9 శాతం పెరిగిన సెయిల్ నికర లాభం
* ఉత్పత్తి సామర్థ్యం పెరిగింది
* 17.5 శాతం డివిడెండ్
* సెయిల్ చైర్మన్ సి. ఎస్. వర్మ
న్యూఢిల్లీ: దేశీయ ఉక్కు దిగ్గజం, స్టీల్ అధారిటీ ఆప్ ఇండియా (సెయిల్) ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్‌లో రూ.579 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3 నికర లాభం(రూ.533 కోట్లు)తో పోల్చితే 9 శాతం వృద్ధి సాధించామని సెయిల్ చైర్మన్ సి.ఎస్, వర్మ చెప్పారు. ఉత్పత్తి సామర్థ్యం పెరగడం, దిగుమతి చేసుకునే కోకింగ్ కోల్ ధరలు క్షీణించడం, దీంతో పాటు ముడి పదార్ధాల ధరలు కూడా తగ్గడం వల్ల నికర లాభం వృద్ధి చెందిందని వివరించారు.
అయితే టర్నోవర్ మాత్రం 3 శాతం తగ్గి రూ.12,291కు క్షీణించిందని పేర్కొన్నారు.పస్తుత ఆర్థిక సంవత్సరానికి 17.5 శాతం మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వాలని డెరైక్టర్ల బోర్డ్ నిర్ణయించిందని పేర్కొన్నారు. ఈ భారం డివిడెండ్ ట్యాక్స్‌తో కలిపి రూ.870 కోట్ల వరకూ ఉంటుందని తెలిపారు. కేంద్ర విధానాల వల్ల రానున్న కాలంలో ఉక్కుకు డిమాండ్ పెరగగలదని చెప్పారు. రూ.72,000 కోట్ల పెట్టుబడులతో ఉత్పత్తి సామర్థ్యం పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. ఆర్థిక ఫలితాల నేపధ్యంలో సెయిల్ షేరు బీఎస్‌ఈలో 2.45 శాతం పెరుగుదలతో రూ.75.25 వద్ద ముగిసింది.