న్యూఢిల్లీ: ద్విచక్ర, త్రిచక్ర వాహన రంగ దిగ్గజం టీవీఎస్ మోటార్ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 41 శాతం జంప్‌చేసి రూ. 588 కోట్లను అధిగమించింది. రికార్డ్ అమ్మకాలు ఇందుకు సహకరించాయి.
గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 416 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 9,933 కోట్ల నుంచి రూ. 11,302 కోట్లకు ఎగసింది. మొత్తం వ్యయాలు రూ. 9,297 కోట్ల నుంచి రూ. 10,428 కోట్లకు పెరిగాయి. ఈ కాలంలో ఎగుమతులతోపాటు ద్విచక్ర, త్రిచక్ర వాహన అమ్మకాలు కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 12.28 లక్షల యూనిట్లను తాకాయి. గత క్యూ2లో నమోదైన 10.74 లక్షల యూనిట్లతో పోలిస్తే ఇది 14 శాతం వృద్ధి. వీటిలో మోటార్ సైకిళ్ల విక్రయాలు 14 శాతం పుంజుకుని 5.6 లక్షల యూనిట్లకు చేరగా.. స్కూటర్ అమ్మకాలు 17 శాతం ఎగసి 4.9 లక్షల యూనిట్లను తాకాయి.
ద్విచక్ర వాహన ఎగుమతులు 16 శాతం బలపడి 2.78 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి. ఇక త్రిచక్ర వాహన అమ్మకాలు 5,000 యూనిట్లు తగ్గి 38,000కు పరిమితమయ్యాయి. ఎలక్ట్రిక్ వాహనాలు 31 శాతం అధికంగా 75,000 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఫలితాల నేపథ్యంలో టీవీఎస్ మోటార్ షేరు బీఎస్‌ఈలో 3.6 శాతం పతనమై రూ. 2,565 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment