కారు రుణాలపై ఎస్‌బీఐ ప్రాసెసింగ్ ఫీజు మాఫీ
పసిడి, వ్యక్తిగత రుణాలపై కూడా సగం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ పరిమిత కాలానికి కారు, బంగారం, వ్యక్తిగత రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు నుంచి పూర్తిగా మినహాయింపు కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే గృహ రుణాల టేకోవర్‌పై ఈ తరహా ఆఫర్ ఇస్తున్నట్లు వివరించింది. తాజాగా ఈ ఏడాది డిసెంబర్ 31 దాకా కారు లోన్స్‌పై 100% ప్రాసెసింగ్ ఫీజు మాఫీ చేసినట్లు పేర్కొంది. అలాగే అక్టోబర్ 31 దాకా బంగారం రుణాలపై 50 శాతం మేర మినహాయింపు కల్పిస్తున్నట్లు ఎస్‌బీఐ తెలిపింది. ఇక, సెప్టెంబర్ 30 దాకా వ్యక్తిగత రుణాలకు సంబంధించి ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ స్కీముపై 50% మేర ప్రాసెసింగ్ ఫీజు మాఫీ చేసినట్లు పేర్కొంది. బీఎస్‌ఈలో సోమవారం ఎస్‌బీఐ షేరు 1.44% క్షీణించి రూ. 274.65 వద్ద ముగిసింది.
పొదుపు ఖాతాలపై దేనా బ్యాంక్ వడ్డీ తగ్గింపు
దేనా బ్యాంక్ తాజాగా పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లు అరశాతం తగ్గించింది. ఇకపై రూ. 25 లక్షల దాకా డిపాజిట్లు ఉండే సేవింగ్స్ అకౌంట్లపై 3.5% వడ్డీ రేటు ఉంటుందని పేర్కొంది. అయితే, రూ. 25 లక్షలకు పైబడిన మొత్తాలపై మాత్రం యధాప్రకారంగా 4% వడ్డీ రేటు కొనసాగుతుందని వివరించింది.