
ముంబై: డెబిట్ కార్డుల వినియోగాన్ని క్రమంగా తప్పించే దిశగా బ్యాంకులు కసరత్తు చేస్తున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) క్రమంగా ప్లాస్టిక్ కార్డుల వినియోగాన్ని తగ్గించి డిజిటల్ పేమెంట్ విధానాలను మరింతగా ప్రోత్సహించాలని భావిస్తోంది. తద్వారా డెబిట్ కార్డుల వాడకాన్ని పూర్తిగా నిలిపివేయాలని యోచిస్తోంది. సోమవారం జరిగిన బ్యాంకింగ్, ఆర్థిక రంగ సంస్థల వార్షిక సదస్సు ఫిబాక్‌లో పాల్గొన్న సందర్భంగా ఎస్‌బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ ఈ విషయాలు తెలిపారు. ‘డెబిట్ కార్డులను పూర్తిగా తొలగించాలని మేం భావిస్తున్నాం. కచ్చితంగా ఇది సాధ్యమేనని విశ్వసిస్తున్నాం‘ అని ఆయన చెప్పారు. డెబిట్ కార్డుల రహిత దేశంగా భారత్‌ను మార్చడానికి తమ ’యోనో’ వంటి డిజిటల్ ప్లాట్‌ఫాంలు ఉపయోగపడగలవన్నారు.
అసలు కార్డు అవసరమే లేకుండా యోనో ప్లాట్‌ఫాం ద్వారా ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రా చేసుకోవచ్చని, చెల్లింపులు కూడా జరపవచ్చని ఆయన చెప్పారు. ప్రస్తుతం దేశీయంగా 90 కోట్లకు పైగా డెబిట్ కార్డులు, 3 కోట్లకు పైగా క్రెడిట్ కార్డులు వినియోగంలో ఉన్నాయి. మరోవైపు, కేంద్ర ప్రభుత్వం గతేడాది ప్రకటించిన ’59 నిమిషాల్లోనే రుణ మంజూరీ పథకం’పై చిన్న వ్యాపార సంస్థల నుంచి పెద్దగా స్పందన కనిపించడం లేదని ఆయన తెలిపారు. అయినప్పటికీ వాహనాలకు.. ముఖ్యంగా కార్లకు కూడా ఈ రుణాలను వర్తింపచేసే అంశాన్ని బ్యాంకు పరిశీలిస్తోందన్నారు. రూ. 25 కోట్ల దాకా టర్నోవరు ఉండే వ్యాపారవేత్త ఈ పథకం కింద కేవలం 59 నిమిషాల్లోనే రూ. 5 కోట్ల దాకా రుణాలకు సూత్రప్రాయంగా ఆమోదం పొందవచ్చని రజనీష్ కుమార్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment