లండన్: కుదిరితే ఒక కప్పు కాఫీ అలవాటుకు ఇక దూరంగా ఉండాల్సిందేనా! ఆ అలవాటు తగ్గించుకుంటే మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాఫీని మితంగా తీసుకుంటే ఫర్వాలేదు కానీ, అతిగా సేవిస్తేనే ప్రమాదమంటున్నారు వీరు. తాజాగా దీనిపై బ్రిటన్ లోని 'గ్లెన్ హాస్పిటల్ బ్రిస్టల్' చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. కాఫీ, టీ, చాక్ లెట్ లో ఉండే కఫైన్ అనే పదార్థం అధికంగా శరీరంలోకి వెళ్తే ప్రమాదమేనట. కఫైన్ 400 మిల్లి గ్రాములకు మించి శరీరంలోకి పంపిస్తే.. గుండె జబ్బులతోపాటు, రక్తపోటు తదితర సమస్యలు వస్తాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
శారీరక వ్యాయామాలు చేసేవారు కాఫీని ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ అధికమయ్యే అవకాశాలే మెండుగా ఉంటాయని అభిప్రాయపడుతున్నారు. రోజుకు మూడు కప్పులు మించి కాఫీని సేవించే వారికి రాత్రిపూట నిద్రలేమి సమస్యలు కూడా అధికంగానే ఉంటాయట. ఈ తరహా అలవాటు ఉన్నవారికి పూర్తిస్థాయి నిద్ర పట్టకపోవడం సైంటిఫిక్ గా నిరూపితమైందని పరిశోధకులు బల్లగుద్దీ మరీ చెబుతున్నారు.