హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న టీఎస్‌ఎస్ గ్రూప్‌లో రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్‌వోసీ) హైదరాబాద్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. గ్రూప్ కంపెనీల్లో భారీగా నగదు లావాదేవీలు, అవకతవకలు జరిగాయన్న సమాచారంతో ఈ సోదాలు జరిపినట్లు ఆర్‌వోసీ వర్గాలు తెలిపాయి. మాదాపూర్‌లోని కావూరీహిల్స్‌లో ఉన్న టీఎస్‌ఎస్ గ్రూప్‌లో 15 అనుబంధ కంపెనీలున్నాయి. రమేశ్ హరిదాస్, ఉర్వశీ రమేశ్ డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్న ఈ కంపెనీల్లో 10 హైదరాబాద్ ఆర్‌వోసీ పరిధిలో, 2 విజయవాడ, 3 చెన్నై ఆర్‌వోసీ పరిధిలో ఉన్నాయి.
ట్రాన్స్‌జెల్ ఇరాన్‌కు షిఫ్ట్..
టీఎస్‌ఎస్ గ్రూప్‌లోని చాలా కంపెనీలు 2016 నుంచి (ఎంసీఏకు బ్యాలెన్స్ షీట్స్ సమర్పించడం లేదు. ఈ కంపెనీల్లో న్యూ హెవెన్ కెమికల్స్ అండ్ ఇండస్ట్రీస్ గతేడాది బీఎస్‌ఈ నుంచి డీ–లిస్ట్ అయింది. ట్రాన్స్‌జెల్ ఇండస్ట్రీస్ కార్యకలాపాలు ఇరాన్‌కు బదిలీ అయ్యాయి. దీనికి రమేశ్, ఉర్వశీతో పాటూ ఇరాన్ పార్టనర్ హెర్మాన్ జోసెఫ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ విషయమై టీఎస్‌ఎస్ గ్రూప్ డైరెక్టర్ రమేశ్ హరిదాస్‌ను ప్రశ్నించగా.. ‘‘పటాన్‌చెరులో ప్లాంట్ పెడతామని అనుకున్నాం. కానీ, కొన్ని సాంకేతిక కారణాల వల్ల ప్లాంట్‌ను, మిషనరీని ఇరాన్‌కు బదిలీ చేయాల్సి వచ్చింది’’ అని చెప్పారు.
రూ.500 కోట్లకు పైగా రుణాలు...
ఎంసీఏ రికార్డుల ప్రకారం టీఎస్‌ఎస్ గ్రూప్‌నకు రూ.500 కోట్లకు పైగా రుణాలున్నాయి. కాకపోతే సోదాల కోసం వెళ్లిన ఆర్‌ఓసీ అధికారులకు కంపెనీ పేర్ల బోర్డులు గానీ, ఉద్యోగులు గానీ కనిపించలేదని సమాచారం. నందినీ ఇండస్ట్రీస్‌లో ఉన్న 8–10 మందినే ఇతర కంపెనీల్లో కూడా ఉద్యోగులుగా చూపిస్తున్నారనేది ఆర్‌వోసీ అధికారుల మాట. ఈ గ్రూప్‌నకు చెన్నైలో ఉన్న కంపెనీలను కూడా తనిఖీ చేసిన తర్వాత చర్యలు తీసుకుంటామని వారు పేర్కొన్నారు.
ఆర్‌వోసీ లెక్కలే తప్పు..
ఆర్‌వోసీ తనిఖీలపై వివరణ కోరేందుకు ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధి ప్రయత్నించగా... ‘‘మా గ్రూప్ కంపెనీలకున్న రుణాలు రూ.160 కోట్లే. చాలా వరకు తీర్చేశాం. హైదరాబాద్‌లో నాలుగు ప్రైమ్ ప్రాపర్టీలున్నాయి. వాటిని విక్రయించి.. మిగతా రుణాలను తీర్చడానికి ప్రయత్నిస్తున్నాం. ఏడాదిలో ఇది జరిగిపోతుందని’’ అని కంపెనీ ప్రతినిధి ఒకరు చెప్పారు. డైరెక్టరు రమేశ్ హరిదాస్ మాత్రం ‘‘మాకు ఒక్క రూపాయి లోన్ లేదు. ఆర్‌వోసీ రికార్డులే తప్పు. చాలా రుణాలు తీర్చేశాం. బ్యాంక్‌లు ఆర్‌వోసీకి అప్‌డేట్ చేయలేదు’’ అని పేర్కొనటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment