పెరగనున్న లో వోల్టేజీ విద్యుత్ ఉపకరణాల ధరలు
అధిక జీఎస్‌టీ కారణం: స్నీడర్ ఎలక్ట్రిక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వస్తు సేవల పన్ను(జీఎస్‌టీ) అమలు తర్వాత అంటే జూలై 1 నుంచి 1,000 ఓల్టేజ్ కంటే తక్కువ సామర్థ్యమున్న విద్యుత్ ఉపకరణాల ధరలు 10–15% మేర పెరుగుతాయని స్నీడర్ ఎలక్ట్రిక్ రీజినల్ డైరెక్టర్ ప్రేమ్ రాచకొండ తెలిపారు. ప్రస్తుతం వీటికి 14.5–25% పన్ను శ్లాబులుండగా.. జీఎస్‌టీలో వీటికి 28% పన్ను శ్లాబును కేటాయించడమే కారణమని ఆయన పేర్కొన్నారు. ఎంసీబీ, ఆర్‌సీసీబీ, డిస్ట్రిబ్యూషన్ బోర్డులు, స్విచులు వంటి ఫైనల్ డిస్ట్రిబ్యూషన్ వైరింగ్ డివైజ్ మార్కెట్ దేశంలో రూ.5 వేల కోట్లుగా ఉందని.. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాటా రూ.325 కోట్లని తెలియజేశారు.
ఏటా ఈ విభాగం 3–4% వృద్ధిని సాధిస్తుందని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విభాగంలో వ్యాపార విస్తరణలో భాగంగా స్విచ్ ఆన్ ఇండియా పేరిట మొబైల్ క్యాంపెయిన్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాన్‌లో ఎలక్ట్రిక్, వైరింగ్ ఉపకరణాలను ప్రదర్శిస్తారు. వచ్చే నెల రోజుల్లో 8 వాహనాలు దేశంలోని 100 నగరాల్లో ప్రచారం చేస్తామన్నారు.