సాక్షి, న్యూఢిల్లీ : నెలవారీ కనీస మొత్తాల నిబంధనల నుంచి స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా కస్టమర్లకు కొంత ఉపశమనం కల్పించింది. వీటిపై విధించే ఛార్జీలను, ఈ మొత్తాన్ని ఎస్‌బీఐ సమీక్షించింది. కనీసం బ్యాంకు ఖాతాల్లో తప్పనిసరిగా ఉంచాల్సిన మొత్తాన్ని మెట్రోపాలిటన్ నగరాల్లో రూ.5000 నుంచి రూ.3000కు తగ్గిస్తున్నట్టు ఎస్‌బీఐ సోమవారం ప్రకటించింది. అంతేకాక పెన్షనర్లను, ప్రభుత్వం నుంచి సామాజిక ప్రయోజనాలు పొందే లబ్దిదారులను, మైనర్ అకౌంట్లను, ఫైనాన్సియల్ ఇంక్లూజిన్ అకౌంట్లను ఈ నిబంధన నుంచి మినహాయిస్తున్నట్టు చెప్పింది. పీఎంజేడీఐ అకౌంట్లు, బేసిక్ సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్ అకౌంట్లు కేటగిరీలను ఇప్పటికే ఎస్‌బీఐ ఈ నిబంధన నుంచి మినహాయించిన సంగతి తెలిసిందే. మినిమమ్ అకౌంట్ బ్యాలెన్స్‌ను నిబంధనను పాటించిన వారికి వేస్తున్న ఛార్జీలను కూడా 20 శాతం నుంచి 50 శాతం వరకు తగ్గించింది. అందరికీ ఈ తగ్గించిన ఛార్జీలే వర్తిస్తాయని బ్యాంకు తెలిపింది.
ప్రస్తుతం ఈ ఛార్జీలను సెమీ-అర్బన్, రూరల్ ప్రాంతాల వారికి రూ.20 నుంచి రూ.40 వరకు, అర్బన్, మెట్రో సెంటర్ల వారికి రూ.30 నుంచి రూ.50 వరకు విధించనున్నట్టు చెప్పింది. ఈ సమీక్షించిన ఛార్జీలు 2017 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. కనీస నగదు నిల్వలను ఉంచని ఖాతాదారులపై సర్వీస్ టాక్స్‌తో పాటు 100 రూపాయల పెనాల్టీని విధించనున్నట్టు ఎస్‌బిఐ అంతకముందు ప్రకటించిన సంగతి తెలిసిందే. 50 శాతం కంటే తక్కువ నిల్వలున్న ఖాతాలపై సర్వీస్ టాక్స్‌తో పాటు 50 రూపాయలు, 50-75 శాతం తక్కువ ఉన్న నిల్వలపై సర్వీస్ టాక్స్ సహా 75 రూపాయల పెనాల్టీని బ్యాంకు విధిస్తోంది. ఇక నుంచి ఈ ఛార్జీలు తగ్గిపోనున్నాయి. జన్‌ధన్ అకౌంట్లకు కూడా ఎలాంటి ఛార్జీలు వర్తించవని ఎస్‌బీఐ ఓ ప్రకటనలో తెలిపింది.
The Monthly Average Balance in Savings Bank Accounts has been revised w.e.f. 1/10/2017. For more details visit: https://t.co/lGxM6RRO37 pic.twitter.com/i0cDsR6XJV
— State Bank of India (@TheOfficialSBI) September 25, 2017