
సెన్సెక్స్ @ 30,000
మళ్లీ రికార్డ్‌ల మోత
⇒ ఇంట్రాడేలో ఏడాది గరిష్ట స్థాయిని తాకిన సెన్సెక్స్
⇒ 64 పాయింట్ల లాభంతో 29,974 వద్ద ముగింపు
⇒ 27 పాయింట్ల లాభంతో 9,265కు నిఫ్టీ
స్టాక్ సూచీలు బుధవారం మళ్లీ రికార్డ్‌ల మోత మోగించాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, మారుతీ సుజుకీ, ఎల్ అండ్ టీల దూకుడుతో స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 30,000 పాయింట్లను, నిఫ్టీ జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. ముగింపులోనూ సెన్సెక్స్, నిఫ్టీలు రికార్డ్‌లు సృష్టించాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 30,000 పాయింట్లకు కొంచెం దిగువన, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కీలకమైన 9,250 పాయింట్ల ఎగువన ముగిశాయి. సెన్సెక్స్ 64 పాయింట్ల లాభంతో 29,974 పాయింట్ల వద్ద, నిఫ్టీ 27 పాయింట్ల లాభంతో 9,265 పాయింట్ల వద్ద ముగిశాయి. ఈ రెండు స్టాక్ సూచీలకు ఇవి జీవిత కాల గరిష్ట స్థాయి ముగింపులు. అయితే సెన్సెక్స్ 2015లో సాధించిన జీవిత కాల గరిష్ట స్థాయి 30,025కు 51 పాయింట్ల దూరంలో ఉంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ద్రవ్య విధానాన్ని ఆర్‌బీఐ నేడు(గురువారం) వెల్లడించనున్న సందర్భంగా ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణిని అవలంబించారు. దాంతో సెన్సెక్స్ చరిత్రాత్మక రికార్డుస్థాయిని సాధించలేకపోయింది. కీలక రేట్ల విషయంలో యథాతధ స్థితిని ఆర్‌బీఐ కొనసాగిస్తుందనే అంచనాలున్నాయి. అయితే మొండి బకాయిల సమస్య, అధికంగా ఉన్న లిక్విడిటీ విషయమై ఆర్‌బీఐ మరిన్ని చర్యలు తీసుకుంటుందనే ఆశలు నెలకొన్నాయి. దీంతో వడ్డీరేట్ల ప్రభావిత బ్యాంకింగ్, వాహన, రియల్టీ రంగ షేర్లు లాభపడ్డాయి. ఐటీసీ, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ నష్టపోవడంతో లాభాలు పరిమితమయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 30,007 పాయింట్లను తాకింది. ఆ తర్వాత 29,818 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. సోమవారం నాటి ముగింపుతో పోల్చితే సెన్సెక్స్ ఒక దశలో 93 పాయింట్లు నష్టపోగా, మరో దశలో 97 పాయింట్లు లాభపడింది. మొత్తం మీద 190 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. ఇక ఇంట్రాడేలో 9,274 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకిన నిఫ్టీ ఆ తర్వాత గరిష్ట స్థాయిల్లో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో చివరకు 27 పాయింట్ల లాభంతో 9,265 పాయింట్ల వద్ద ముగిసింది.
రిలయన్స్ దూకుడు..
రిలయన్స్ దూకుడు కొనసాగుతోంది. ఈ షేర్ 3.1 శాతం లాభపడి రూ.1,415 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.15,262 కోట్లు పెరిగి రూ.4.6 లక్షల కోట్లకు చేరింది. ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.6,356ను తాకిన మారుతీ సుజుకీ చివరకు 4.4 శాతం లాభపడి రూ.6,339 వద్ద ముగిసింది. అమ్మకాల పరంగా మారుతీ బ్రెజా అగ్రస్థానాన్ని సాధించిందని, యుటిలిటి వెహికల్ మార్కెట్లో 2015–16లో 15 శాతంగా ఉన్న మారుతీ మార్కెట్ వాటా గత ఆర్థిక సంవత్సరంలో 26 శాతానికి పెరిగిందన్న వార్తలతో మారుతీ సుజుకీ దూసుకుపోయింది. ఎల్ అండ్ టీ షేర్ 2.1 శాతం లాభపడి రూ.1,697 వద్ద ముగిసింది.