రూపాయి.. చావుకేక!
రూపాయి.. చావుకేక!
Published Wed, Aug 28 2013 1:10 AM | Last Updated on Fri, Sep 1 2017 10:10 PM
దేశీ కరెన్సీ చావుకేక పెట్టింది. గత కొద్దిరోజులుగా పాతాళానికి దారులుతీసున్న రూపాయి.. చరిత్రలో ఎన్నడూఎరుగని రీతిలో కుప్పకూలింది. ఒక్కరోజే ఏకంగా 200 పైసలు పడిపోయి 66 దిగువకు జారిపోయింది. సరికొత్త ఆల్‌టైమ్ కనిష్టాలను నమోదుచేసి ప్రభుత్వం, ఆర్‌బీఐలకు ముచ్చెమటలు పోయిస్తోంది.
ముంబై: లోక్‌సభ ఆమోదం పొందిన ఆహార భద్రత బిల్లు రూపాయికి మరిన్ని తూట్లు పొడిచింది. ఈ చట్టం అమలుతో ప్రభుత్వంపై సబ్సిడీ భారం భారీగా పెరిగిపోయి.. ద్రవ్యలోటు దూసుకెళ్తుందనే భయాలు దేశీ కరెన్సీని వణికించాయి. దీంతో మంగళవారం ఒకేరోజు 200 పైసలు పడిపోయి కనీవినీఎరుగని పతనాన్ని రూపాయి చవిచూసింది. క్రితం ముగింపు 64.30తో పోలిస్తే ఒకానొక దశలో 66.30ని కూడా తాకింది. చివరకు 194 పైసలు(3.02 శాతం) క్షీణించి 66.24 వద్ద ముగిసింది. ద్రవ్యలోటు కట్టడికి ప్రభుత్వం అన్నిచర్యలూ తీసుకుంటుందని ఆర్థిక మంత్రి పీ చిదంబరం ఇచ్చిన హామీకూడా ఎలాంటి సానుకూల ప్రభావం చూపలేదు.
మరోపక్క, ఆహార భద్రత బిల్లు భయాలతో అటు స్టాక్ మార్కెట్ కూడా 600 పాయింట్ల మేర కుప్పకూలడం రూపాయిని ఛిన్నాభిన్నం చేసింది. విదేశీ పెట్టుబడుల తిరోగమనం, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు ఎగబాకడం కూడా దేశీ కరెన్సీని దిగజార్చాయి. బ్యాంకులు, దిగుమతిదారుల నుంచి డాలర్లకు యథేచ్ఛగా డిమాండ్ పెరిగిపోవడంతో రూపాయి విలువ హారతికర్పూరంలా ఆవిరైందని ఫారెక్స్ డీలర్లు వ్యాఖ్యానించారు.ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి ట్రేడింగ్ 65 వద్ద బలహీనంగా ఆరంభమైంది.
ఆతర్వాత పూర్తిగా నష్టాల్లోనే కొనసాగుతూ 66 స్థాయి దిగువకు పడిపోయింది. మంగళవారంనాటి ఇంట్రాడే, ముగింపులు రెండూ కొత్త ఆల్‌టైమ్ కనిష్టాలే కావడం గమనార్హం. సోమవారం కూడా దేశీ కరెన్సీ విలువ 110 పైసలు క్షీణించడం తెలిసిందే. కాగా, ఈ నెల 19న రూపాయి 148 పైసలు పడిపోయి దశాబ్దంలోనే అత్యంత ఘోరమైన పతనాన్ని నమోదు చేసింది. ఇప్పుడు చరిత్రలోనే కనీవినీఎరుగని రీతిలో ఒకేరోజు కుప్పకూలింది. 22న నమోదైన 65.56 స్థాయి ఇంట్రేడేలో ఇప్పటిదాకా ఆల్‌టైమ్ కనిష్టంగా ఉంది.
చమురు దెబ్బ...
బ్రెంట్ క్రూడ్ ధర అంతర్జాతీయంగా 113 డాలర్లకు ఎగబాకడంతో దిగుమతుల భారం పెరిగేందుకు దారితీస్తుందన్న ఆందోళనలు రూపాయికి మంటపెట్టాయని కోటక్ మహీంద్రా బ్యాంక్ ట్రెజరర్ మోహన్ షెనాయ్ వ్యాఖ్యానించారు. సిరియాలో నెలకొన్న యుద్ధ వాతావరణంతో చమురుధరలకు రెక్కలొస్తున్నాయి. మరోపక్క, ఆహార భద్రత బిల్లుతో ద్రవ్యలోటు ఎగబాకనుండటం కూడా ఆర్థిక వ్యవస్థకు గుదిబండే. ఈ ఏడాది ద్రవ్యలోటు కట్టడి లక్ష్యాన్ని(4.8%) భారత్ రేటింగ్‌ను కట్ చేస్తామంటూ గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ ఇప్పటికే హెచ్చరించిన విషయం తెలిసిందే.
మరోపక్క, అమెరికా ఆర్థిక వ్యవస్థ మెరుగైన రికవరీతో అక్కడి ఫెడరల్ రిజర్వ్ సహాయ ప్యాకేజీలను ఉపసంహరించొచ్చన్న భయాలు కూడా రూపాయిని కొద్దిరోజులుగా వెంటాడుతున్నాయి. ముఖ్యంగా విదేశీ ఇన్వెస్టర్లు భారత్ నుంచి తమ నిధులను వెనక్కి తరలించుకుపోతారన్న ఆందోళనలు తీవ్రతరమవుతున్నాయి. ఇప్పటికే ఎఫ్‌ఐఐల అమ్మకాలు అటు డెట్, ఇటు స్టాక్ మార్కెట్లో జోరందు కుంటున్నాయి.67ను తాకొచ్చు...: చమురు దిగుమతిదారుల నుంచి భారీ డిమాండ్‌తో రూపాయి బలహీన ధోరణినే కొనసాగించొచ్చని అల్పరి ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈఓ ప్రమిత్ బ్రహ్మభట్ పేర్కొన్నారు. 65-67 స్థాయిలో ట్రేడ్ అయ్యే అవకాశాలున్నాయని చెప్పారు. ఇదిలాఉండగా.. బ్రిటిష్ పౌండ్‌తో రూపాయి విలువ కూడా కొత్త ఆల్‌టైమ్ కనిష్టానికి జారింది. క్రితం ముగింపు 100.12తో పోలిస్తే 268 పైసలు కుప్పకూలి 102.80 వద్ద స్థిరపడింది.
Advertisement
Advertisement