ధనాధన్‌ జియో | Saudi Arabia's Public Investment Fund to invest in Jio Platform | Sakshi
Sakshi News home page

ధనాధన్‌ జియో

Published Fri, Jun 19 2020 5:16 AM | Last Updated on Fri, Jun 19 2020 5:18 AM

Saudi Arabia's Public Investment Fund to invest in Jio Platform - Sakshi

న్యూఢిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో ప్లాట్‌ఫామ్స్‌లో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. జియో ప్లాట్‌ఫా మ్స్‌లో 2.32 శాతం వాటాను సౌదీ అరేబియా పబ్లిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ (పీఐఎఫ్‌) రూ.11,367 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ సంస్థ భారత్‌లో ఇప్పటివరకూ పెట్టిన పెట్టుబడుల్లో ఇదే పెద్దది కావడం గమనార్హం.  ఈ ఏడాది ఏప్రిల్‌ 22 నుంచి  ఫేస్‌బుక్‌ నుంచి మొదలైన పెట్టుబడుల వరదలో  జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఇది పదకొండవ పెట్టుబడి. ఇప్పటివరకూ 24.7 శాతం వాటాకు రూ.1,15,694 కోట్ల మేర నిధులు వచ్చాయి. జియో ప్లాట్‌ఫామ్స్‌లో 25 శాతం మేర వాటాను విక్రయించాలని రిలయన్స్‌ భావించిందని సమాచారం.


కరోనా కాలంలోనూ నిధుల వరద
సౌదీ అరేబియా పీఐఎఫ్‌ తాజా పెట్టుబడుల పరంగా చూస్తే, జియో ప్లాట్‌ఫామ్స్‌ ఈక్విటీ విలువ రూ.4.91 లక్షల కోట్లుగా, ఎంటర్‌ప్రైజ్‌ వేల్యూ రూ.5.16 లక్షల కోట్లుగా ఉందని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వెల్లడించింది. కరోనా వైరస్‌ కల్లోలంతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమన  పరిస్థితులు నెలకొన్నా, ప్రపంచ దిగ్గజ సంస్థల నుంచి ఈ రేంజ్‌లో నిధులు రాబట్టటం విశేషమే.
 కాగా ఈ డీల్‌కు వివిధ ప్రభుత్వ సంస్థల ఆమోదాలు లభించాల్సిఉంది. ఈ డీల్‌కు ఆర్థిక సలహాదారుగా మోర్గాన్‌ స్టాన్లీ సంస్థ వ్యవహరించింది.

ఆల్‌టైమ్‌ హైకి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌
సౌదీ పీఐఎఫ్‌ తాజా పెట్టుబడులతో రిలయన్స్‌ షేర్‌ దూసుకెళ్లింది. ఇంట్రాడేలో  జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.1,665ను తాకింది. చివరకు 2% లాభంతో రూ.1,656 వద్ద ముగిసింది.   మార్కెట్‌ విలువ రూ.11,19,930 కోట్లకు చేరింది. భారత్‌లో అత్యధిక మార్కెట్‌ క్యాప్‌ కంపెనీ ఇదే.

ఫ్యూచర్‌ గ్రూప్‌లో రిలయన్స్‌కు వాటాలు!
న్యూఢిల్లీ: ఫ్యూచర్‌ గ్రూప్‌ కంపెనీల్లో వాటాలను రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కొనుగోలు చేయనున్నదని సమాచారం.  ఫ్యూచర్‌ గ్రూప్‌నకు చెందిన çఫ్యూచర్‌ రిటైల్, ఇతర కంపెనీల్లో వాటా విక్రయ సంబంధిత చర్చలు జోరుగా జరుగుతున్నాయని  పరిశ్రమ వర్గాలంటున్నాయి. కాగా ఈ వార్తలను ఇరు కంపెనీలు ధ్రువీకరించలేదు.  ఫ్యూచర్‌ రిటైల్‌లో వాటా విక్రయం కోసం గతంలో ఫ్యూచర్‌ గ్రూప్‌ సంస్థ, విప్రో ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ, ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌తోనూ, ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ సమర క్యాపిటల్‌తోనూ చర్చలు జరిపింది. కాగా వాటా విక్రయ ఒప్పందం కుదిరితే, ఫ్యూచర్‌  గ్రూప్‌నకు ఒకింత ఊరట లభిస్తుంది. రుణాలు తిరిగి చెల్లించడంలో  ఫ్యూచర్‌ గ్రూప్‌ చైర్మన్‌ కిశోర్‌ బియానీ విఫలమయ్యారు. దీంతో పలు రేటింగ్‌ సంస్థలు ఫ్యూచర్‌ గ్రూప్‌ కంపెనీల రేటింగ్‌లను డౌన్‌గ్రేడ్‌ చేశాయి. అంతే కాకుండా బియానీ తనఖా పెట్టిన షేర్లను ఆయా రుణ సంస్థలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ప్రతికూల పరిస్థితుల్లో వాటా విక్రయం ద్వారా నిధులు లభిస్తే, అది బియానీకి పెద్ద ఊరట కానున్నది. కాగా బిగ్‌బజార్, ఈజీడే క్లబ్, హెరిటేజ్‌ ఫ్రెష్‌ రిటైల్‌ స్టోర్స్‌ను çఫ్యూచర్‌ రిటైల్‌ నిర్వహిస్తోంది.

సౌదీ అరేబియాతో రిలయన్స్‌కు దశాబ్దాలుగా సంబంధాలు ఉన్నాయి. ఇప్పటిదాకా చమురు రంగానికి పరిమితమైన ఈ బంధం పీఐఎఫ్‌ పెట్టుబడులతో ఇక భారత కొత్త ఇంధన రంగాన్ని (డేటా) మరింత బలోపేతం చేయనుంది. సౌదీ అరేబియా ఆర్థిక ముఖచిత్రాన్ని కొంగొత్తగా తీర్చిదిద్దడంలో పీఐఎఫ్‌ కీలకపాత్ర పోషించింది. జియో ప్లాట్‌ఫామ్స్‌లో విలువైన భాగస్వామిగా పీఐఎఫ్‌ను స్వాగతిస్తున్నా. 130 కోట్ల మంది ప్రజలకు సాధికారత అందించే దిశగా భారత్‌ తలపెట్టిన డిజిటల్‌ కార్యక్రమం వేగవంతం చేసేలా పీఐఎఫ్‌ మద్దతునిస్తుందని, మార్గదర్శకత్వం చేస్తుందని ఆశిస్తున్నాను.
– ముకేశ్‌ అంబానీ, సీఎండీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌

భారత డిజిటల్‌ ఎకానమీ సామర్థ్యంపై మాకు గట్టి నమ్మకం ఉంది. జియోతో భాగస్వామ్యం ద్వారా ఆ వృద్ధిలో పాలుపంచుకునే అవకాశం మాకు కూడా లభిస్తుంది. భారత్‌లో టెక్నాలజీ రంగం ముఖచిత్రాన్ని మార్చివేస్తున్న వినూత్న సంస్థలో పెట్టుబడులు పెట్టడం మాకు సంతోషకరమైన విషయం. అలాగే ఈ పెట్టుబడులతో సౌదీ ఎకానమీకి, మా దేశ ప్రజలకూ దీర్ఘకాలికంగా వ్యాపారపరమైన ప్రయోజనాలు చేకూరతాయి.
– యాసిర్‌–అల్‌–రుమయ్యన్, గవర్నర్, పీఐఎఫ్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement