బ్యాంకుల్లో రూ.8 లక్షల కోట్ల డిపాజిట్లు
వ్యవస్థలోకి రూ.3 లక్షల కోట్ల కొత్త నోట్లు : కేంద్రం
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు అనంతరం దేశవ్యాప్తంగా బ్యాంకుల్లో రూ.8 లక్షల కోట్ల డిపాజిట్లు నమోదయ్యాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోశ్ కుమార్ గంగ్వార్ తెలిపారు. వ్యవస్థలో రూ.500, రూ.1,000 నోట్ల రూపంలో మొత్తం రూ.14.5 కోట్లు చెలామణిలో ఉన్నట్టు చెప్పారు. ఇప్పటి వరకు రూ.3 లక్షల కోట్ల విలువ మేర కొత్త నోట్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు. దీంతో రద్దరుున నోట్లు, కొత్త నోట్ల మధ్య అంతరం ఉందన్నారు. ప్రతి రోజూ రూ.25వేల కోట్ల విలువ మేర కొత్త నోట్లను బ్యాంకుల ద్వారా వ్యవస్థలోకి తీసుకొస్తున్నామని చెప్పారు. ఈ మేరకు మంత్రి శనివారం ఇక్కడ ఓ మీడియా సంస్థతో మాట్లాడారు.
రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేయడం వల్ల ప్రజలకు అసౌకర్యం ఏర్పడిందని, దేశవ్యాప్తంగా తక్కువ విలువ కలిగిన నోట్ల కొరత నెలకొందన్నారు. ప్రజలు రూ.2,000 వేల నోటుకు చిల్లర పొందలేని పరిస్థితి ఉందని అంగీకరించారు. రూ.500 నోట్లను మరింత సంఖ్యలో విడుదల చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. కొన్ని వారాల్లో సమస్య పరిష్కారం అవుతుందని గంగ్వార్ చెప్పారు. రూ.1,000 నోటును ఏ రూపంలో విడుదల చేయాలన్నది భవిష్యత్తులో నిర్ణరుుస్తామన్నారు. నల్ల ధనం నియంత్రణ దిశగా పెద్ద నోట్ల రద్దు తొలి నిర్ణయమని... ఈ విషయంలో భవిష్యత్తులో మరిన్ని కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు. కష్టాలు నల్లధనం కలిగిన వారికే గానీ సామాన్యులు ఆందోళన చెందక్కర్లేదన్నారు.