
రూ.500కే స్మార్ట్ ఫోన్
నోయిడా: పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటారు. వేలకు వేలు పోసి ఫోన్ కొంటే.. జేబుదొంగల బారిన పడటం లేదా రెండు మూడేళ్లకే ఫోన్ ఏదో ఒకలా పాడైపోవడం లాంటివి చాలా చోట్ల చూస్తాం. మళ్లీ అంత డబ్బు పోసి కొనలేక.. స్మార్ట్‌ఫోన్‌ను వదలలేక నానా ఇబ్బందులు పడతారు. అలాంటివాళ్ల కోసం త్వరలో రూ.500కే స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రానుంది. దేశీయ మొబైల్ హ్యాండ్‌సెట్ ఉత్పత్తిదారు 'రింగింగ్ బెల్స్' అత్యంత చౌకైన స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. 'ఫ్రీడమ్ 251' పేరుతో రూపొందిన ఈ ఫోనును రక్షణమంత్రి మనోహర్ పారికర్ బుధవారం విడుదల చేసే అవకాశాలున్నాయట.
ప్రధాని నరేంద్రమోదీ ఆశయాలకు అనుగుణంగా భారత్లోని ప్రతి వ్యక్తికి అందుబాటులో ఉండేలా అతి తక్కువధరకే స్మార్ట్ ఫోన్‌ను రూపొందించామని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. రింగింగ్ బెల్స్ గత ఏడాది రూ.2,999కే అత్యంత చౌకైన 4జీ ఫోన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం లాంచ్ చేయనున్న 'ఫ్రీడమ్ 251' మోడల్ ప్రత్యేకతలకు సంబంధించి సంస్థ ఎటువంటి వివరాలు వెల్లడించలేదు.