యాంబీ వ్యాలీ వేలం నిలిపివేతకు సుప్రీం నో!
సెప్టెంబర్ 7లోపు రూ.1,500 కోట్లు జమచేస్తే, తదుపరి తగిన ఉత్తర్వులిస్తామని స్పష్టీకరణ
న్యూఢిల్లీ: మహారాష్ట్ర పుణేలోని రూ.34,000 కోట్ల యాంబీ వ్యాలీ వేలాన్ని నిలిపివేయాలని సహారా చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు గురువారం తిరస్కరించింది. వేలం ప్రక్రియను నిలిపివేస్తే, రూ.1,500 కోట్లు తక్షణం చెల్లిస్తామని సుబ్రతో రాయ్ చేసిన ప్రతిపాదనను జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ ప్రస్తావిస్తూ, ‘నమ్మశక్యం కాని అంశాన్ని నమ్మడమే’ అని వ్యాఖ్యానించింది. వేలం ప్రక్రియ నిర్ణేత షెడ్యూల్ ప్రకారం కొనసాగుతుందని, అయితే సెప్టెంబర్ 7వ తేదీ లోపు సెబీ–సహారా రిఫండ్ అకౌంట్‌లో రూ.1,500 కోట్లు జమచేస్తే మాత్రం బెంచ్ తగిన ఆదేశాలు ఇస్తుందని బెంచ్ స్పష్టం చేసింది.
న్యూయార్క్ హోటల్స్ విక్రయం
సహారా అడ్వకేట్ కపిల్ సిబల్ కోర్టుకు తన వాదనలు వినిపిస్తూ, న్యూయార్క్‌లోని హోటల్స్‌ను అమ్మడం జరిగిందనీ, త్వరలో ఈ నిధులు సహారా అకౌంట్‌కు వస్తాయని, వెను వెంటనే సెప్టెంబర్ 7లోపు సెబీ–సహారా అకౌంట్‌కు రూ.1,500 కోట్లు జమచేస్తామని తెలిపారు. సహారా వడ్డీతో కలిపి దాదాపు రూ.35,000 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని మార్కెట్ రెగ్యులేటర్– సెబీ సుప్రీంకోర్టుకు చెబుతోంది.