రూపాయి 33 పైసలు డౌన్
ముంబై: వరుసగా మూడోరోజూ నష్టాల్లోనే కొనసాగిన దేశీ కరెన్సీ... మంగళవారం మరో 33 పైసలు క్షీణించింది. డాలరుతో రూపాయి మారకం విలువ 59.04 వద్ద ముగిసింది. గడిచిన రెండు నెలల్లో ఇదే అతిపెద్ద పతనం. ప్రధానంగా దేశీ స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్ల నిధుల ఉపసంహరణ, నెలాఖరులో దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ తదితర అంశాలు రూపాయి బలహీనతకు దోహదం చేశాయని ఫారెక్స్ డీలర్లు పేర్కొన్నారు.
మూడు ట్రేడింగ్ సెషన్లలో రూపాయి విలువ 57 పైసలు ఆవిరైంది. దిగుమతి బిల్లుల చెల్లింపుల కోసం డాలర్లకు డిమాండ్‌తో పాటు రూపాయి మరింత బలపడకుండా ఆర్‌బీఐ చర్యలుకూడా దేశీ కరెన్సీపై ప్రతికూల ప్రభావం చూపాయని ఇండియా ఫారెక్స్ అడ్వయిజర్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ అభిషేక్ గోయెంకా పేర్కొన్నారు. కాగా, మంగళవారం విదేశీ ఇన్వెస్టర్లు రూ.203 కోట్ల నిధులను స్టాక్ మార్కెట్ల నుంచి వెనక్కితీసుకున్నట్లు అంచనా.