debit card usage
-
వీ–మార్ట్‌లో వినాయక చవితి ఆఫర్లు
హైదరాబాద్: ఫ్యాషన్ రిటైల్ సంస్థ వీ–మార్ట్... రాబోయే వినాయక చవితి సందర్భంగా గొప్ప ఆఫర్లు ప్రకటించింది. ఏపీ, తెలంగాణతో సహా ఒడిషా, కర్ణాటక, గోవా, పుణెల్లోని అన్ని వీ–మార్ట్ షోరూంలలో ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ఆగస్టు 19 నుంచే మొదలైన ఈ పండుగ ఆఫర్లు.. నెలాఖరుదాకా కొనసాగనున్నాయి. రూ.3 వేల కొనుగోలుపై రూ.1,500 డిస్కౌంట్ వోచర్, హెచ్డీఎఫ్సీ డెబిట్, క్రెడిట్ కార్డులపై 7.5% వరకు తక్షణ డిస్కౌంట్లను ఇస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. -
డెబిట్ కార్డులకు ఇక చెల్లుచీటీ..!
ముంబై: డెబిట్ కార్డుల వినియోగాన్ని క్రమంగా తప్పించే దిశగా బ్యాంకులు కసరత్తు చేస్తున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) క్రమంగా ప్లాస్టిక్ కార్డుల వినియోగాన్ని తగ్గించి డిజిటల్ పేమెంట్ విధానాలను మరింతగా ప్రోత్సహించాలని భావిస్తోంది. తద్వారా డెబిట్ కార్డుల వాడకాన్ని పూర్తిగా నిలిపివేయాలని యోచిస్తోంది. సోమవారం జరిగిన బ్యాంకింగ్, ఆర్థిక రంగ సంస్థల వార్షిక సదస్సు ఫిబాక్‌లో పాల్గొన్న సందర్భంగా ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ ఈ విషయాలు తెలిపారు. ‘డెబిట్ కార్డులను పూర్తిగా తొలగించాలని మేం భావిస్తున్నాం. కచ్చితంగా ఇది సాధ్యమేనని విశ్వసిస్తున్నాం‘ అని ఆయన చెప్పారు. డెబిట్ కార్డుల రహిత దేశంగా భారత్‌ను మార్చడానికి తమ ’యోనో’ వంటి డిజిటల్ ప్లాట్‌ఫాంలు ఉపయోగపడగలవన్నారు. అసలు కార్డు అవసరమే లేకుండా యోనో ప్లాట్‌ఫాం ద్వారా ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రా చేసుకోవచ్చని, చెల్లింపులు కూడా జరపవచ్చని ఆయన చెప్పారు. ప్రస్తుతం దేశీయంగా 90 కోట్లకు పైగా డెబిట్ కార్డులు, 3 కోట్లకు పైగా క్రెడిట్ కార్డులు వినియోగంలో ఉన్నాయి. మరోవైపు, కేంద్ర ప్రభుత్వం గతేడాది ప్రకటించిన ’59 నిమిషాల్లోనే రుణ మంజూరీ పథకం’పై చిన్న వ్యాపార సంస్థల నుంచి పెద్దగా స్పందన కనిపించడం లేదని ఆయన తెలిపారు. అయినప్పటికీ వాహనాలకు.. ముఖ్యంగా కార్లకు కూడా ఈ రుణాలను వర్తింపచేసే అంశాన్ని బ్యాంకు పరిశీలిస్తోందన్నారు. రూ. 25 కోట్ల దాకా టర్నోవరు ఉండే వ్యాపారవేత్త ఈ పథకం కింద కేవలం 59 నిమిషాల్లోనే రూ. 5 కోట్ల దాకా రుణాలకు సూత్రప్రాయంగా ఆమోదం పొందవచ్చని రజనీష్ కుమార్ వివరించారు. -
భర్తకు డెబిట్ కార్టు ఇస్తున్నారా? ఇది చదవండి..
బెంగళూరు : ఎవరి డెబిట్ కార్డులు వారు మాత్రమే వినియోగించాలన్న నిబంధన ఉన్నప్పటికీ ఆ నిబంధనను చాలా మంది పట్టించుకోవడం లేదు. కర్ణాటకలోని వినియోగదారుల ఫోరమ్ తీర్పు చూశాక మీ డెబిట్ కార్డు ఇతరులకు ఇవ్వాలంటే కచ్చితంగా ఆలోచిస్తారు. ఓ కేసుపై దీర్ఘకాల విచారణ చేపట్టిన ఫోరమ్ భార్య డెబిట్ కార్డు వినియోగించే హక్కు భర్తకు కూడా లేదని తేల్చిచెప్పింది. వివరాల్లోకి వెళ్లే మరతహళ్లికి చెందిన వందన... 2013 నవంబర్ 14వ తేదీన, తన ఎస్బీఐ డెబిట్ కార్డు భర్త రాజేశ్‌కు ఇచ్చి 25,000 డ్రా చేసుకు రమ్మన్నారు. దీంతో రాజేశ్ ఏటీఎంకు వెళ్లాడు. అక్కడ డబ్బులు రాకపోగా.. అకౌంట్లో నుంచి డబ్బులు మాత్రం కట్ అయ్యాయి. వెంటనే ఆ దంపతులు ఎస్బీఐ ఫిర్యాదు చేసినప్పటికీ లాభం లేకపోయింది. దీంతో ఆమె అక్టోబర్‌లో జిల్లా వినియోగదారుల ఫోరమ్‌ను సంప్రదించారు. ఫోరమ్ ఆదేశాలతో మళ్లీ ఆమె అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న ఎస్బీఐ సీసీటీవీ పరిశీలించి అందులో ఆమె భర్త డెబిట్ కార్డును వాడినట్టు తేలడంతో ఈ కేసును మూసివేస్తున్నట్టు తెలిపింది. బ్యాకింగ్ చట్టాల ప్రకారం ఎవరి డెబిట్ కార్డును వారే వినియోగించాలని పేర్కొంది. ఈ కేసులో ఇతరులకు పిన్ షేర్ చేయడాన్ని సాకుగా చూపింది ఎస్బీఐ. మూడున్నరేళ్లపాటు కొనసాగిన ఈ కేసులో వినియోగదారుల ఫోరం మే 29న కేసును తోసిపుచ్చుతూ తుది తీర్పు వెలువరించింది. తీర్పులో వందన తన ఏటీఎం పిన్ నంబర్ తన భర్తకు చెప్పి ఉండాల్సింది కాదని పేర్కొంది. తనకు అంతగా కావాలంటే చెక్ ద్వారానో మరేదైనా మార్గంలో డబ్బులు తీసుకుంటే బాగుండేదని అభిప్రాయపడింది. -
డెబిట్, క్రెడిట్ కార్డుల వినియోగం పైపైకి!
నోయిడా: రాబోయే మూడు నాలుగేళ్లలో దేశంలో డెబిట్, క్రెడిట్ కార్డులు, ఏటీఎంల వినియోగం బాగా పెరుగుతుందని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ చెప్పారు. ఆర్థిక లావాదేవీల నిర్వహణకు భవిష్యత్తులో మొబైల్ ఫోన్ల వాడకంపై ఆధారపడతారన్నారు. దేశంలో దాదాపు 72 శాతం ప్రజలు 32 ఏళ్లలోపు వారేనని, 2040 వరకూ ఇదే పరిస్థితి ఉంటుందని పేర్కొన్నారు. 100 కోట్ల బయోమెట్రిక్ కార్డులు, పెద్ద సంఖ్యలో మొబైల్ ఫోన్లు, బ్యాంకు ఖాతాలు ఉన్న దేశం మనదేనని చెప్పారు. 7.5 శాతం వార్షిక వృద్ధి రేటుతో భారత్ ముందుకు పోతుందని, ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం సమయంలో మన వృద్ధి రేటు ఒయాసిస్సును తలపిస్తుందని అభిప్రాయపడ్డారు. -
డెబిట్ కార్డులపై సర్వీసు చార్జి రద్దు
-
డెబిట్ కార్డులపై సర్వీసు చార్జి రద్దు
పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటిగా పలు రకాల చర్యలను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా మరో ఉపశమన చర్యను ప్రకటించింది. డెబిట్ కార్డుల వాడకాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా.. వాటి వాడకంపై సర్వీసుచార్జీని ఈ ఏడాది చివరివరకు రద్దు చేస్తున్నట్లు ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ ప్రకటించారు. ఇప్పటివరకు దేశంలోని 82వేల ఏటీఎంలను రీక్యాలిబరేట్ చేసినట్లు ఆయన చెప్పారు. మిగిలినవాటిని కూడా త్వరలోనే సిద్ధం చేస్తామన్నారు. మొత్తం ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు.. కొన్ని ప్రైవేటు బ్యాంకుల డెబిట్ కార్డుల మీద కూడా సర్వీసు చార్జీని ఈ సంవత్సరం డిసెంబర్ 31వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు దాస్ చెప్పారు. ఇక పెద్ద నోట్ల రద్దు కారణంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించడానికి వీలుగా.. జిల్లా కేంద్ర సహకార బ్యాంకులకు (డీసీసీబీ) నాబార్డ్ రూ. 21వేల కోట్లను మంజూరు చేసిందని ఆయన తెలిపారు. డీసీసీబీలలో తగినంత నగదు సిద్ధంగా ఉండేలా చూడాలని నాబార్డు, రిజర్వు బ్యాంకులకు కేంద్రప్రభుత్వం సూచించింది. ఫీచర్ ఫోన్ల ద్వారా చేసే అన్ని డిజిటల్ లావాదేవీల మీద ఎలాంటి సర్వీసు చార్జి ఈ సంవత్సరం డిసెంబర్ 31వ తేదీ వరకు ఉండబోదని కూడా శక్తికాంత దాస్ చెప్పారు. ఈ వ్యాలెట్ల వాడకాన్ని మరింత ప్రోత్సహించేందుకు గాను వాటి పరిమితిని కూడా రూ. 10వేల నుంచి రూ. 20 వేలకు పెంచినట్లు తెలిపారు.