రూపాయి 85 పైసలు అప్
ముంబై: కరెన్సీ పతనానికి అడ్డుకట్ట వేస్తూ, వృద్ధికి ఊతమిచ్చేలా చర్యలు తీసుకుంటామంటూ ప్రధాని మన్మోహన్ సింగ్ భరోసా కల్పించడం.. రూపాయి కోలుకోవడానికి మరింత ఊతమిచ్చింది. డాలర్‌తో పోలిస్తే శుక్రవారం రూపాయి మారకం విలువ మరో 85 పైసలు పెరిగి 65.70 వద్ద ముగిసింది. అటు ఎగుమతిదారులు, కొన్ని బ్యాంకులు డాలర్లను విక్రయించడం కూడా దేశీ కరెన్సీ బలోపేతం కావడానికి తోడ్పడింది. రూపాయి ఒక్కసారిగా పతనం కావడం షాక్‌లాంటిదేనని, పెట్టుబడులపై ఆంక్షలు విధించడం కాకుండా ఇతరత్రా చర్యలతో కరెన్సీ మళ్లీ కోలుకునేలా చే స్తామని ప్రధాని చెప్పారు.
ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో శుక్రవారం రూపాయి ట్రేడింగ్ క్రితం ముగింపు 66.55తో పోలిస్తే కాస్త బలహీనంగా 67 వద్ద ప్రారంభమైంది. ఒక దశలో 67.43కి కూడా పడిపోయింది. అయితే, ఆ తర్వాత 1.28 శాతం కోలుకుని ఇంట్రాడేలో గరిష్టమైన 65.70 స్థాయి వద్ద ముగిసింది. రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) జోక్యం చేసుకోవడం, ప్రధాని మన్మోహన్‌సింగ్ ప్రసంగాలే రూపాయికి ఊతంగా నిలిచాయని ఇండియా ఫారెక్స్ అడ్వైజర్స్ సీఈవో అభిషేక్ గోయెంకా తెలిపారు. స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ముగుస్తుండటమూ ఇందుకు దోహదపడ్డాయని వివరించారు. రూపాయి ట్రేడింగ్ శ్రేణి 65-66.50 మధ్య ఉండగలదని అల్పరీ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఇండియా) సీఈవో ప్రమీత్ బ్రహ్మభట్ తెలిపారు.