శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5 విక్రయాలు షురూ | Samsung Galaxy S5 comes bearing these free gifts | Sakshi
Sakshi News home page

శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5 విక్రయాలు షురూ

Published Sat, Apr 12 2014 12:57 AM | Last Updated on Sat, Sep 2 2017 5:54 AM

శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5 విక్రయాలు షురూ

శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5 విక్రయాలు షురూ

న్యూఢిల్లీ/సియోల్: శామ్‌సంగ్ కంపెనీకి చెందిన గెలాక్సీ ఎస్5 స్మార్ట్‌ఫోన్ విక్రయాలు ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఆండ్రాయిడ్ 4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ ఫోన్‌ను భారత్‌లో రూ.51,500 ధరకు విక్రయిస్తున్నామని  శామ్‌సంగ్ ఇండియా కంట్రీహెడ్(ఐటీ అండ్ మొబైల్ డివిజన్) వినీత్ తనేజా చెప్పారు. ఈ ఫోన్‌ను ఫిబ్రవరిలో బార్సిలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో శామ్‌సంగ్ ఆవిష్కరించింది. గత నెల 29న ప్రి బుకింగ్స్ ప్రారంభించింది. గెలాక్సీ ఎస్4 కంటే గెలాక్సీ ఎస్5కు మూడు రెట్లు ఎక్కువగా ప్రిబుకింగ్స్ వచ్చాయని వినీత్ తనేజా చెప్పారు.   

భారత్‌లో ఇప్పటిదాకా గెలాక్సీ స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్‌లను 3.5 కోట్లు విక్రయించామని ఆయన పేర్కొన్నారు. గెలాక్సీ ఎస్5లో 5.1 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 2జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ, 16 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 2.1 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 2800 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయని పేర్కొన్నారు.  యాపిల్ ఐఫోన్ 5ఎస్‌లో ఉన్నట్లుగానే గెలాక్సీ ఎస్5లో ఫింగర్ స్కానర్ ఫీచర్ ఉందని, ఇంకా పర్సనల్ ఫిట్‌నెస్ ట్రాకర్, ఎస్ హెల్త్ వంటి ఫీచర్ కూడా ఉందని వివరించారు.
 
 30 శాతం శామ్‌సంగ్ ఫోన్‌లే: వరుసగా రెండో క్వార్టర్లో  కూడా లాభాలు తగ్గుముఖం పడుతున్న  నేపథ్యంలో ఈ ఫోన్‌ను శామ్‌సంగ్ కంపెనీ మార్కెట్లోకి తెచ్చింది. ఈ ఫోన్ విక్రయాలతో మళ్లీ తాము లాభాల బాట పడతామని కంపెనీ ఆశిస్తోంది. ఈ ఫోన్‌పై సమీక్షలు బాగానే వచ్చినప్పటికీ, ఇంతకు ముందటి గెలాక్సీ ఫోన్‌కు, పోటీ కంపెనీల హై ఎండ్ స్మార్ట్‌ఫోన్‌లకు భిన్నంగా చెప్పుకోదగ్గ తేడాలు పెద్దగా ఏమీ లేవని పలువురు పెదవి విరుస్తున్నారు. కాగా కంపెనీ ఇటీవలి రికార్డ్ స్థాయి లాభాలకు శామ్‌సంగ్ మొబైల్ విభాగమే ప్రధాన కారణం. గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా అమ్ముడైన మొబైల్ ఫోన్లలో 30 శాతం శామ్‌సంగ్ కంపెనీవే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement