ఆర్‌బీఐ ‘డాలర్’ టానిక్...రూపీ నవ్వింది!
ఆర్‌బీఐ ‘డాలర్’ టానిక్...రూపీ నవ్వింది!
Published Fri, Aug 30 2013 1:28 AM | Last Updated on Fri, Sep 1 2017 10:14 PM
న్యూఢిల్లీ: అంపశయ్యపై అల్లాడుతున్న రూపాయికి రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) ఎట్టకేలకు కొంత జవసత్వాలు అందించింది. మూడు రోజుల క్రాష్‌కు అడ్డుకట్టపడింది. గురువారం ఒక్కరోజే డాలరుతో రూపాయి మారకం విలువ 225 పైసలు పుంజుకుంది. 66.55 వద్ద స్థిరపడింది. ప్రభుత్వరంగ చమురు రిఫైనర్ల నెలవారీ చెల్లింపుకోసం కొనుగోలు చేసే డాలర్లకోసం ఆర్‌బీఐ ప్రత్యేకంగా ఒక విండో(సదుపాయం) ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. నెలకు సగటున ప్రభుత్వరంగ చమురు కంపెనీలు(ఐఓసీ, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్) 7.5 మిలియన్ టన్నుల క్రూడ్‌ను దిగుమతి చేసుకుంటున్నాయి. ఇందుకు 8.5 బిలియన్ డాలర్లను నెలకు చెల్లించాల్సి వస్తోంది. ఇంతభారీగా డాలర్ల కొనుగోలుతో ఆ కరెన్సీకి డిమాండ్ పెరిగి.. రూపాయి విలువ ఆవిరయ్యేలా చేస్తోంది. ఇప్పుడు నేరుగా ఆర్‌బీఐ ప్రత్యేక విండోద్వారా ఈ కంపెనీలకు అవసరమైన డాలర్లను అందించడం వల్ల స్పెక్యులేషన్‌కు కొంత అడ్డుకట్టపడే అవకాశం ఉంది.
ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి ట్రేడింగ్ భారీ లాభాల్లో 66.90 వద్ద ప్రారంభమైంది. ఆతర్వాత మళ్లీ దిగుమతిదారుల నుంచి డాలర్ డిమాండ్ కారణంగా 67.92కు క్షీణించింది. అయితే, చివర్లో మళ్లీ భారీగా పుంజుకొని 3.27 శాతం లాభంతో 66.55 వద్ద స్థిరపడింది. దీనికి ఆర్‌బీఐ చర్యలు ఊతమిచ్చాయని ఫారెక్స్ డీలర్లు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా డాలరు బలపడటం, స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడుల తిరోగమనం కొనసాగినప్పటికీ రూపాయి లాభాలతో ముగియడం గమనార్హం. రూపాయి మరింత బలపడొచ్చన్న అంచనాలతో ఎగుమతిదారులు డాలర్లను విక్రయించడం కూడా దేశీ కరెన్సీకి బూస్ట్ ఇచ్చినట్లు మార్కెట్ వర్గాలు విశ్లేషించాయి. బుధవారం రూపాయి చరిత్రలోనే అత్యంత ఘోరంగా 256 పైసలు కుప్పకూలి కొత్త ఆల్‌టైమ్ కనిష్టానికి(68.80) పడిపోయిన సంగతి తెలిసిందే. ఈ జనవరి నుంచి ఇప్పటిదాకా రూపాయి విలువ 25 శాతం ఆవిరైంది.
రూపాయిపై ఒత్తిడి తగ్గొచ్చు...
స్పాట్ మార్కెట్లో డాలర్లకు అధిక డిమాండ్ ఉండే చమురు కంపెనీలకు ప్రత్యేక విండో ఏర్పాటు ద్వారా ఆర్‌బీఐ రూపాయిపై ఒత్తిడిని తగ్గించిందని ఇండియా ఫారెక్స్ అడ్వయిజర్స్ సీఈఓ అభిషేక్ గోయెంకా పేర్కొన్నారు. 2008లోనూ ఆర్‌బీఐ ఇలాంటి చర్యలు చేపట్టిందని, అయితే ఇది ఎంతకాలం కొనసాగుతుందనేది గమనించాల్సిన అంశమని చెప్పారు.
75ను తాకొచ్చు: బ్యాంక్ ఆఫ్ అమెరికా
విదేశీ మారక(ఫారెక్స్) నిల్వలను పెంచేదిశగా ఆర్‌బీఐ మరిన్ని నిర్మాణాత్మక చర్యలను చేపట్టకపోతే రూపాయి ఇంకా అగాధంలోకి జారిపోవచ్చని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్‌లించ్ (బీఓఎఫ్‌ఏ-ఎంల్) పేర్కొంది. ప్రస్తుత అలసత్వధోరణి ఇలాగే కొనసాగితే ఈ ఏడాది చివరికల్లా రూపాయి విలువ 75కు పడిపోవచ్చని గురువారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. విదేశీ పెట్టుబడులు దేశంలోకి వెల్లువెత్తేవిధంగా ఆర్‌బీఐ.. ప్రవాసీ(ఎన్‌ఆర్‌ఐ)/సావరీన్ బాం డ్‌ల జారీ ఇతరత్రా చర్యల చేపట్టాలని సూచించింది.
Advertisement
Advertisement