సత్యం కుంభకోణం కేసు...
టెక్ మహీంద్ర పిటిషన్‌పై 30న హైకోర్టు తీర్పు
హైదరాబాద్ : సత్యం కంప్యూటర్స్ కుంభకోణానికి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) తమపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ టెక్ మహీంద్ర దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో శుక్రవారం వాదనలు ముగిశాయి. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు ఈ నెల 30న తీర్పు వెలువరిస్తానని స్పష్టం చేశారు. సత్యం కంప్యూటర్స్‌పై నమోదు చేసిన కేసును ఆ కంపెనీని విలీనం చేసుకున్న తరువాత కూడా ఈడీ తమపై కొనసాగిస్తూ చార్జిషీట్‌లో తమను నిందితులుగా చేర్చడాన్ని సవాలు టెక్ మహీంద్ర హైకోర్టును ఆశ్రయించింది.
కంపెనీ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.రవి వాదనలు వినిపించారు. సత్యం కుంభకోణం తరువాత ఆ కంపెనీ బాధ్యతలు చూడాలని కేంద్రం కోరితేనే తాము ఆ బాధ్యతలు స్వీకరించామని, అటువంటి తమను నిందితుల జాబితాలో చేర్చడం ఎంత మాత్రం సరికాదని తెలిపారు. సత్యం కంప్యూటర్స్, టెక్ మహీంద్ర విలీనానికి ఆమోదముద్ర వేస్తూ ఇదే హైకోర్టు తీర్పునిచ్చిందని, సత్యంపై ఉన్న కేసులన్నింటికీ కూడా టెక్ మహీంద్ర బాధ్యత వహించాలని ఆ తీర్పులో స్పష్టంగా పేర్కొన్నారని ఈడీ తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు.