క్లాసిక్‌ పోలో ‘ఫాస్ట్‌ ఫ్యాషన్‌’ | Royal Classic Mills md Sivaram interview | Sakshi
Sakshi News home page

క్లాసిక్‌ పోలో ‘ఫాస్ట్‌ ఫ్యాషన్‌’

Published Tue, Sep 4 2018 1:32 AM | Last Updated on Tue, Sep 4 2018 1:32 AM

Royal Classic Mills md Sivaram interview  - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: రెడీమేడ్స్‌ రంగంలో ఫ్యాషన్‌ను ఫాలో అయితేనే రిటైలర్లు విజయవంతమవుతారు. ఇందులో భాగంగానే రాయల్‌ క్లాసిక్‌ మిల్స్‌ కొత్త కాన్సెప్ట్‌ను ఆవిష్కరించింది. కొత్త డిజైన్లను ఎప్పటికప్పుడు కస్టమర్లకు చేరవేసేందుకు ఫాస్ట్‌ ఫ్యాషన్‌ పేరుతో రిటైలర్ల కోసం ఓ యాప్‌ను రూపొందించింది. టీ–షర్ట్స్, షర్ట్స్, ట్రూజర్స్, డెనిమ్స్‌.. ఇలా విభాగాల వారీగా కొత్త డిజైన్లు ఈ యాప్‌లో ఉంటాయి. వారంలోగా రిటైలర్లు ఆర్డరివ్వాలి. ఆర్డరిచ్చిన నెల రోజుల్లో సరుకు దుకాణాలకు చేరుతుంది. రెడీమేడ్‌ రంగంలో తొలిసారిగా ఈ కాన్సెప్ట్‌ను తాము అమలు చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.  

కస్టమర్లకే ప్రయోజనం..
సాధారణంగా రెడీమేడ్‌ రంగంలో ఆర్డరిచ్చిన 3–6 నెలలకు సరుకు దుకాణాలకు వస్తుంది. ఫాస్ట్‌ ఫ్యాషన్‌ కాన్సెప్ట్‌తో కస్టమర్లు నూతన డిజైన్లను ఎప్పటికప్పుడు ఆస్వాదించే వీలుంటుందని రాయల్‌ క్లాసిక్‌ మిల్స్‌ ఎండీ టి.ఆర్‌.శివరామ్‌ చెప్పారు. కంపెనీ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్‌ వచ్చిన ఆయన ‘సాక్షి’ బిజినెస్‌ బ్యూరో ప్రతినిధితో మాట్లాడారు. దారం నుంచి దుస్తుల వరకు పూర్తి స్థాయి తయారీలో తాము ఉన్నాం కాబట్టి దీన్ని అమలు చేయటం సాధ్యమవుతోందని తెలియజేశారు. ‘‘సరుకు నిల్వ భయం ఉండదు. ఈ ఏడాది నవంబరు నుంచి ఈ కాన్సెప్ట్‌ను అమల్లోకి వస్తుంది’’ అని చెప్పారాయన.

టర్నోవర్‌ రూ.800 కోట్లు..
తమిళనాడులోని తిరుపూర్‌ కేంద్రంగా 28 ఏళ్లుగా రాయల్‌ క్లాసిక్‌ మిల్స్‌ సేవలందిస్తోంది. 15 ఫ్యాక్టరీల్లో 8,000 పైచిలుకు ఉద్యోగులున్నారు. కంపెనీకి ఎగుమతుల ద్వారా 2017–18లో రూ.550 కోట్లు సమకూరింది. భారత్‌లో రిటైల్‌ ద్వారా మరో రూ.200 కోట్లు ఆర్జించింది. 10 శాతం ఆదాయం తెలంగాణ, ఏపీ నుంచి వస్తోంది. ప్రముఖ విదేశీ బ్రాండ్లకూ దుస్తులను తయారు చేసి ఎగుమతి చేస్తోంది. తయారీ కేంద్రాలకు రూ.250 కోట్లు వెచ్చించింది. 2018–19లో టర్నోవర్‌ రూ.800 కోట్లు ఉంటుందని శివరామ్‌ తెలియజేశారు.


ఈ ఏడాది మరో 70 స్టోర్లు
కంపెనీ క్లాసిక్‌ పోలోతోపాటు యువకుల కోసం ప్రత్యేకంగా సీపీ బ్రో బ్రాండ్‌లో రెడీమేడ్స్‌ తయారు చేస్తోంది.  ఈ బ్రాండ్లు దేశవ్యాప్తంగా 3,000పైగా రిటైల్‌ దుకాణాల్లో లభిస్తున్నాయి. 130 ఎక్స్‌క్లూజివ్‌ ఔట్‌లెట్లున్నాయి. మార్చి కల్లా మరో 70 ఎక్స్‌క్లూజివ్‌ స్టోర్లు రానున్నట్లు శివరామ్‌ వెల్లడించారు. 2019–20లో కొత్తగా 100 ఔట్‌లెట్లు ప్రారంభిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement