భారత్‌కు ఎస్‌యూవీల కాన్వాయ్ | Rising SUV sales | Sakshi
Sakshi News home page

భారత్‌కు ఎస్‌యూవీల కాన్వాయ్

Published Sat, Mar 31 2018 2:26 AM | Last Updated on Sat, Mar 31 2018 2:26 AM

Rising SUV sales - Sakshi

సాక్షి, బిజినెస్‌ విభాగం :  చిన్న కారు సోకు తగ్గిపోతోంది. ఆదాయాలు పెరుగుతుండటంతో ప్రజల చూపు ఎస్‌యూవీలు, మరింత గ్లామరస్‌గా ఉండే ఖరీదైన కార్ల వైపు మళ్లుతోంది. ధర, నిర్వహణ వ్యయాలు.. ఈ రెండూ కీలకంగా గతంలో వినియోగదారులు కార్లను కొనుగోళ్లు చేసేవాళ్లు. ఇదిప్పుడు మారుతోంది. ఇంజిన్‌ కెపాసిటీ, సౌకర్యం, సొగసులకు ప్రాధాన్యం పెరుగుతోంది. దీంతో చిరకాలంగా చిన్న కార్లకు మంచి మార్కెట్‌గా ఉన్న భారత్‌.. ఎస్‌యూవీ సెగ్మెంట్‌కు మంచి మార్కెట్‌గా ఎదగటం మొదలెట్టింది.

భారత్‌లో వాహన మార్కెట్‌ మెచ్యూర్‌ అవుతోందనడానికి ఇది మంచి సూచననేది నిపుణుల మాట. ఏడాదికి దాదాపు 40 లక్షల వాహన విక్రయాలతో ప్రపంచంలోనే అయిదవ అతి పెద్ద వాహన మార్కెట్‌గా అవతరించిన భారత్‌లో మూడో తరం కొత్త కంపెనీలు రానున్నాయి. 90లలో హ్యుందాయ్, టొయోటా, హోండా మోటార్స్‌ తొలి తరం కంపెనీలుగా రాగా, 2000లలో ఫోక్స్‌వ్యాగన్, రెనో, నిస్సాన్‌ తదితర కంపెనీలొచ్చాయి.

ఇప్పుడు మూడో తరం కొత్త కంపెనీలు.. కియా, పీఎస్‌ఏ, ఎమ్‌జీ.. ఇలా ఆరు కొత్త విదేశీ కంపెనీలు వస్తున్నాయి. ఇవన్నీ ఎక్కువగా ఎస్‌యూవీలపైననే దృష్టి పెడుతుండడం విశేషం. కియా, ఎమ్‌జీలు భారత్‌లో వచ్చే 3–4 ఏళ్లలో రూ.13,000 కోట్లు, పీఎస్‌ఏ గ్రూప్‌ రూ.700 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నాయి. చిన్న కార్ల సెగ్మెంట్‌పై కాకుండా ఈ విదేశీ కంపెనీలు  ప్రీమియమ్‌ ఎస్‌యూవీలు, హ్యాచ్‌బ్యాక్‌ సెగ్మెంట్లపై కన్నేశాయి.

ఎస్‌యూవీల స్పీడ్‌... అమెరికాను అధిగమిస్తాం
ఎస్‌యూవీల అమ్మకాలు జోరుగా పెరుగుతున్నాయి. మినీ కార్లు, కాంపాక్ట్‌ సెడాన్‌ల తర్వాత ఇప్పుడు కాంపాక్ట్‌ ఎస్‌యూవీలు భారత్‌లో బాగా అమ్ముడవుతున్నాయి. 4.2 మీటర్ల పొడవు, రూ.15 లక్షల రేంజ్‌ ఉండే ఈ ఎస్‌యూవీల విక్రయాల్లో గత ఏడాది మన దేశం జపాన్‌ను తోసిరాజని మూడోస్థానంలోకి వచ్చింది. త్వరలో రెండో స్థానంలో ఉన్న అమెరికాను కూడా అధిగమిస్తామని, చైనా తర్వాతి స్థానం మనదే అవుతుందనేది నిపుణుల అంచనా.

గత ఐదేళ్లలో మన దేశంలో ఎస్‌యూవీల విక్రయాలు దాదాపు రెట్టింపయ్యాయి. స్పోర్ట్స్, మల్టీ యుటిలిటి వెహికల్స్‌ కలిపి గతేడాది 7.6 లక్షల వరకూ అమ్ముడయ్యాయి. మొత్తం అమ్ముడైన కార్లలో వీటి వాటా నాలుగో వంతు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 11 నెలల్లో మొత్తం 8.3 లక్షల యుటిలిటీ వెహికల్స్‌ అమ్ముడయ్యాయి. మొత్తం 30 లక్షల అమ్మకాల్లో ఇది 28 శాతం.

నాలుగేళ్లలో 35 కొత్త ఎస్‌యూవీలు..
వచ్చే నెల నుంచి ఆరంభమయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల వాహన విక్రయాలు 7–9 శాతం రేంజ్‌లోనే పెరుగుతాయని... ఎస్‌యూవీల అమ్మకాలు మాత్రం 14–15 శాతం వృద్ధితో పది లక్షల మార్క్‌కు చేరతాయని భావిస్తున్నారు. 2020 కల్లా ఈ కేటగిరీ అమ్మకాలు 15 శాతం చొప్పున చక్రగతిన వృద్దితో 14 నుంచి 15 లక్షల రేంజ్‌కు చేరొచ్చనే అంచనాలున్నాయి. దీంతో విదేశీ కంపెనీలు మన ఎస్‌యూవీ మార్కెట్‌పై కన్నేశాయి.

ప్రస్తుతమున్న కంపెనీలూ కొత్త ఎస్‌యూవీలతో పాటు ప్రస్తుతమున్న మోడళ్లలో కొత్త వేరియంట్లను మార్కెట్లోకి తేనున్నాయి. మొత్తం మీద నాలుగేళ్లలో 35 కొత్త ఎస్‌యూవీలు మన మార్కెట్‌ను ముంచెత్తనున్నాయి. దాదాపు ఆరు విదేశీ కంపెనీలు తమ యుటిలిటీ వాహనాలను మన మార్కెట్లోకి తేవడానికి సిద్ధమవుతున్నాయి. ఎస్‌ఏఐసీ కియా, పీఎస్‌ఏ, బెల్కి ఫోటన్,, ఛంగన్‌ కంపెనీలు తమ మోడళ్లను ముఖ్యంగా ఎస్‌యూవీలను భారత రోడ్లపైకి తెస్తున్నాయి.


ఎంపిక ఎంతో కష్టం...
విదేశీ కంపెనీలు పోలోమని భారత మార్కెట్లోకి వస్తుండడంతో ఇప్పుడు  కారు కొనాలనే భారతీయ వినియోగదారులకు గట్టి చిక్కే ఎదురు కానుంది. ఎంచుకోవడానికి ఎన్నెన్నో మోడళ్లు అందుబాటులోకి రానున్నాయి మరి. కొరియాకు చెందిన కియా మోటార్‌ కార్పొరేషన్, చైనాకు చెందిన ఎస్‌ఏఐసీ, పీఎస్‌ఏ గ్రూప్‌ తదితర విదేశీ కంపెనీలు వచ్చే ఏడాది కనీసం ఆరు ఎస్‌యూవీ మోడళ్లను అందుబాటులోకి తేనున్నాయి.

ఎమ్‌జీ మోటార్‌ ఇండియా: చైనాకు చెందిన  షాంగై ఆటోమోటివ్‌(ఎస్‌ఏఐసీ) అనుబంధ సంస్థ ఎమ్‌జీ మోటార్‌... ఇతర విదేశీ కంపెనీలతో పోలిస్తే ఇదే మొదట భారత్‌లోకి ఎస్‌యూవీ తేనుంది. ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన జీప్‌ కాంపాస్‌కు పోటీగా ఈ కంపెనీ కొత్త ఎస్‌యూవీని తెస్తోంది.

ఆ తర్వాత క్రెటాకు పోటీగా మరో ఎస్‌యూవీని అందుబాటులోకి తేనుంది. మోరిస్‌ గ్యారేజెస్‌ (ఎమ్‌జీ) బ్రాండ్‌ ఎస్‌యూవీలను వచ్చే ఏడాది జూన్‌ కల్లా భారత మార్కెట్లోకి తెస్తామని, ఇప్పుడు భారత్‌లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న సెగ్మెంట్‌ ఎస్‌యూవీ సెగ్మెంటేనని ఎమ్‌జీ మోటార్‌ ఇండియా ఎమ్‌డీ రాజీవ్‌ చబా చెప్పారు. తమ కంపెనీ తొలి ఎస్‌యూవీకి కావలసిన విడిభాగాలను ఇప్పటికే 80–85 శాతం మేర సమీకరించామన్నారు.

మరింతగా స్థానిక విడిభాగాలనే వినియోగించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నామని, దీంతో తమ ఎస్‌యూవీని ఆకర్షణీయమైన ధరకు అందించగలమని చెప్పారాయన. చాలా విదేశీ కంపెనీలు ఎంట్రీ లెవల్‌ ఎస్‌యూవీలపైననే దృష్టి పెడుతుండగా, ఎమ్‌జీ మోటార్‌ మాత్రం ప్రీమియమ్‌ ఎస్‌యూవీలపైనే దృష్టి కేంద్రీకరిస్తోంది.

బెల్కి ఫోటన్‌: భాతర్‌లో ఎస్‌యూవీల జోరును చూసిన చైనా అతి పెద్ద వాణిజ్య వాహన కంపెనీ బెల్కి ఫోటన్‌.. భారత మార్కెట్‌ పట్ల తన ప్రణాళికలను పూర్తిగా మార్చుకుంది. భారత్‌లో ట్రక్కులతో అరంగేట్రం చేయాలనుకున్న ఈ కంపెనీ, ఆ ఆలోచనకు స్వస్తి చెప్పి బోర్గ్‌వార్డ్‌ బ్రాండ్‌ కింద ఎస్‌యూవీలను, వ్యాన్లను తేవాలనుకుంటోంది. ఫోర్స్‌ మోటార్స్‌ టెంపో ట్రావెలర్, జీప్‌ కాంపాస్, మహీంద్రా ఎక్స్‌యూవీలకు పోటీగా వాహనాలను అందించాలనుకుంటోంది.

కియా: దక్షిణ కొరియాకు చెందిన కంపెనీ ‘కాన్సెప్ట్‌ ఎస్‌పీ’ని ఇటీవల ఢిల్లీలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించింది. ఈ కాన్సెప్ట్‌ కారు ఆధారంగా ఈ కంపెనీ అందించనున్న ఎస్‌యూవీ.. హ్యుందాయ్‌ క్రెటా, రెనో డస్టర్‌కు గట్టిపోటీనిస్తుందని పరిశ్రమ వర్గాలంటున్నాయి. పోటీ ఎక్కువగా ఉన్న చిన్న కార్ల సెగ్మెంట్లోకి కాకుండా ఎస్‌యూవీతో భారత మార్కెట్లోకి అరంగేట్రం చేయాలనుకుంటున్నట్లు ఇటీవలే కియా మోటార్స్‌ ప్రెసిడెంట్‌ హాన్‌వూ పార్క్‌ చెప్పారు.

మొదటగా కాన్సెప్ట్‌ ఎస్‌పీ ఆధారిత ఎస్‌యూవీని వచ్చే ఏడాది మార్కెట్లోకి తెస్తామని, ఈ తర్వాత మరో చిన్న ఎస్‌యూవీని కూడా అందుబాటులోకి తెస్తామని ఆయన వివరించారు. భారత ఎస్‌యూవీ సెగ్మెంట్లో పోటీ తీవ్రంగానే ఉన్నా, అవకాశాలు కూడా అపారంగా ఉన్నాయని కియా మోటార్స్‌ ఇండియా హెడ్‌ (మార్కెటింగ్‌ అండ్‌ సేల్స్‌) మనోహర్‌ భట్‌ వెల్లడించారు.  మిడ్‌ సెగ్మెంట్‌ ఎస్‌యూవీలు గత ఏడాది మూడున్నర లక్షలు అమ్ముడయ్యాయని 2021 కల్లా ఈ అమ్మకాలు ఆరున్నర లక్షలకు చేరతాయని వివరించారు.

పీఎస్‌ఏ: ఫ్రాన్స్‌కు చెందిన ఈ కంపెనీ ముందుగా ఎంట్రీ లెవల్‌ ఎస్‌యూవీని తేవాలనుకుంటోంది. భారత్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం ఈ కంపెనీకి ఇది మూడోసారి. ఒక కాంపాక్ట్‌ ఎస్‌యూవీని కూడా తేనున్నట్లు సమాచారం. మరోవైపు  మారుతీ విటారా బ్రెజాకు పోటీగా ఒక ఎస్‌యూవీని రంగంలోకి దించనున్నట్లు సంబంధిత వర్గాలంటున్నాయి. చెన్నైలోని హిందుస్తాన్‌ మోటార్స్‌ ప్లాంట్‌ను తన ఉత్పత్తి కార్యకలాపాలకు ఈ కంపెనీ వినియోగించుకోనుంది.

మారుతీ సుజుకీ: ప్రస్తుతం ఎస్‌యూవీ సెగ్మెంట్లో విటారా బ్రెజా ఒక్కటే ఈ కంపెనీకి ఉంది. మరిన్ని ఎస్‌యూవీలను మార్కెట్లోకి తేనుంది. హ్యుందాయ్‌ క్రెటాకు పోటీగా మిడ్‌సైజ్‌ ఎస్‌యూవీని తేవాలనునుకుంటోంది. ప్రసుత్తం ఎంట్రీ లెవల్‌ ఎస్‌యూవీ సెగ్మెంట్లో మహీంద్రాకు చెందిన కేయూవీ100 బాగా అమ్ముడవుతున్నాయి. దీనికి పోటీగా మరో ఎస్‌యూవీని తేవాలని మారుతీ ప్రయత్నిస్తోంది. క్రెటాతో మంచి విజయం దక్కించుకున్న హ్యుందాయ్‌ మరిన్ని ఎస్‌యూవీలపై దృష్టి సారిస్తోంది.

ఫోక్స్‌వ్యాగన్‌: కాంపాక్ట్‌ ఎస్‌యూవీ సెగ్మెంట్లో ఫోక్స్‌వ్యాగన్‌ ‘టీ–క్రాస్‌’ని తెస్తోంది. ఇక రెనో కంపెనీ క్యాప్చర్‌ ఎస్‌యూవీని తేనుంది. రూ.8–15 లక్షల రేంజ్‌లో ఉన్న క్రెటా ఎస్‌యూవీకి పోటీగానే ఛంగన్, పీఎస్‌ఏలు ఎస్‌యూవీలను తేవాలనుకుంటున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement