rupee-dollar trade
-
రూపాయి 33 పైసలు డౌన్
ముంబై: వరుసగా మూడోరోజూ నష్టాల్లోనే కొనసాగిన దేశీ కరెన్సీ... మంగళవారం మరో 33 పైసలు క్షీణించింది. డాలరుతో రూపాయి మారకం విలువ 59.04 వద్ద ముగిసింది. గడిచిన రెండు నెలల్లో ఇదే అతిపెద్ద పతనం. ప్రధానంగా దేశీ స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్ల నిధుల ఉపసంహరణ, నెలాఖరులో దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ తదితర అంశాలు రూపాయి బలహీనతకు దోహదం చేశాయని ఫారెక్స్ డీలర్లు పేర్కొన్నారు. మూడు ట్రేడింగ్ సెషన్లలో రూపాయి విలువ 57 పైసలు ఆవిరైంది. దిగుమతి బిల్లుల చెల్లింపుల కోసం డాలర్లకు డిమాండ్‌తో పాటు రూపాయి మరింత బలపడకుండా ఆర్బీఐ చర్యలుకూడా దేశీ కరెన్సీపై ప్రతికూల ప్రభావం చూపాయని ఇండియా ఫారెక్స్ అడ్వయిజర్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ అభిషేక్ గోయెంకా పేర్కొన్నారు. కాగా, మంగళవారం విదేశీ ఇన్వెస్టర్లు రూ.203 కోట్ల నిధులను స్టాక్ మార్కెట్ల నుంచి వెనక్కితీసుకున్నట్లు అంచనా. -
రూపాయికి 'క్యాడ్' జోష్..
ముంబై: స్టాక్ మార్కెట్లు చరిత్రాత్మక గరిష్టాలను తాకడం, కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) భారీగా దిగిరావడంతో దేశీ కరెన్సీకి బలాన్నిచ్చింది. గురువారం డాలరుతో రూపాయి మారకం విలువ 64 పైసలు(1.04%) ఎగబాకి 61.11 వద్ద స్థిరపడింది. ఇది దాదాపు 3 నెలల గరిష్టస్థాయి (గతేడాది డిసెంబర్ 10న 61.04 వద్ద ముగింపు) కావడం గమనార్హం. గతేడాది నవంబర్ 18న రూపాయి 70 పైసలు ఎగబాకగా, మళ్లీ ఒకేరోజు ఇంత భారీగా పుంజుకోవడం ఇదే తొలిసారి. ఆర్బీఐ తాజా గణాంకాల ప్రకారం డిసెంబర్ క్వార్టర్లో జీడీపీతో పోలిస్తే క్యాడ్ 0.9 శాతానికి(4.2 బిలియన్ డాలర్లు) కట్టడి కావడం తెలిసిందే. ప్రధానంగా ఎగుమతుల వృద్ధి బాట, బంగారం దిగుమతులు భారీగా తగ్గడం వంటివి క్యాడ్‌కు కళ్లెంపడటంతో ప్రధాన కారకాలుగా నిలిచాయి. దీంతో ప్రస్తుత 2013-14 పూర్తి ఏడాదికి క్యాడ్ 45 బిలియన్ డాలర్లలోపే(2.5 శాతం దిగువన) ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కాగా, గురువారం దేశీ ప్రధాన స్టాక్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ రెండూ కొత్త ఆల్‌టైమ్ గరిష్టస్థాయిల్లో ముగిశాయి. సెన్సెక్స్ అయితే ఇంట్రాడేలో చరిత్రాత్మక రికార్డును నమోదు చేసింది కూడా. మార్కెట్ పరుగుతో పాటు విదేశీ నిధుల ప్రవాహం కొనసాగుతుండటం; ఎగుమతిదారులు, కొన్ని బ్యాంకులు సైతం డాలర్ల విక్రయాల బాటపట్టడం కూడా రూపాయి బలపడేందుకు దోహదం చేసిందని ఫారెక్స్ మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. గడిచిన ఎనిమిది సెషన్లలో(మార్చి 4 వరకూ) విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) దేశీ మార్కెట్లోకి ఏకంగా 80 కోట్ల డాలర్లను(దాదాపు రూ. 5,000 కోట్లు) కుమ్మరించడం విశేషం. నింగినంటిన సూచీలు... కొత్త రికార్డుల మోత పలు సానుకూల అంశాల నేపథ్యంలో దేశీ స్టాక్ సూచీలు మళ్లీ కదంతొక్కాయి. సెన్సెక్స్ 237 పాయింట్లు ఎగసి 21,514 వద్ద ముగిసింది. 72 పాయింట్లు జంప్ చేసిన నిఫ్టీ 6,401 వద్ద నిలిచింది. ఫలితంగా 2013 డిసెంబర్ 9న సెన్సెక్స్ సాధించిన ఇంట్రాడే గరిష్టం 21,484 పాయింట్లు పాతబడిపోగా, జనవరి 21న నమోదైన 21,374 పాయింట్ల రికార్డు ముగింపు మారిపోయింది. ఇక డిసెంబర్ 9న 6,364 వద్ద ముగిసిన నిఫ్టీ రికార్డు కూడా చెరిగిపోయింది. కాగా, అదే రోజు ఇంట్రాడేలో 6,415 పాయింట్లను తాకి సృష్టించిన నిఫ్టీ రికార్డు మాత్రమే మిగిలిపోయింది! ఎన్ని‘కల’ జోష్ సార్వత్రిక ఎన్నికల తరువాత ఏర్పడనున్న కొత్త ప్రభుత్వం సంస్కరణలకు ప్రాధాన్యమిస్తుందన్న అంచనాలు కొద్ది రోజులుగా విదేశీ ఇన్వెస్టర్లకు ప్రోత్సాహమిస్తున్నాయి. దీంతో వరుసగా 14 రోజుల్లో రూ. 6,000 కోట్లను ఇన్వెస్ట్ చేసిన ఎఫ్ఐఐలు గురువారం ఒక్క రోజులోనే రూ. 1,273 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. అయితే దేశీయ ఫండ్స్ యథావిధిగా రూ. 567 కోట్ల విలువైన అమ్మకాలను నిర్వహించాయి. ఇతర విశేషాలివీ.... గురువారం ట్రేడింగ్‌లో రియల్టీ ఇండెక్స్ 4% జంప్‌చేయగా, పవర్, ఆయిల్, మెటల్, క్యాపిటల్ గూడ్స్, బ్యాంకింగ్ 2% స్థాయిలో పుంజుకున్నాయి. సెన్సెక్స్ దిగ్గజాలు హిందాల్కో, భెల్, ఐసీఐసీఐ, ఓఎన్జీసీ, టాటా స్టీల్, ఎన్టీపీసీ, గెయిల్, సెసాస్టెరిలైట్, కోల్ ఇండియా, హీరో మోటో, బజాజ్ ఆటో, ఆర్ఐఎల్, మారుతీ, ఎల్అండ్టీ, యాక్సిస్ 4-2% మధ్య లాభపడ్డాయి. రియల్టీలో ప్రెస్టేజ్ ఎస్టేట్స్ 12% దూసుకెళ్లగా, హెచ్‌డీఐఎల్, ఇండియాబుల్స్, డీఎల్ఎఫ్, యూనిటెక్, డీబీ, మహీంద్రా లైఫ్‌స్పేస్, గోద్రెజ్ ప్రాపర్టీస్ 7-3 శాతం మధ్య ఎగబాకాయి. స్వీడిష్ మాతృ సంస్థ డీలిస్టింగ్ యోచనను వాయిదా వేయడంతో ఆస్ట్రాజెనెకా 9%పైగా పతనంకాగా, మెరిల్లించ్ 2.35 లక్షలను కొన్న నేపథ్యంలో ఫైనాన్షియల్ టెక్నాలజీస్ 5% పెరిగింది. గత 6 రోజుల్లో ఆస్ట్రాజెనెకా 50% ఎగసింది. మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు సైతం 1%పైగా బలపడ్డాయి. మిడ్ క్యాప్స్‌లో రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రా, ఎస్ఆర్ఎఫ్ 20% దూసుకెళ్లగా, జైకార్ప్, రిలయన్స్ ఇన్ఫ్రా, జేపీ అసోసియేట్స్, ఎస్కేఎస్, జేకే సిమెంట్, ఓరియంట్ సిమెంట్, వీగార్డ్, జేబీ కెమ్, స్పైస్‌జెట్, ఈరోస్, బాంబే డయింగ్, ఐఎల్ఎఫ్ఎస్ ట్రాన్స్పోర్ట్, కేఎస్కే ఎనర్జీ 12-6% మధ్య పురోగమించాయి. లాభాల ‘మూడ్’.. మూడు నెలల్లో ఏర్పడనున్న కొత్త ప్రభుత్వంపై ఆశలు ఇన్వెస్టర్లలో జోష్‌ను నింపుతున్నాయి. మూడో క్వార్టర్ (అక్టోబర్-డిసెంబర్)లో కరెంట్ ఖాతా లోటు(క్యాడ్) భారీగా క్షీణించి 4.2 బిలియన్ డాలర్లకు పరిమితంకావడం సెంటిమెంట్‌కు ఊపునిచ్చింది. డాలరుతో రూపాయి విలువ 3 నెలల గరిష్టమైన 61.11 కు చేరడం ఇందుకు సహకరించింది. వరుసగా 3వ రోజూ మార్కెట్లు పుంజుకున్నాయి. 3 రోజుల్లో సెన్సెక్స్ 567 పాయింట్లు ఎగసింది. 3 నెలల తరువాత దేశీ స్టాక్ సూచీలు కొత్త గరిష్ట స్థాయిలను అందుకున్నాయి. గత ఆరు పర్యాయాల్లో ఎన్నికల ముందు నెలలో మార్కెట్లు ర్యాలీ చేయడం ఇది మూడోసారి! -
కాస్త కోలుకున్న రూపాయి..
ముంబై: దేశీ కరెన్సీ ఐదు రోజుల వరుస పతనానికి ఎట్టకేలకు అడ్డుకట్టపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ బుధవారం 41 పైసలు కోలుకొని 63.30 వద్ద స్థిరపడింది. ఎగుమతిదారులు, బ్యాంకులు తాజాగా డాలర్ల అమ్మకాలకు దిగడంతో రూపాయికి కాస్త వెన్నుదన్నుగా నిలిచిందని ఫారెక్స్ మార్కెట్ వర్గాలు చెప్పాయి. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కరెంట్ అకౌంట్ లోటు గత అంచనాల కంటే చాలా తక్కువగా 56 బిలియన్ డాలర్లకు(జీడీపీలో 3 శాతం లోపే) పరిమితం కావచ్చని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ చేసిన ప్రకటన కూడా దేశీ కరెన్సీపై సానుకూల ప్రభావం చూపింది. కాగా, గడచిన ఐదు రోజుల్లో 209 పైసలు(3.39%) పతనమై రెండు నెలల కనిష్టానికి పడిపోయిన సంగతి తెలిసిందే. -
54 పైసలు తగ్గిన రూపాయి
ముంబై: అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్వహిస్తున్న రెండు రోజుల సమావేశాలు మొదలైన నేపథ్యంలో డాలరుతో మారకంలో రూపాయి విలువ మళ్లీ తిరోగమించింది. గత రెండు వారాల్లోలేని విధంగా 54 పైసలు క్షీణించి 63.37కు చేరింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో మంగళవారం 63.37 వద్ద ప్రారంభమైంది. గరిష్టంగా 62.95, కనిష్టంగా 63.64 మధ్య ఊగిసలాడింది. చివరికి క్రితం ముగింపు 62.83తో పోలిస్తే 54 పైసలు(0.86%) బలహీనపడి 63.37 వద్ద ముగిసింది. ఈ నెల 3 తరువాత ఇదే అత్యధిక క్షీణత కాగా, గత రెండు రోజుల్లో 67 పైసలు పుంజుకున్న విషయం విదితమే. -
మళ్లీ కళ తప్పిన రూపాయి
ముంబై: రెండు రోజుల రూపాయి ర్యాలీకి బ్రేక్ పడింది. డాలరుతో మారకంలో సోమవారం 30 పైసలు(0.46%) బలహీనపడి 66 వద్ద ముగిసింది. గత రెండు రోజుల్లో 310 పైసలు(4.5%) బలపడటం ద్వారా 68.80 నుంచి 65.70కు చేరిన సంగతి తెలిసిందే. కాగా, దిగుమతిదారుల నుంచి పెరిగిన డిమాండ్ నేపథ్యంలో ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ 66.15 వద్ద బలహీనంగా మొదలైంది. ఒక దశలో 65.68కు బలపడినప్పటికీ, 66.30 వద్ద కనిష్ట స్థాయిని సైతం తాకింది. చివరికి 30 పైసలు క్షీణించి 66 వద్ద స్థిరపడింది. -
రూపాయి 85 పైసలు అప్
ముంబై: కరెన్సీ పతనానికి అడ్డుకట్ట వేస్తూ, వృద్ధికి ఊతమిచ్చేలా చర్యలు తీసుకుంటామంటూ ప్రధాని మన్మోహన్ సింగ్ భరోసా కల్పించడం.. రూపాయి కోలుకోవడానికి మరింత ఊతమిచ్చింది. డాలర్‌తో పోలిస్తే శుక్రవారం రూపాయి మారకం విలువ మరో 85 పైసలు పెరిగి 65.70 వద్ద ముగిసింది. అటు ఎగుమతిదారులు, కొన్ని బ్యాంకులు డాలర్లను విక్రయించడం కూడా దేశీ కరెన్సీ బలోపేతం కావడానికి తోడ్పడింది. రూపాయి ఒక్కసారిగా పతనం కావడం షాక్‌లాంటిదేనని, పెట్టుబడులపై ఆంక్షలు విధించడం కాకుండా ఇతరత్రా చర్యలతో కరెన్సీ మళ్లీ కోలుకునేలా చే స్తామని ప్రధాని చెప్పారు. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో శుక్రవారం రూపాయి ట్రేడింగ్ క్రితం ముగింపు 66.55తో పోలిస్తే కాస్త బలహీనంగా 67 వద్ద ప్రారంభమైంది. ఒక దశలో 67.43కి కూడా పడిపోయింది. అయితే, ఆ తర్వాత 1.28 శాతం కోలుకుని ఇంట్రాడేలో గరిష్టమైన 65.70 స్థాయి వద్ద ముగిసింది. రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) జోక్యం చేసుకోవడం, ప్రధాని మన్మోహన్సింగ్ ప్రసంగాలే రూపాయికి ఊతంగా నిలిచాయని ఇండియా ఫారెక్స్ అడ్వైజర్స్ సీఈవో అభిషేక్ గోయెంకా తెలిపారు. స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ముగుస్తుండటమూ ఇందుకు దోహదపడ్డాయని వివరించారు. రూపాయి ట్రేడింగ్ శ్రేణి 65-66.50 మధ్య ఉండగలదని అల్పరీ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఇండియా) సీఈవో ప్రమీత్ బ్రహ్మభట్ తెలిపారు. -
ఆర్బీఐ ‘డాలర్’ టానిక్...రూపీ నవ్వింది!
న్యూఢిల్లీ: అంపశయ్యపై అల్లాడుతున్న రూపాయికి రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) ఎట్టకేలకు కొంత జవసత్వాలు అందించింది. మూడు రోజుల క్రాష్‌కు అడ్డుకట్టపడింది. గురువారం ఒక్కరోజే డాలరుతో రూపాయి మారకం విలువ 225 పైసలు పుంజుకుంది. 66.55 వద్ద స్థిరపడింది. ప్రభుత్వరంగ చమురు రిఫైనర్ల నెలవారీ చెల్లింపుకోసం కొనుగోలు చేసే డాలర్లకోసం ఆర్బీఐ ప్రత్యేకంగా ఒక విండో(సదుపాయం) ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. నెలకు సగటున ప్రభుత్వరంగ చమురు కంపెనీలు(ఐఓసీ, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్) 7.5 మిలియన్ టన్నుల క్రూడ్‌ను దిగుమతి చేసుకుంటున్నాయి. ఇందుకు 8.5 బిలియన్ డాలర్లను నెలకు చెల్లించాల్సి వస్తోంది. ఇంతభారీగా డాలర్ల కొనుగోలుతో ఆ కరెన్సీకి డిమాండ్ పెరిగి.. రూపాయి విలువ ఆవిరయ్యేలా చేస్తోంది. ఇప్పుడు నేరుగా ఆర్బీఐ ప్రత్యేక విండోద్వారా ఈ కంపెనీలకు అవసరమైన డాలర్లను అందించడం వల్ల స్పెక్యులేషన్‌కు కొంత అడ్డుకట్టపడే అవకాశం ఉంది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి ట్రేడింగ్ భారీ లాభాల్లో 66.90 వద్ద ప్రారంభమైంది. ఆతర్వాత మళ్లీ దిగుమతిదారుల నుంచి డాలర్ డిమాండ్ కారణంగా 67.92కు క్షీణించింది. అయితే, చివర్లో మళ్లీ భారీగా పుంజుకొని 3.27 శాతం లాభంతో 66.55 వద్ద స్థిరపడింది. దీనికి ఆర్బీఐ చర్యలు ఊతమిచ్చాయని ఫారెక్స్ డీలర్లు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా డాలరు బలపడటం, స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడుల తిరోగమనం కొనసాగినప్పటికీ రూపాయి లాభాలతో ముగియడం గమనార్హం. రూపాయి మరింత బలపడొచ్చన్న అంచనాలతో ఎగుమతిదారులు డాలర్లను విక్రయించడం కూడా దేశీ కరెన్సీకి బూస్ట్ ఇచ్చినట్లు మార్కెట్ వర్గాలు విశ్లేషించాయి. బుధవారం రూపాయి చరిత్రలోనే అత్యంత ఘోరంగా 256 పైసలు కుప్పకూలి కొత్త ఆల్‌టైమ్ కనిష్టానికి(68.80) పడిపోయిన సంగతి తెలిసిందే. ఈ జనవరి నుంచి ఇప్పటిదాకా రూపాయి విలువ 25 శాతం ఆవిరైంది. రూపాయిపై ఒత్తిడి తగ్గొచ్చు... స్పాట్ మార్కెట్లో డాలర్లకు అధిక డిమాండ్ ఉండే చమురు కంపెనీలకు ప్రత్యేక విండో ఏర్పాటు ద్వారా ఆర్బీఐ రూపాయిపై ఒత్తిడిని తగ్గించిందని ఇండియా ఫారెక్స్ అడ్వయిజర్స్ సీఈఓ అభిషేక్ గోయెంకా పేర్కొన్నారు. 2008లోనూ ఆర్బీఐ ఇలాంటి చర్యలు చేపట్టిందని, అయితే ఇది ఎంతకాలం కొనసాగుతుందనేది గమనించాల్సిన అంశమని చెప్పారు. 75ను తాకొచ్చు: బ్యాంక్ ఆఫ్ అమెరికా విదేశీ మారక(ఫారెక్స్) నిల్వలను పెంచేదిశగా ఆర్బీఐ మరిన్ని నిర్మాణాత్మక చర్యలను చేపట్టకపోతే రూపాయి ఇంకా అగాధంలోకి జారిపోవచ్చని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్లించ్ (బీఓఎఫ్ఏ-ఎంల్) పేర్కొంది. ప్రస్తుత అలసత్వధోరణి ఇలాగే కొనసాగితే ఈ ఏడాది చివరికల్లా రూపాయి విలువ 75కు పడిపోవచ్చని గురువారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. విదేశీ పెట్టుబడులు దేశంలోకి వెల్లువెత్తేవిధంగా ఆర్బీఐ.. ప్రవాసీ(ఎన్ఆర్ఐ)/సావరీన్ బాం డ్ల జారీ ఇతరత్రా చర్యల చేపట్టాలని సూచించింది. -
రూపాయి.. చావుకేక!
దేశీ కరెన్సీ చావుకేక పెట్టింది. గత కొద్దిరోజులుగా పాతాళానికి దారులుతీసున్న రూపాయి.. చరిత్రలో ఎన్నడూఎరుగని రీతిలో కుప్పకూలింది. ఒక్కరోజే ఏకంగా 200 పైసలు పడిపోయి 66 దిగువకు జారిపోయింది. సరికొత్త ఆల్‌టైమ్ కనిష్టాలను నమోదుచేసి ప్రభుత్వం, ఆర్బీఐలకు ముచ్చెమటలు పోయిస్తోంది. ముంబై: లోక్‌సభ ఆమోదం పొందిన ఆహార భద్రత బిల్లు రూపాయికి మరిన్ని తూట్లు పొడిచింది. ఈ చట్టం అమలుతో ప్రభుత్వంపై సబ్సిడీ భారం భారీగా పెరిగిపోయి.. ద్రవ్యలోటు దూసుకెళ్తుందనే భయాలు దేశీ కరెన్సీని వణికించాయి. దీంతో మంగళవారం ఒకేరోజు 200 పైసలు పడిపోయి కనీవినీఎరుగని పతనాన్ని రూపాయి చవిచూసింది. క్రితం ముగింపు 64.30తో పోలిస్తే ఒకానొక దశలో 66.30ని కూడా తాకింది. చివరకు 194 పైసలు(3.02 శాతం) క్షీణించి 66.24 వద్ద ముగిసింది. ద్రవ్యలోటు కట్టడికి ప్రభుత్వం అన్నిచర్యలూ తీసుకుంటుందని ఆర్థిక మంత్రి పీ చిదంబరం ఇచ్చిన హామీకూడా ఎలాంటి సానుకూల ప్రభావం చూపలేదు. మరోపక్క, ఆహార భద్రత బిల్లు భయాలతో అటు స్టాక్ మార్కెట్ కూడా 600 పాయింట్ల మేర కుప్పకూలడం రూపాయిని ఛిన్నాభిన్నం చేసింది. విదేశీ పెట్టుబడుల తిరోగమనం, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు ఎగబాకడం కూడా దేశీ కరెన్సీని దిగజార్చాయి. బ్యాంకులు, దిగుమతిదారుల నుంచి డాలర్లకు యథేచ్ఛగా డిమాండ్ పెరిగిపోవడంతో రూపాయి విలువ హారతికర్పూరంలా ఆవిరైందని ఫారెక్స్ డీలర్లు వ్యాఖ్యానించారు.ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి ట్రేడింగ్ 65 వద్ద బలహీనంగా ఆరంభమైంది. ఆతర్వాత పూర్తిగా నష్టాల్లోనే కొనసాగుతూ 66 స్థాయి దిగువకు పడిపోయింది. మంగళవారంనాటి ఇంట్రాడే, ముగింపులు రెండూ కొత్త ఆల్‌టైమ్ కనిష్టాలే కావడం గమనార్హం. సోమవారం కూడా దేశీ కరెన్సీ విలువ 110 పైసలు క్షీణించడం తెలిసిందే. కాగా, ఈ నెల 19న రూపాయి 148 పైసలు పడిపోయి దశాబ్దంలోనే అత్యంత ఘోరమైన పతనాన్ని నమోదు చేసింది. ఇప్పుడు చరిత్రలోనే కనీవినీఎరుగని రీతిలో ఒకేరోజు కుప్పకూలింది. 22న నమోదైన 65.56 స్థాయి ఇంట్రేడేలో ఇప్పటిదాకా ఆల్‌టైమ్ కనిష్టంగా ఉంది. చమురు దెబ్బ... బ్రెంట్ క్రూడ్ ధర అంతర్జాతీయంగా 113 డాలర్లకు ఎగబాకడంతో దిగుమతుల భారం పెరిగేందుకు దారితీస్తుందన్న ఆందోళనలు రూపాయికి మంటపెట్టాయని కోటక్ మహీంద్రా బ్యాంక్ ట్రెజరర్ మోహన్ షెనాయ్ వ్యాఖ్యానించారు. సిరియాలో నెలకొన్న యుద్ధ వాతావరణంతో చమురుధరలకు రెక్కలొస్తున్నాయి. మరోపక్క, ఆహార భద్రత బిల్లుతో ద్రవ్యలోటు ఎగబాకనుండటం కూడా ఆర్థిక వ్యవస్థకు గుదిబండే. ఈ ఏడాది ద్రవ్యలోటు కట్టడి లక్ష్యాన్ని(4.8%) భారత్ రేటింగ్‌ను కట్ చేస్తామంటూ గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ ఇప్పటికే హెచ్చరించిన విషయం తెలిసిందే. మరోపక్క, అమెరికా ఆర్థిక వ్యవస్థ మెరుగైన రికవరీతో అక్కడి ఫెడరల్ రిజర్వ్ సహాయ ప్యాకేజీలను ఉపసంహరించొచ్చన్న భయాలు కూడా రూపాయిని కొద్దిరోజులుగా వెంటాడుతున్నాయి. ముఖ్యంగా విదేశీ ఇన్వెస్టర్లు భారత్ నుంచి తమ నిధులను వెనక్కి తరలించుకుపోతారన్న ఆందోళనలు తీవ్రతరమవుతున్నాయి. ఇప్పటికే ఎఫ్ఐఐల అమ్మకాలు అటు డెట్, ఇటు స్టాక్ మార్కెట్లో జోరందు కుంటున్నాయి.67ను తాకొచ్చు...: చమురు దిగుమతిదారుల నుంచి భారీ డిమాండ్‌తో రూపాయి బలహీన ధోరణినే కొనసాగించొచ్చని అల్పరి ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈఓ ప్రమిత్ బ్రహ్మభట్ పేర్కొన్నారు. 65-67 స్థాయిలో ట్రేడ్ అయ్యే అవకాశాలున్నాయని చెప్పారు. ఇదిలాఉండగా.. బ్రిటిష్ పౌండ్తో రూపాయి విలువ కూడా కొత్త ఆల్‌టైమ్ కనిష్టానికి జారింది. క్రితం ముగింపు 100.12తో పోలిస్తే 268 పైసలు కుప్పకూలి 102.80 వద్ద స్థిరపడింది.