డెబిట్ కార్డులపై సర్వీసు చార్జి రద్దు
డెబిట్ కార్డులపై సర్వీసు చార్జి రద్దు
Published Wed, Nov 23 2016 6:25 PM | Last Updated on Thu, Sep 27 2018 9:08 PM
పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటిగా పలు రకాల చర్యలను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా మరో ఉపశమన చర్యను ప్రకటించింది. డెబిట్ కార్డుల వాడకాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా.. వాటి వాడకంపై సర్వీసుచార్జీని ఈ ఏడాది చివరివరకు రద్దు చేస్తున్నట్లు ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ ప్రకటించారు. ఇప్పటివరకు దేశంలోని 82వేల ఏటీఎంలను రీక్యాలిబరేట్ చేసినట్లు ఆయన చెప్పారు. మిగిలినవాటిని కూడా త్వరలోనే సిద్ధం చేస్తామన్నారు.
మొత్తం ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు.. కొన్ని ప్రైవేటు బ్యాంకుల డెబిట్ కార్డుల మీద కూడా సర్వీసు చార్జీని ఈ సంవత్సరం డిసెంబర్ 31వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు దాస్ చెప్పారు. ఇక పెద్ద నోట్ల రద్దు కారణంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించడానికి వీలుగా.. జిల్లా కేంద్ర సహకార బ్యాంకులకు (డీసీసీబీ) నాబార్డ్ రూ. 21వేల కోట్లను మంజూరు చేసిందని ఆయన తెలిపారు. డీసీసీబీలలో తగినంత నగదు సిద్ధంగా ఉండేలా చూడాలని నాబార్డు, రిజర్వు బ్యాంకులకు కేంద్రప్రభుత్వం సూచించింది.
ఫీచర్ ఫోన్ల ద్వారా చేసే అన్ని డిజిటల్ లావాదేవీల మీద ఎలాంటి సర్వీసు చార్జి ఈ సంవత్సరం డిసెంబర్ 31వ తేదీ వరకు ఉండబోదని కూడా శక్తికాంత దాస్ చెప్పారు. ఈ వ్యాలెట్ల వాడకాన్ని మరింత ప్రోత్సహించేందుకు గాను వాటి పరిమితిని కూడా రూ. 10వేల నుంచి రూ. 20 వేలకు పెంచినట్లు తెలిపారు.
Advertisement