పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కాం వెలుగులోకి రాకముందు వరకు నీరవ్ మోదీ డైమండ్ జువెల్లర్స్‌కు ఫుల్ డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. పెద్ద పెద్ద సెలబ్రిటీలందరూ ఈయన కస్టమర్లే. 2016లో డిమానిటైజేషన్ ప్రకటించిన ఆ సమయంలో నీరవ్ జువెల్లర్స్‌కు ఇక అడ్డూ అదుపు లేదు. 2015-16లో మోదీ డైమండ్స్‌ను కేవలం 86 మంది ధనిక వ్యక్తులే కొనుగోలు చేయగా... ఆ తర్వాత ఏడాది డిమానిటైజేషన్ ప్రకటించిన సమయంలో(2016లో) 340 మంది ప్రముఖ, ధనిక కస్టమర్లు నీరవ్ మోదీ డైమండ్స్‌ను కొనుగోలు చేసినట్టు తెలిసింది. అంటే దాదాపు నాలుగు రెట్లు ఈయన కస్టమర్లు పెరిగినట్టు వెల్లడైంది. ప్రస్తుతం వీరందరూ పన్ను అధికారుల కనుసన్నల్లోకి వచ్చేశారు.
పీఎన్‌బీలో రూ.13,600 కోట్ల స్కామ్‌కు పాల్పడిన నీరవ్ మోదీపై ఇప్పటికే విచారణను ముమ్మరం చేసిన అధికారులు, ప్రస్తుతం ఆయన కస్టమర్లపై కూడా కన్నేశారు. పాన్ కార్డు లేకుండా.. నగదు ఎక్కడి నుంచి వచ్చిందో సరియైన వనరు తెలుపకుండా.. కోట్లలో విలువ చేసే జువెల్లరీ కొనుగోలు చేసిన 650 మందికి పైగా భారతీయుల జాబితాను పన్ను అధికారులు రూపొందించినట్టు ఇండియా టుడే టీవీ పేర్కొంది. ఆదాయపు పన్ను అధికారులు జరిపిన విశ్లేషణలో ఎక్కువ మొత్తంలో జువెల్లరీ కొనుగోళ్లు సంపన్న, ప్రముఖ వ్యక్తులే జరిపినట్టు తెలిసింది. వీరిలో నీరవ్ మోదీకి అధికంగ క్లయింట్స్ ఉన్నట్టు వెల్లడైంది.
నీరవ్ మోదీకి ఉన్న ప్రముఖ, ధనికవంతులైన క్లయింట్స్‌లో లాయర్, కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి అభిషేక్ సింఘ్వీ ఉన్నారని తెలిసింది. ఆయన బ్లాక్‌మనీతో రూ.6 కోట్ల విలువైన జువెల్లరీ కొనుగోలు చేసినట్టు రిపోర్టులు పేర్కొన్నాయి. కానీ తాను కేవలం రూ.1.6 కోట్ల జువెల్లరీని మాత్రమే కొనుగోలు చేశానని, అదీ కూడా చెక్‌పేమెంట్ ద్వారా జరిపినట్టు సింఘ్వీ చెప్పారు. ఆయనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. సిద్ధరామయ్య ప్రభుత్వంలో సీనియర్ కాంగ్రెస్ మంత్రి కోడలు కూడా కోట్ల విలువ చేసే మోదీ జువెల్లరీని కొనుగోలు చేసిందని, ఆమె నీరవ్ మోదీకి అతిపెద్ద కస్టమర్ అని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ జాబితాలో అహ్మదాబాద్‌కు చెందిన రియాల్టర్, టూ-వీలర్ దిగ్గజం ప్రమోటర్స్ కుటుంబ సభ్యులు, పుణేకు చెందిన రియాల్టీ సంస్థ ప్రమోటర్లు ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. వీరందరికీ ఐటీ నోటీసులు పంపినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఆదాయపు పన్ను శాఖ ఏడాదిన్నర క్రితమే విచారణ జరిపినట్టు, నీరవ్ మోదీ కేసు అనంతరం ఎందుకు నోటీసులు పంపుతున్నట్టు ఓ కాంగ్రెస్ నేత ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment