హిందూజా కుటుంబానికి ఎటువంటి జైలు శిక్ష పడలేదని వారికి సంబంధించిన అధికార ప్రతినిధి తెలిపారు. హిందూజా గ్రూప్ చైర్మన్ ప్రకాశ్ హిందుజా, ఆయన భార్య కమల్ హిందూజా, కుమారుడు అజయ్, కోడలు నమ్రత తమ జెనీవా నివాసంలో పనిచేసే భారతీయ వలసదారు సిబ్బందిని వేధించారంటూ స్విస్ కోర్టులో పిటిషన్ వేయగా కోర్టు వారికి జైలు శిక్ష విధించినట్లు వార్తలు వచ్చాయి.
అయితే హిందూజా కుటుంబంలోని నలుగురు సభ్యులను జైల్లో పెట్టలేదని, వారిపై మానవ అక్రమ రవాణా అభియోగాలను కోర్టు కొట్టివేసినట్లు హిందూజా అధికార ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ‘స్విస్ పౌరులైన హిందూజా కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు కమల్, ప్రకాశ్ హిందూజా, నమ్రత, అజయ్ హిందూజాలకు ఎలాంటి జైలుశిక్ష, నిర్బంధం విధించలేదు’ అని పేర్కొన్నారు.
మిగిలిన అభియోగాల్లో దిగువ కోర్టు తీర్పుపై ఉన్నత న్యాయస్థానంలో తాము అపీల్ చేసినట్లు హిందూజా ప్రతినిధి తెలిపారు. "స్విస్ చట్టాల ప్రకారం.. అత్యున్నత న్యాయస్థానం తుది తీర్పు వచ్చేంత వరకు నిర్దోషిత్వ భావన చాలా ముఖ్యమైనది కాబట్టి దిగువ కోర్టు తీర్పు పనిచేయదు" అని వివరించారు. తమకు అర్థం కాని స్టేట్ మెంట్లపై సంతకాలు చేయించారని బాధిత సిబ్బంది కోర్టులో ప్రకటించారని, హిందుజా కుటుంబం తమను గౌరవంగా, హుందాగా, కుటుంబ సభ్యుల్లా చూసుకున్నారని వారంతా సాక్ష్యం చెప్పారని వివరించారు. స్విస్ న్యాయ ప్రక్రియపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, సత్యం గెలుస్తుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment