
కేంద్రానికి రిలయన్స్ ఆర్బిట్రేషన్ నోటీసు
న్యూఢిల్లీ: ఇప్పటికే చాలా జాప్యమైన సహజవాయువు ధర పెంపును వెంటనే అమలు చేయాలంటూ ప్రభుత్వానికి రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్), భాగస్వామ్య సంస్థలు బ్రిటిష్ పెట్రోలియం(బీపీ), నికో రిసోర్సెస్‌లు ఆర్బిట్రేషన్ నోటీసు జారీ చేశాయి. గత ప్రభుత్వం ఆమోదించిన గడువు తేదీ అయిన ఏప్రిల్ 1 నుంచి రేటు పెంపు అమలుకాకపోవడం వల్ల సుమారు 4 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులు నిలిచిపోయేందుకు దారితీస్తోందని మే 9న జారీ చేసిన ప్రీ-ఆర్బిట్రేషన్ నోటీసులో ఈ 3 కంపెనీలు పేర్కొన్నాయి.
లండన్‌కు చెందిన సర్ డేవిడ్ స్టీల్‌ను తమ తరఫున ఆర్బిట్రేటర్‌గా పేర్కొంటూ ఆర్బిట్రేషన్ నోటీసును జూన్ 17న జారీ చేసినట్లు సమాచారం. గ్యాస్ రేటును 4.2 డాలర్ల నుంచి(ఒక్కో యూనిట్‌కు) రెట్టింపునకు పైగా పెంచుతూ(8.8 డాలర్లకు) గతేడాది కేబినెట్ ఆమోదం తెలిపింది. దీన్ని ఈ ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తామని కూడా పేర్కొందని... దీనికి కట్టుబడి ఉండాలని ప్రభుత్వాన్ని రిలయన్స్-బీపీ-నికో పేర్కొన్నాయి. వాస్తవానికి ఏప్రిల్ 1 నుంచి రేటు పెంచుతూ జనవరి10న గత యూపీఏ సర్కారు కొత్త గ్యాస్ ధర ఫార్ములాను నోటిఫై చేసింది. అయితే, సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకిరావడంతో అమలు జూలై 1 వరకూ వాయిదా పడింది. అయితే, రంగరాజన్ కమిటీ రూపొందించిన ఫార్ములా ప్రకారం రేటు పెంపుపై తాజాగా మోడీ నేతృత్వంలోని సెప్టెంబర్ నెలాఖరు వరకూ పెంపును వాయిదా వేసింది.