సాక్షి,ముంబై: దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) వినియోగదారులకు మరో చేదువార్త చెప్పింది. రోజువారీ క్యాష్ విత్‌డ్రాయల్ పరిమితిని మరింత కుదించింది. ఏటీఎం ద్వారా రోజువారీ నగదు ఉపసంహరణపై కస్టమర్లకు షాకిచ్చింది. క్లాసిక్, మ్యాస్ట్రో డెబిట్ కార్డులు వినియోగిస్తున్న ఎస్‌బీఐ ఖాతాదారులు ఏటీఎంల ద్వారా వినియోగదారులు పొందే నగదును సగానికి కోత పెట్టి కేవలం రూ.20వేలుగా నిర్ణయించింది. ఇంతకుముందు ఈ పరిమితి 40వేల రూపాయలుగా ఉంది. అయితే అక్రమ లావాదేవీలు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. అలాగే డిజిటల్, నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఎస్‌బీఐ తెలిపింది. అక్టోబర్ 31 నుంచి ఇది అమల్లోకి రానున్నట్టు ప్రకటించింది.
డిజిటల్ లావాదేవీలలో పెరుగుదల ఉన్నప్పటికీ, నగదు డిమాండ్ ఎక్కువగా ఉందని ఎస్‌బీఐ మేనేజింగ్ డైరెక్టర్ పికె గుప్తా చెప్పారు. తాజా అంచనాల ప్రకారం, నోట్ల రద్దు ముందు కంటే నగదు డిమాండ్ భారీగా ఉందని తెలిపారు. తాజానిర్ణయం వినియోగదారుల అసౌకర్యానికి దారితీస్తుందా అని ప్రశ్నించినపుడు అంతర్గత విశ్లేషణ అనంతరం 20వేల రూపాయల మొత్తం చాలామంది వినియోగదారులకు సరిపోతుందని భావిస్తున్నామన్నారు. అలాగే స్వల్ప ఉపసంహరణలు ద్వారా మోసాలను తగ్గించేందుకు వీలవుతుందా లేదా అనేది పరిశీలించనున్నట్టు చెప్పారు.
మరోవైపు దీనిపై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో, ముఖ్యంగా వైద్య అవసరాల నిమిత్తం ఇప్పటికే పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని, తాజా నిర్ణయంతో మరిన్ని కష్టాలు తప్పవని వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment