌స్టిట్యూటో అగ్రోనోమికో డీ కాంపినాస(ఐఏఎస్) ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈ పరిశోధన ఫలితంగా అధిక దిగుబడినిచ్చే కాఫీ మొక్కలను అభివృద్ధి చేశారు శాస్త్రవేత్తలు. దీంతో బ్రెజిల్ వాణిజ్య పరంగా కాఫీ ప్రపంచ మార్కెట్‌లో పవర్‌హౌస్‌గా మారుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
అనేక ఏళ్లుగా కెఫిన్ కంటెంట్ తక్కువుగా ఉన్న వివిధ కాఫీ మొక్కలను అభివృద్ధి చేయడమే గాక క్షేత్ర స్థాయిలో ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇది గనుక విజయవంతమైతే అతి పెద్ద వినియోగదారులైన యూరప్, యునైటెడ్ స్టేట్స్ వంటి వాటితో బ్రెజిల్‌కి సముచిత వాణజ్య మార్కెట్ ఏర్పడే అవకాశం ఉంటుందని చెప్పారు. అంతేగాక డీకాఫీన్(కెఫిన్ శాతం తగ్గించడం) తయారు చేస్తున్న కంపెనీలు తమ ఖర్చులను తగ్గించేందుకు మొగ్గు చూపతాయని అంటున్నారు. ప్రస్తుతం తాము బ్రెజిల్‌లో వివిధ ప్రాంతాల్లో ఈ డీకాఫిన్ మొక్కలను పెంచుతున్నామని, అవి గింజలను ఉత్పత్తి చేయడానికి సాధారణంగా రెండు నుంచి మూడేళ్ల పడుతుందని చెబుతున్నారు. అందువల్ల తమ పరిశోధన మరింత విజయవంతం కావడానికి తాము ఇంకాస్త సమయం నిరీక్షించాల్సి ఉందని చెబుతున్నారు.
వాస్తవానికి సాధారణ కాఫీలో ఉండే కాఫీ మనల్ని ఉత్సాహంగా ఉంచేలా చేయడమే గాక రోజంతా మేల్కోని ఉండేలా శక్తినిస్తుంది. కానీ ఈ కెఫిన్ కడుపులో యాసిడ్‌లను పెంచి మంట లేదా గుండెల్లో నొప్పికి దారితీసే ప్రమాదం పొంచి ఉంది. దాన్ని నివారించేందుకే కెఫిన్ తక్కువగా ఉండే కాఫీ మొక్కలను అభివృద్ధి చేసే ప్రాజెక్టు తెరపైకి వచ్చింది. ఇప్పటికే యూఎస్ వంటి దేశాల్లో 10 శాతం కెఫిన్ ఉన్న కాఫీని తయారు చేస్తున్నాయి కొన్ని కార్పొరేట్ సంస్థలు. ఇది కాస్త ఖర్చుతో కూడుకున్నది. దీన్ని అధిగమించేందుకే శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలు చేస్తున్నారు. కాగా, శాస్త్రవేత్తల బృందం మాత్రం తమ పరిశోధనలు విజయవంతమవుతాయని ధీమగా చెబుతున్నారు.
(చదవండి: 127 గంటలు.. డ్యాన్స్!)
Comments
Please login to add a commentAdd a comment