
రాజన్ పేరుతోనూ ‘లాటరీ’ స్కామ్‌లు!
నమ్మొద్దంటూ ప్రజలకు ఆర్‌బీఐ హెచ్చరిక
న్యూఢిల్లీ: బ్యాంక్ లాటరీ స్కామ్‌లు రోజుకో అవతారం ఎత్తుతున్నాయి. ఏకంగా రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ ఫొటో, పేరును కూడా మోసగాళ్లు వినియోగిస్తున్న ఉదంతాలు తాజాగా వెలుగుచూశాయి. ‘మీరు లాటరీలో రూ.5.5 కోట్లు గెలుచుకున్నారు. అప్రూవల్ ఫీజు కింద రూ.15,500 నగదు డిపాజిట్ చేస్తే మీ అకౌంట్లోకి డబ్బు జమచేస్తాం.
బ్రిటిష్ ప్రభుత్వం ఆర్‌బీఐకి ఇచ్చిన నిధుల్లో భాగంగా ఈ లాటరీని అందిస్తున్నాం’ అంటూ రాజన్ పేరుతో కొంతమందికి ఈ-మెయిల్స్ వెళ్తున్నట్లు ఆర్‌బీఐ దృష్టికి వచ్చింది. ఇటువంటి ఆఫర్లను నమ్మొద్దని.. వీటిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్‌బీఐ హెచ్చరించింది. బ్యాంకు అకౌంట్లు, క్రెడిట్/డెబిట్ కార్డులు, ఆన్‌లైన్ బ్యాం కింగ్, విదేశాల నుంచి నగదు బట్వాడా వంటి రూపంలో వ్యక్తులతో నేరుగా తాము ఎలాంటి లావాదేవీలు నిర్వహించమని స్పష్టం చేసింది.
మొబైల్ బ్యాంకింగ్‌పై దృష్టిపెట్టాలి...
మొబైల్ బ్యాంకింగ్ సేవలకు ఖాతాదారులు నమోదు చేసుకునే ప్రక్రియను సులభతరంగా ఉండేలా చూడాలని ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసింది. మొబైల్ బ్యాంకింగ్‌కు నమోదు చేసుకోవడం, యాక్టివేషన్, వాడకం తదితర అంశాలపై బ్యాంకులు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించింది.