ఉప్పల్‌లో ప్రాపర్టీ షో!
ఈనెల 31న ఎస్‌బీఐ, ఉప్పల్ బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక దృష్టి సారించడం, వినూత్న ప్రణాళికల్ని ప్రకటించడం వంటి కారణాల వల్ల హైదరాబాద్ స్థిరాస్తి రంగంలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. గత కొంతకాలం నుంచి ప్లాట్లు, ఫ్లాట్లు కొనేందుకు దూరంగా ఉన్న కొనుగోలుదారులు, పెట్టుబడిదారుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రాంతంలో కొనాలి? ఏ ప్రాజెక్ట్‌ను ఎంచుకోవాలి? వంటి అనేక అంశాలపై సమగ్ర రూపమిచ్చేందుకు ఈనెల 31న ఎస్‌బీఐ, ఉప్పల్ బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉప్పల్ మున్సిపల్ మైదానంలో తొలి ప్రాపర్టీ షో జరగనుంది.
- సాక్షి, హైదరాబాద్
{పతికూల సమయంలోనూ హైదరాబాద్ స్థిరాస్తి రంగంలో పెట్టుబడి పెట్టాలంటే సరైన ప్రాంతం ఉప్పల్. మెట్రో రైల్ పనులు శరవేగంగా జరుగుతుండటం, ఓఆర్‌ఆర్ ఇన్నర్ రింగ్ కూతవేటు దూరంలో ఉండటం, ప్రతిష్టాత్మకమైన ఐటీఐఆర్ ప్రాజెక్ట్‌లో ఉప్పల్ ప్రాంతం ఉండటం వంటి కారణాలనేకం. మనం కోరుకున్న విధంగా మన భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలనుకుంటే అభివృద్ధికి ఆస్కారమున్న ప్రాంతాల్లోనే స్థిరాస్తిని కొనుగోలు చేయాలి. అంతేతప్ప తక్కువకు వస్తుంది కదా అని నగరానికి దూరంగా వెళ్లి ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో కొనరాదు. మనం తీసుకోవాలనుకునే ప్రాంతం ఉపాధి అవకాశాలు కల్పించే సంస్థలకు చేరువగా ఉంటే మరీ ఉత్తమం.
మొత్తం 34 స్టాళ్ల ద్వారా 50కి పైగా ప్రాజెక్ట్‌లు ప్రదర్శించనున్నారు. ఇందులో అపార్ట్‌మెంట్లు, విల్లాలు, ఓపెన్ ప్లాట్లుంటాయి. రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షలు విలువ చేసే ఫ్లాట్లు, రూ.40 లక్షల నుంచి కోటికిపైగా పలికే లగ్జరీ విల్లాలు, గజం రూ.5 వేలు నుంచి ప్రారంభమయ్యే ప్లాట్లు ప్రదర్శనలో ఉంచనున్నారు. ఇకపై ప్రతి ఏటా జనవరిలో స్థిరాస్తి ప్రదర్శన నిర్వహిస్తామని నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు.
అభివృద్ధి ఎటువైపో..
అభివృద్ధి అనేది ఎటువైపు పయనిస్తుందో అంచనా వేశాకే స్థిరాస్తి కొనుగోళ్లకు ముందడుగు వేయాలి. అయితే ఈ విషయంలో ఉప్పల్ ముందు వరుసలోనే ఉంటుంది. హెచ్‌ఎండీఏ మాస్టర్ ప్లాన్-2031లో ఉప్పల్ ప్రాంతం రెసిడెన్షియల్ జోన్ పరిధిలోకి వస్తుంది. పరిశ్రమల నుంచి పరిశోధన సంస్థల వరకు, ఆసుపత్రుల నుంచి వినోద కేంద్రాల వరకు అన్ని రంగాలకూ ఉప్పల్ పెట్టింది పేరు. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, ఎన్‌జీఆర్‌ఐ, సీసీఎంబీ, ఐఐసీటీ, సర్వే ఆఫ్ ఇండియా, సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ, జెన్‌ప్యాక్ట్, జీవీకే బయోసెన్సైస్ వంటి పరిశోధన సంస్థలున్నాయిక్కడ. అంతర్జాతీయ స్థాయి ఆసుపత్రులు, విద్యా సంస్థలు, షాపింగ్ కాంప్లెక్స్‌లకూ కొదవేలేదు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం పాతిక కిలోమీటర్ల దూరంలో ఉన్నా.. ఇన్నర్ రోడ్డు మీదుగా త్వరగానే చేరుకోవచ్చు.
హైదరాబాద్‌లో మొత్తం 50 వేల ఎక రాల్లో విస్తరించనున్న ఐటీఐఆర్ ప్రాజెక్ట్‌లో.. ఉప్పల్ ప్రాంతం కూడా ఉంది. క్లస్టర్-3లో భాగంగా ఉప్పల్, పోచారం ప్రాంతాల్లో 10.3 చ.కి.మీ. పరిధిలో ఐటీఐఆర్ రానుంది. దీనికి అనుసంధానంగా ఓఆర్‌ఆర్ గ్రోత్ కారిడార్-1లో 11.5 చ.కి.మీ., గ్రోత్ కారిడార్-2లో 14.3 చ.కి.మీ. పరిధిలో కూడా ఐటీఐఆర్‌ను విస్తరించనున్నారు. అంటే మొత్తం 36.1 చ.కి.మీ.లో ఐటీ కంపెనీలు కొలువుదీరనున్నాయన్నమాట. ఇప్పటికే హబ్సిగూడలో జెన్‌ప్యాక్ట్ ఐటీ పార్కు, రామంతాపూర్‌లో నూజివీడు సీడ్స్ ఐటీ, ఐటీ ఆధారిత సెజ్, ఇదే ప్రాంతంలో ఎన్‌ఎస్‌ఎల్ సంస్థ ఎరేనా టౌన్‌సెంటర్‌లున్నాయి. పోచారంలో రహేజా మైండ్‌స్పేస్, ఇన్ఫోసిస్‌లు తమ కార్యాలయాలను నెలకొల్పాయి కూడా.
{పతిష్టాత్మక ప్రాజెక్ట్ అయిన మెట్రో రైల్ తొలిసారిగా పరుగులు పెట్టేది కూడా ఇక్కడి నుంచే. నాగోల్ నుంచి మెట్టుగూడ.. 8 కి.మీ. దూరం మెట్రో పరుగులు పెట్టనుంది. ఈ మార్గంలో హబ్సిగూడ, ఉప్పల్, సర్వే ఆఫ్ ఇండియాల్లో మెట్రో స్టేషన్లుంటాయి. మరోవైపు నాగోల్- శిల్పారామం మార్గంలో 28 కి.మీ. దూరం మెట్రో రైలు వస్తుంది. ఇది కూడా పూర్తయితే ఇటు సికింద్రాబాద్‌కు, అటు హైటెక్ సిటీకి ప్రయాణ సమయమూ తగ్గుతుంది.
పాల్గొనే సంస్థల్లో కొన్ని..
ఏవీ కన్‌స్ట్రక్షన్స్, ఎస్వీ, ఎస్వీసీ, వినాయక బిల్డర్స్, రమేష్ కన్‌స్ట్రక్షన్స్, సత్యవాణి, ట్రాన్స్‌కాన్ లైఫ్ స్పేసెస్, ఆకృతి బిల్డర్స్, హరిణి, ఐడియా వంటి 34 నిర్మాణ సంస్థలు ఈ ప్రదర్శనలో పాల్గొననున్నాయి.