సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ తన ప్రతాపాన్ని చూపుతుండటంతో వాణిజ్య, ఉత్పాదక కార్యకలాపాలు స్తంభించాయి. పలు కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేయాలని కోరుతున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో భారత్‌లో ఈనెల 25 వరకూ స్మార్ట్‌ఫోన్‌ల తయారీని నిలిపివేయాలని శాంసంగ్, ఓపో, వివోలు నిర్ణయించాయి. భారత్‌లో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ ప్రకటించడంతో మొబైల్ తయారీ కంపెనీలు ఈ ప్రకటన చేశాయి.
యూపీలో పూర్తి లాక్‌డౌన్ ప్రకటించిన క్రమంలో ఆ రాష్ట్ర పరిధిలోని నోయిడాలో శాంసంగ్, ఓపో, వివో సంస్థల తయారీ ప్లాంట్లను నిలిపివేయాల్సిన పరిస్థితి నెలకొంది. మార్చి 25 వరకూ లేదా తదుపరి ఉత‍్తర్వులు వెలువడే వరకూ ఈ ప్లాంట్లు తెరుచుకోవు. ఏటా 1.2 కోట్ల స్మార్ట్‌ఫోన్‌లను తయారుచేసే సామర్ధ్యం కలిగిన గ్రేటర్ నోయిడా ఫ్యాక్టరీ శాంసంగ్‌కు అతిపెద్ద తయారీ కేంద్రం కావడం గమనార్హం. స్మార్ట్‌ఫోన్‌లతో పాటు స్మార్ట్ టీవీలు, ఏసీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు వంటి ఎలక్ర్టానిక్ గృహోపకరణాలు ఈ ప్లాంట్‌లో తయారవుతాయి.
చదవండి : కరోనా: చప్పట్లు కాదు అవి ఇవ్వండి!
నోయిడా ప్లాంట్ మూసివేసినా ఫ్యాక్టరీలో పనిచేసే ఆర్‌అండ్‌డీ ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేయాలని శాంసంగ్ కోరింది. ఇక వివో సైతం తమ ఫ్యాక్టరీయేతర ఉద్యోగులందరినీ ఇంటి నుంచి పనిచేయాలని సూచించింది. మరోవైపు ఎల్‌జీ తమ నోయిడా, పుణే ప్లాంట్‌లలో ఉత్పత్తిని నిలిపివేసింది. కాగా పుణే, చెన్నయ్‌లోని ప్లాంట్లలో ఉత్పత్తిని ఎరిక్సన్, నోకియాలు కొనసాగిస్తున్నాయి. కేవలం 50 శాతం సిబ్బందితో ఫ్యాక్టరీలో ఉత్పత్తి కొనసాగుతోందని ఎరిక్సన్ ఓ వార్తాసంస్థకు వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment