శాంసంగ్ అధినేతకు ఐదేళ్ల జైలు శిక్ష
ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ కంపెనీ శాంసంగ్ గ్రూప్ అధినేత లీ జే-యాంగ్‌కు ఐదేళ్ల జైలు శిక్ష పడింది. అవినీతి ఆరోపణల కేసులో ఆయనకు దక్షిణ కొరియా కోర్టు ఈ శిక్ష విధించినట్టు స్థానిక మీడియా రిపోర్టు చేసింది. ప్రభుత్వ మద్దతుతో లబ్ది పొందడానికి శాంసంగ్ అధినేత లీ జే యాంగ్ లంచాలు ఇచ్చారనే ఆరోపణలతో ఆయన ఈ కేసులో చిక్కుకున్నారు. స్థానిక న్యూస్ ఏజెన్సీ యోన్‌హ్యాప్ ప్రకారం శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ వైస్ చైర్మన్ లీ, అభిశంసనకు గురైన ఆ దేశాధ్యక్షురాలు పార్క్ గెయిన్ హెయికు లంచం ఇచ్చారని కోర్టు చెప్పినట్టు తెలిసింది.
శాంసంగ్ సీ అండ్ టీ, కెయిల్ ఇండస్ట్రీస్ వివాస్పద విలీనానిని సంబంధించి 2015లో ప్రభుత్వ ఆమోదం కోసం ఈ లంచం ఇచ్చారన్నది ప్రధాన ఆరోపణ. ఈ విలీనాన్ని శాంసంగ్ ఎల్ అండ్‌టీ షేర్‌హోల్డర్ ఇలియట్ అసోసియేట్స్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ డీల్‌తో కంపెనీని తక్కువ విలువ కడుతున్నారని, కెయిల్ ఇండస్ట్రీస్ విలువను పెంచుతున్నారని పేర్కొంది.
అవినీతి ఆరోపణల కేసులో అరెస్టు అయిన లీకు 12ఏళ్ల జైలు శిక్ష విధించాలని ప్రాసిక్యూటర్లు కోరారు. ఒక్క అవినీతి కేసులో మాత్రమే కాక, అపహరణ, పొరపాటు కేసులో కూడా ఆయనకు కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష వేసింది. శామ్‌సంగ్ 230 బిలియన్ డాలర్ల కంపెనీ. దక్షిణ కొరియా ఆర్థికంలో 17 శాతం శామ్‌సంగ్‌దే.