విద్యా రుణం డిఫాల్ట్ అయితే బ్యాంకు ఉద్యోగాలివ్వం
* నోటిఫికేషన్‌లో ఎస్‌బీఐ షరతులు...
* వెల్లువెత్తుతున్న విమర్శలు...
చెన్నై: విద్య, ఇతర రుణాల చెల్లింపుల్లో విఫలమైన వ్యక్తి బ్యాంక్ ఉద్యోగాలకు అనర్హుడని ఎస్‌బీఐ పేర్కొనడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ/కుటుంబ పరిస్థితులు బాగోలేని కారణంగా పలువురు రుణాలను సరిగ్గా చెల్లించలేకపోయారని, వీరిని ఎస్‌బీఐ ఉద్యోగాలకు అనర్హులని నోటిఫికేషన్‌లో పేర్కొనడం సమంజసం కాదని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్(ఏఐబీఈఏ) జనరల్ సెక్రటరీ సి. హెచ్. వెంకటాచలం విమర్శించారు.
ఈ నిబంధనను తక్షణం తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్థిక వ్యవస్థ బాగా లేదని, ఫలితంగా కంపెనీల రుణాలు మొండి బకాయిలుగా మారుతున్నాయని, అందుకని ఫ్రెషర్స్‌కు ఉద్యోగవకాశాలు లభించడం లేదని, నిరుద్యోగం పెరిగిపోతోందని వివరించారు. ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా బ్యాంక్‌లు ప్రకటించిన విజయ్ మాల్యా పార్లమెంట్ సభ్యుడయ్యాడని, కానీ తగిన కారణాలతో రుణ చెల్లింపుల్లో విఫలమయ్యే పేద విద్యార్ధులను మాత్రం ఎస్‌బీఐ ఉద్యోగాలకు ఎస్‌బీఐ అనర్హుడిని చేస్తోందని ఆయన ఎద్దేవా చేశారు.
తాజా పట్టభద్రులకు ఉద్యోగం రానిదే విద్యారుణం చెల్లించలేరని, అసలు ఉద్యోగాలకే దరఖాస్తు చేయకూడదని ఎస్‌బీఐ పేర్కొనడంతో వారు రుణాలను ఎలా చెల్లిస్తారని ఆయన ప్రశ్నించారు. విద్యారుణం అవసరమై తీసుకునే నిజమైన అభ్యర్ధులకు ఎస్‌బీఐ షరతు చేటు చేస్తుందని ఎడ్యుకేషన్ లోన్ టాస్క్ ఫోర్స్(ఈఎల్‌టీఎఫ్) కన్వీనర్ కె. శ్రీనివాసన్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం విద్యారుణాలకు వడ్డీ సబ్సిడీని చెల్లిస్తుందని, అలా చెల్లించకపోయినా, ఆ విద్యారుణాన్ని మొండి బకాయిలుగా పరిగణిస్తారని వివరించారు. విద్యారుణం చెల్లించని వారి పేర్లను బహిరంగంగా వెల్లడించిన తర్వాత, వారిని ఉద్యోగాలకు దరఖాస్తు చేయకుండా ఎస్‌బీఐ తాజాగా అడ్డుపడుతోంది.