న్యూఢిల్లీ: దేశ టీవీల మార్కెట్లో లీడర్‌గా ఉన్న శామ్‌సంగ్... చైనా కంపెనీలిస్తున్న పోటీకి తల వంచింది. తన ప్రారంభ సైజు టీవీల ధరలను ఏకంగా 20 శాతం వరకూ తగ్గించింది. శామ్‌సంగ్ ధరల్ని ఈ స్థాయిలో తగ్గించడం ఇదే తొలిసారి.
నిజానికి షావోమీ, టీసీఎల్ కంపెనీలు 55 అంగుళాల టీవీలను రూ.45,000 స్థాయిలోనే అందిస్తుండగా, శామ్‌సంగ్ మాత్రం ఇదే సైజు టీవీలను రెట్టింపునకు పైగా ధరలకు మార్కెట్ చేసుకుంటోంది. తాజాగా ధరల్ని తగ్గించిన తర్వాత వీటి మధ్య వ్యత్యాసం 60 శాతానికి తగ్గింది. మార్కెట్లో తన స్థానాన్ని కాపాడుకోవడంతో పాటు, కొత్త కస్టమర్లను ఆకర్షించొచ్చన్నది కంపెనీ వ్యూహమని శామ్‌సంగ్ డీలర్లు చెబుతున్నారు.
భారీ టెలివిజన్ మార్కెట్...
దేశీయ టెలివిజన్ మార్కెట్ పరిమాణం దాదాపు రూ.22,000 కోట్లు. అందుకే దేశ స్మార్ట్‌ఫోన్ల మార్కెట్లో సగానికి పైగా వాటాతో ఆధిపత్యాన్ని సాధించిన చైనా కంపెనీల కన్ను ఇప్పుడు టెలివిజన్ల మార్కెట్‌పై పడింది. ఇందులో భాగమే షావోమీ కంపెనీ అత్యాధునిక ఫీచర్లున్న స్మార్ట్ టీవీలను తక్కువ ధరలకు లాంచ్ చేయడం. 43 అంగుళాల స్మార్ట్ టీవీని షావోమీ ఎంఐ పేరుతో ఈ ఏడాది ఫిబ్రవరిలో దేశీయ మార్కెట్లో రూ.22,999కే విడుదల చేసింది.
ఇక 55 అంగుళాల 4కే టీవీ ధరను రూ.39,999కే తీసుకొచ్చింది. అయితే, తర్వాత కొన్ని రోజులకు 55 అంగుళాల టీవీ ధర రూ.5వేలు పెంచి రూ.44,999 చేసింది. వీటికి కస్టమర్ల నుంచి స్పందనే లభించింది. దీంతో దక్షిణ కొరియా కంపెనీ శామ్‌సంగ్ ధరల పరంగా దిగిరాక తప్పలేదు. 55 అంగుళాల టీవీని ఇంతకాలం రూ.లక్షకు విక్రయించిన ఈ కంపెనీ ఇపుడు రూ.70,000కు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక 43 అంగుళాల టీవీని రూ.39,900 నుంచి రూ.33,500కు తగ్గించింది.
విధానంలో మార్పు...
‘‘సాధారణంగా కొత్త మోడళ్లను ప్రవేశపెట్టినప్పుడు కంపెనీలు అప్పటికే మార్కెట్లో ఉన్న పాత మోడళ్ల ధరల్ని 5 శాతం వరకు తగ్గించడం జరుగుతుంది. కానీ, ఈ విడత శామ్‌సంగ్ ఏకంగా 10– 20 శాతం వరకు ధరల్ని తగ్గించింది. ధరల విధానం పూర్తిగా మారిందని ఇది తెలియజేస్తోంది’’ అని ప్రముఖ రిటైల్ కంపెనీ డైరెక్టర్ ఒకరు చెప్పారు.
అందుబాటు ధరల టీవీలకు మళ్లుతున్న కస్టమర్లను ఆకర్షించేందుకు, మార్కెట్ వాటా పెంచుకునేందుకు శామ్‌సంగ్ చాలా పోటీతో కూడిన ధరల విధానాన్ని ఆచరణలో పెట్టిందని ముంబైకి చెందిన రిటైల్ చెయిన్ కోహినూర్ డైరెక్టర్ విశాల్‌మేవాని చెప్పారు. దేశ టీవీ మార్కెట్‌ను శామ్‌సంగ్, సోనీ, ఎల్జీలే ఇంతకాలం ఏలాయి. అయితే, షావోమీ, టీసీఎల్, థామ్సన్, షార్ప్, బీపీఎల్, స్కైవర్త్ బ్రాండ్ల రాకతో పరిస్థితి మారిపోయింది. ప్రముఖ బ్రాండ్లు తమ ధరలపై పునరాలోచించాల్సిన అవసరం ఏర్పడింది.
స్మార్ట్‌ఫోన్ల మాదిరే...
భారత టెలివిజన్ల మార్కెట్లోకి షావోమీ ప్రవేశం గత నాలుగేళ్ల కాలంలో స్మార్ట్‌ఫోన్ల మార్కెట్లో చోటుచేసుకున్న విధ్వంసకర పోటీ పరిస్థితులకే దారితీస్తుందని ఫారెస్టర్ అధ్యయనం తెలిపింది. టెలికం రంగంలో జియో ఎలాగైతే విప్లవం సృష్టించిందో, అదే మాదిరిగా భారత టెలివిజన్ మార్కెట్‌ను తాము మార్చేయాలనుకుంటున్నట్టు షావోమీ సహ వ్యవస్థాపకుడు లీజున్ చెప్పారు. ఆఫ్‌లైన్ స్టోర్లలో విక్రయాలు ఆరంభించడానికి ముందే ఈ ఏడాది చివరికి అతిపెద్ద ఆన్‌లైన్ బ్రాండ్‌గా అవతరించాలన్నది కంపెనీ లక్ష్యంగా చెప్పారు.
అంత సులభం కాదు...!
‘‘వినియోగదారులు కేవలం ధరలను మాత్రమే చూసి టీవీలు కొనకపోవచ్చు. టీవీకి రిపేర్ వస్తే అది వెంటనే సరిచేయాలని కోరుకుంటారు. రిపేర్ సదుపాయాలను సమకూర్చడం అంత తేలికకాదు. స్మార్ట్‌ఫోన్లకు సమస్య వస్తే వారు వెంటనే హ్యాండ్‌సెట్ మార్చేయగలరు.
అందుకే స్మార్ట్‌ఫోన్లతో పోలిస్తే టీవీ మార్కెట్ కొత్త బ్రాండ్లకు సవాలే’’ అని కొరియాకు చెందిన ఓ ప్రముఖ టెలివిజన్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసిక గణాంకాలు చూస్తే... దేశీ టీవీ మార్కెట్లో శామ్‌సంగ్‌కు 30 శాతం వాటా ఉంది. తర్వాత ఎల్జీ, సోనీ ఉన్నాయి. అదే 55 అంగుళాలు ఆ పైన సైజున్న టీవీల్లో శామ్‌సంగ్ వాటా 37 శాతం. సోనీది 29 శాతం వాటా.
ధరల పెంపు
చిత్రంగా ప్రారంభసైజు టీవీల ధరల్ని తగ్గంచిన శామ్‌సంగ్ పెద్ద సైజు తెరల క్యూఎల్‌ఈడీ టీవీల రేట్లను పెంచేసింది. 65 అంగుళాల ఫ్లాట్ క్యూఎల్‌ఈడీ టీవీ ధరను రూ.30,000 వరకు పెంచగా, కర్వ్‌డ్ క్యూఎల్‌ఈడీ టీవీ ధరను ఏకంగా రూ.55,000 మేర పెంచేసింది. కాకపోతే బంపర్ ఆఫర్ కింద ఈ టీవీలను కొన్న వారికి శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్9 స్మార్ట్‌ఫోన్‌ను ఉచితంగా ఇస్తోంది.
శామ్‌సంగ్ తాజా ధరలు
సైజు గత ధర ప్రస్తుత ధర
(అంగుళాల్లో) (రూ.ల్లో) (రూ.ల్లో)
32 22,900 19,400
43 39,900 33,500
55 1,00,000 70–75,000
65 2,05,000 1,95,000
కొత్త ఫీచర్లతో శామ్‌సంగ్ టీవీలు
చెన్నై: శామ్‌సంగ్ కంపెనీ యాంబియెంట్ మోడ్, మరింత శబ్ధ నాణ్యత తదితర ఫీచర్లతో కూడిన నూతన శ్రేణి టెలివిజన్లను గురువారం విడుదల చేసింది. క్యూఎల్‌ఈడీ, యూహెచ్‌డీ, కాన్సర్ట్ సిరీస్‌లో నూతన శ్రేణి టెలివిజన్లను తీసుకొచ్చింది.
క్యూఎల్‌ఈడీ సిరీస్ టీవీల్లో యాంబియెంట్ మోడ్‌తో కస్టమర్లు తమ స్వభావాలకు అనుగుణమైన ఫీచర్లు, వాతావరణ పరిస్థితులను తెలుసుకోవచ్చని కంపెనీ తెలిపింది. క్యూఎల్‌ఈడీ మోడళ్ల ధర రూ.2.45 లక్షలు, యూహెచ్‌డీ టీవీల ధర రూ.64,900, కాన్సర్ట్ సిరీస్ టీవీల ధరలు రూ.27,500 నుంచి ప్రారంభం అవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment