శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5 విక్రయాలు
న్యూఢిల్లీ: శామ్‌సంగ్ కంపెనీ గెలాక్సీ మోడల్‌లో ఐదవ జనరేషన్ హ్యాండ్‌సెట్, గెలాక్సీ ఎస్5ను గురువారం భారత మార్కెట్లోకి ఆవిష్కరించింది. వచ్చే నెల 11 నుంచి ఈ ఫోన్ల విక్రయాలను ప్రారంభిస్తామని శామ్‌సంగ్ ఇండియా కంట్రీ హెడ్ (ఐటీ అండ్ మొబైల్ డివిజన్) వినీత్ తనేజా చెప్పారు. ఏప్రిల్ 11నే ధరను నిర్ణయిస్తామని, రూ.51,000-రూ.53,000 రేంజ్‌లో ఉండొచ్చని కంపెనీ పేర్కొన్నారు. ముందస్తు బుకింగ్స్ రేపటి (శనివారం)నుంచి ప్రారంభమవుతాయని పేర్కొంది. గెలాక్సీ ఎస్5తో పాటు మరో 3 వేరబుల్ (ధరించే)డివైస్‌లను కూడా కంపెనీ ఆవిష్కరించింది. గేర్ 2(రూ.21,900); గేర్ ఫిట్, గేర్ 2 నియో(ఒక్కో దాని ధర రూ.15,000)
మూడున్నర కోట్ల గెలాక్సీ డివైస్‌లు
ఇప్పటిదాకా భారత్‌లో మూడున్నర కోట్ల గెలాక్సీ డివైస్‌లను(స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్లెట్లతో కలుపుకొని) విక్రయించామని తనేజా చెప్పారు. మంచి నాణ్యతగల ఉత్పత్తులకు ఎక్కువ డబ్బు చెల్లించడానికి వినియోగదారులు వెనకాడడం లేదని పేర్కొన్నారు. గెలాక్సీ నోట్ 3ను మార్కెట్లోకి తెచ్చినప్పుడే ఈ విషయం స్పష్టమైందని వివ రించారు. ఈ డివైస్‌ల కొనుగోళ్ల కోసం బైబ్యాక్, ఈఎంఐ ఆఫర్లనందిస్తున్నామని పేర్కొన్నారు. ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఓఎస్‌పై పనిచేసే ఈ ఫోన్‌ను తొలిసారిగా ఫిబ్రవరిలో బార్సిలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో శామ్‌సంగ్ ఆవిష్కరించింది.
ఎస్5 ప్రత్యేకతలు...
గెలాక్సీ ఎస్4లో ఉన్నట్లే ఎస్5 ఫోన్‌లో 5.1 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే(వాటర్ ప్రూఫ్, డస్ట్‌ప్రూఫ్ కూడా), ఆక్టా-కోర్ ప్రాసెసర్, 2జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ మెమరీ, 16 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 2.1 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 2800 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయని తనేజా వివరించారు. బ్యాటరీ 21 గంటల టాక్‌టైమ్‌ని ఇస్తుందన్నారు. యాపిల్ ఐ ఫోన్ 5ఎస్‌లో ఉన్న ఫింగర్ స్కానర్ ఫీచర్ ఈ గెలాక్సీ ఎస్5లో ఉందని చెప్పారు. ఇది భద్రమైన బయోమెట్రిక్ స్క్రీన్-లాకింగ్ ఫీచర్ అని, సురక్షితంగా మొబైల్ చెల్లింపులు జరపవచ్చని తనేజా వివరించారు. ఇక పర్సనల్ ఫిట్‌నెస్‌ను ట్రాక్ చేసే ఎస్ హెల్త్, తదితర ప్రత్యేకతలున్నాయని, 4 రంగుల్లో లభ్యమవుతుందని పేర్కొన్నారు. 4జీ నెట్‌వర్క్ కోసం ఎదురుచూస్తున్నామని, త్వరలో 4జీ హ్యాండ్‌సెట్లను అందిస్తామన్నారు.